‘హార్వీ వెయిన్‌స్టీన్‌’పై చిన్మయి వ్యంగ్య ట్వీట్‌!

Chinmayi Sripada Satirical Tweet On Harvey Weinstein Sentenced 23 Years - Sakshi

చెన్నై: అత్యాచార ఆరోపణల కేసులో ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ జైలుపాలు కావడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. అనేక మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హార్వీకి 23 ఏళ్ల శిక్ష పడిందన్న చిన్మయి.. భారత రాజకీయ పార్టీలపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ మేరకు... ‘‘ప్రస్తుతం తాను భారత్‌లో జన్మించి ఉంటే బాగుండేదని హార్వీ కోరుకుని ఉంటాడు. ముఖ్యంగా తమిళనాడులో పుట్టాలని బలంగా అనుకుని ఉంటాడు. ఇక్కడైతే తను స్టార్లు, రాజకీయ నాయకులతో సంతోషంగా పార్టీలు చేసుకునేవాడు. పద్యాలు, కవితలు రాసుకునేవాడు. నువ్వు గనుక ఇక్కడ ఉండి ఉంటే 100 శాతం రాజకీయపార్టీలు నీకే మద్దతుగా నిలిచేవి’’ అని ట్విటర్‌లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.(లైంగిక వేధింపుల కేసు.. బడా నిర్మాతకు భారీ షాక్‌!)

కాగా లైంగిక వేధింపుల కేసులో హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూయార్క్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా హార్వీ మాట్లాడుతూ.. ‘‘నాకు అంతా అయోమయంగా ఉంది. నేను దేశం గురించి బాధపడుతున్నా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో చిన్మయి పైవిధంగా ట్వీట్‌ చేశారు. అదే విధంగా హార్వీ వర్సెస్‌ వైరముత్తు అంటూ హార్వీ వెయిన్‌స్టీన్‌, ప్రముఖ పాటల రచయిత వైరముత్తుకు సంబంధించిన వార్తా కథనాల ఫొటోలను షేర్‌ చేశారు.('ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి')

కాగా హార్వీ ఉదంతంతో హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమాన్ని భారత్‌లో బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించగా... దక్షిణాదిన చిన్మయి ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. తను ఇచ్చిన స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపపెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా.. చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక చిన్మయిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top