‘మన్మోహన్‌ జీ చరిత్ర మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోదు’

Anupam Kher Says History Will Not Misjudge Manmohan Singh - Sakshi

టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. వీటిలో రాయకీయ నాయకుల జీవితాల ఆధారంగా వస్తోన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగులో బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఇంకా సెట్స్‌ మీద ఉండగా.. మన్మోహన్‌ బయోపిక్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది.

ఈ చిత్రంలో మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తుండగా..  సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ కనిపించనున్నారు. సంజయ్‌ బారు రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని అనుపమ్‌  ఖేర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సెట్‌లో తీసిన ఓ వీడియోను అనుపమ్‌ ఖేర్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

‘‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ షూటింగ్‌ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు మన్మోహన్‌ జీ గురించి నాలో కొన్ని అభిప్రాయాలండేవి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఈ రోజు షూటింగ్‌ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదు. మీరు మా సినిమా చూసిన తర్వాత మీతో కలిసి కప్పు టీ తాగాలని ఉంది’ అని అనుపమ్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సెట్లో నటి సజ్జన్‌ బెర్నర్ట్‌తో మాట్లాడుతున్న వీడియోను అనుపమ్‌ షేర్‌ చేశారు. దీన్ని వీక్షించిన నెటిజన్స్ మీరిద్దరూ అచ్చం మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ లాగానే ఉన్నారని కామెంట్లు పెట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top