మీ బంధంలో ఈ నాలుగు లక్షణాలు ఉంటే..

Four Signs That Shows You Are In The Wrong Relationship - Sakshi

అన్ని జంటల మధ్య బంధం ఒకేలా ఉండదు. ఓ జంట ప్రేమగా ఉంటే.. మరో జంట ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటుంది. పూర్తిగా బంధంలోకి అడుగుపెట్టేంతవరకు గానీ, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోలేము. పార్ట్‌నర్‌ మన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత లైఫ్‌ హ్యాపీగా సాగిపోతుంటే పర్లేదు. అలా కాకుంటే మటుకు.. కాలం గడుస్తున్న కొద్ది ఎదుటి వ్యక్తి మీద విరక్తి పుట్టుకువస్తుంది. ఇలాంటి సమయంలో కొంతమంది మాత్రమే ధైర్యం చేసి బంధానికి బ్రేకప్‌ చెప్పేసి తమదారి చూసుకుంటారు. మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఎదుటి వ్యక్తి తప్పులను పక్కన పెట్టి కాలం వెల్లదీస్తుంటారు. ఈ ఇద్దరూ కాకుండా మరికొందరు ఏది మంచో ఏది చెడో తెలియక కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు ఈ క్రింది లక్షణాలను తమ  ప్రేమ బంధంలో చూసినట్లయితే ఆ బంధానికి బ్రేకప్‌ చెప్పటం మేలు.

1) బ్యాడ్‌ కమ్యూనికేషన్‌ 
ఏ జంట సంతోషంగా ఉండాలన్నా వ్యక్తుల మధ్య ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ ఉండటం తప్పని సరి. సరైన కమ్యూనికేషన్‌ వల్లే బంధం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా.. మీరు మీ భాగస్వామితో మాట్లాడటానికి భయపడుతున్నా​! లేక, మీ భావాలను సరిగ్గా అతడితో పంచుకోలేకపోతున్నా తప్పని సరిగా ఆలోచించాల్సిన విషయమే. ఎదుటి వ్యక్తితో అరమరికలు లేకుండా మాట్లాడలేకపోతున్నట్లయితే మీరు కోరుకుంటున్న ప్రేమకు చాలా దూరంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. 

2) చెడు ప్రవర్తన 
భాగస్వామి యెక్క చెడు ప్రవర్తన మంచి బంధానికి ఓ గొడ్డలిపెట్టులాంటిది. మీ పార్ట్‌నర్‌ మీ పట్ల తరచుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా లేక, చీటికిమాటికి తిడుతున్నా ఓ సారి ఆలోచించాల్సిన విషయమే. మన గౌరవానికి భంగం కలిగిస్తూ.. అమర్యాదగా నడుచుకునే వ్యక్తులతో బంధం మంచిది కాదని గుర్తించాలి. ప్రతిక్షణం వారి సూటి పోటి మాటలతో, చేష్టలతో మిమ్మల్ని మానసికంగా,శారీరకంగా బాధకు గురిచేస్తున్నట‍్లయితే అలాంటి వారితో తెగతెంపులు చేసుకోవటం మంచింది. 

3) మిమ్మల్ని మీరు కోల్పోతున్నారా? 
గుడ్డికంటే మెల్ల నయం అన్న చందాన ఒంటరిగా ఉండటం ఇష్టం లేక బంధంలోకి అడుగుపెట్టే వారు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత కూడా బంధంలో ఒంటరి తనాన్ని ఫీలవుతుంటారు. ఎదో సర్దుకుపోతూ ఎదుటి వ్యక్తితో కాలం వెల్లదీస్తుంటారు. వీళ్లు ఆనందంగా ఉండలేక, ఎదుటి వ్యక్తిని ఆనందపెట్టలేక నిత్యం బాధపడుతుంటారు. 

4) మొదటి ప్రాధాన్యత 
మీ భాగస్వామి మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం అన్నది కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. అన్ని విషయాల్లో కాకపోయిన ముఖ్యమైన విషయాల్లోనైనా మీకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రధానం. అలా కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ మిమ్మల్ని మూడో వ్యక్తిగా చూడటం బాధకు గురిచేస్తుంది. గతంలో మీరు ఈ విషయంపై పార్ట్‌నర్‌తో చర్చించినా ఫలితం లేకుంటే మీ బంధం గురించి ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top