ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేనిది..

Aamir Said How Industry Reacts About 1996 Mumbai Riots - Sakshi

‘ఐకమత్యమే మహాబలం’...వినడానికి చాలా చిన్న మాటే కానీ చాలా విలువైనది. కలసికట్టుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా తేలికగా పరిష్కరించవచ్చు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ మాట వర్తిస్తుందిని..దీన్ని ఆచరిస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫేక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని..సామాజిక అంశాల సంగతి అటుంచి స్వయంగా సొంత పరిశ్రమలో వ్యక్తులకు ఇబ్బందులు ఎదురయినప్పుడు కూడా అందరూ కలిసి రావడం లేదని ఆరోపించారు.

‘2014లో కరణ్‌ జోహర్‌ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాలో పాకిస్తాన్‌ నటి ఫవాద్‌ ఖాన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నందుకు ఆ చిత్రం విడుదలకు శివసేన అధ్యక్షుడు రాజ్‌ థాక్రే ఒప్పుకోలేదు. ఈ విషయంలో కరణ్‌కు మద్దతు ఇచ్చినవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒక్క మహేష్‌ భట్‌ తప్ప మిగితా ఏ నిర్మాత కరణ్‌కు మద్దతుగా నిలబడలేదు. చివరకు కరణ్‌ రూ. 5 కోట్లను సైన్య సహాయ నిధిగా ఇస్తానని ఒప్పుకొవడంతో సమస్య సద్దుమణిగింద’న్నారు.

‘ఖాన్‌’ సినిమాలకు తప్పని తిప్పలు...
కరణ్‌కే కాక ఖాన్‌ హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు. 2006లో వచ్చిన ఆమిర్‌ చిత్రం ‘ఫనా’కు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమిర్‌ ‘నర్మదా బచావో’ ఆందోళనకు మద్దతివ్వడంతో ‘ఫనా’ సినిమాను గుజరాత్‌లో విడుదల చేయకుండా నిషేదిండమే కాక ఆమిర్‌ను క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేశారు. కానీ ఆమిర్‌ అందుకు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా ఆమిర్‌కు మద్దతివ్వలేదు. గతేడాది విడుదలయిన షారుక్‌ ఖాన్‌ చిత్రం ‘రాయీస్‌’ విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తాయి. ఈ చిత్రంలో పాకిస్తాన్‌ నటి మహిరా ఖాన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. చిత్రం విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశంతో షారుక్‌ ముందుగానే రాజ్‌థాక్రేను కలిసి మాట్లాడాడు. రాయీస్‌ చిత్ర ప్రచార కార్యక్రమంలో మహిరా ఖాన్‌ పాల్గొనదని హామీ ఇచ్చాడు.


ఇలా ప్రతి సారీ సినిమా విడుదలకు ముందు రాజకీయ నాయకులను కలిసి వారికి సమాధానం చెప్పడం, లేదా క్షమాపణలు కోరడం పరిపాటి అయ్యింది. లేకపోతే వారు సినిమా విడుదలవ్వకుండా సమస్యలు సృష్టిస్తారన్నారు.

ఆ రోజులను మర్చిపోలేము...
అయితే ఒకప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావని, 1993 నాటి ‘ముంబయి అ‍ల్లర్ల’ విషయాన్ని గుర్తుచేసుకున్నారు ఆమిర్‌. అల్లర్ల సమయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మొత్తం చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. బాంబేలో అల్లర్లు చెలరేగిన సమయంలో వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావడం కోసం పరిశ్రమ నుంచి ఏమైనా చేయాలని సునీల్‌ దత్‌ భావించారు. నాతోపాట మరికొందరు పరిశ్రమ ప్రముఖులతో చర్చించి 40 మందితో ఒక కమిటీ వేసారు. వీరంతా అప్పటి మహారాష్ట్ర సీఎం సుధాకర్రావ్‌ నాయక్‌ను కలిసి బాంబేలో చెలరేగుతున్న హింసను ఆపాలని కోరారు. అంతటితోను తమ పని అయిపోయిందని అనుకోకుండా అల్లర్లకు నిరసనగా మంత్రాలయం దగ్గర ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు.


అప్పట్లో మీడియ ఇంతగా లేకపోవడం వల్ల ఈ విషయానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు లేవు. అల్లర్లు ఆగేంతవరకూ నిరసన కొనసాగించాలని దత్‌ సాబ్‌ నిర్ణయించారు. కనుక వంతుల వారిగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము. నిరసన తొలిరోజు రాత్రి సునీల్‌ దత్‌, యష్‌ చోప్రా, జానీ వాకర్‌తో పాటు నేను కూడా నిరసన ప్రదేశం వద్ద ఉన్నాను. ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. రాత్రంతా అక్కడే ఉన్న మాకు మరుసటిరోజు ఉదయం కొందరు టీ, టిఫిన్‌ తీసుకువచ్చి మాతోపాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరకూ ముఖ్యమంత్రి దిగి వచ్చారు. మళ్లీ బాంబే మాములుగా అయిన తర్వాతే మా నిరసనను విరమించుకున్నాము. నిజంగా ఆ రోజులు ఎంతో బాగుండేవ’ని తెలిపారు.

ప్రస్తుతం హీరోలకు స్టార్‌డమ్‌, సోషల్‌ మీడియా మద్దతూ ఇంత భారీగా ఉన్నప్పుడు మనం మన సమస్యల గురించి మరింత బాగా పోరాడవచ్చు. ఇండస్ట్రీలో అందరి మధ్య మంచి సంబంధాలు ఉండి ఐక్యంగా ఉంటే ఇలాంటి సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చు. కానీ విషాదం ఏంటంటే ఇక్కడ(బాలీవుడ్‌లో) కోట్లు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ మారడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు.’ అని ఆమిర్‌ వ్యాఖ్యలు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top