వయోజన ‘మిథ్య’!

What Is The Future Of Saakshar Bharath - Sakshi

సాక్షర భారత్‌ కొనసాగింపుపై సందిగ్ధం

నెరవేరని అక్షరాస్యతా లక్ష్యం

వేతనాలందక సిబ్బందిలో అయోమయం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వయోజనులకు విద్యా బుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం 2010 నుంచి కొనసాగించిన సాక్షర భారత్‌ కార్యక్రమం ఇప్పుడు నిలిచిపోయి క్షేత్రస్థాయిలో అనుకున్న లక్ష్యం సాధ్యం కావట్లేదు. ఈ ప్రక్రియ ఆగిపోయి ఏడాది కావస్తున్నా..ఇందులో పనిచేసిన మండల కోఆర్డినేటర్లు, గ్రామానికి ఇద్దరి చొప్పున విలేజ్‌ కోఆర్డినేటర్లకు వేతనాల చెల్లింపు ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేదు. గౌరవ వేతనాలు అందక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఏళ్లుగా ఇందులోనే కొనసాగిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. దీనిని కొనసాగిస్తారేమోననే ఆశను వదలుకోలేక, ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తారా..? లేదా..? అనే విషయాలపై ఎంతకీ స్పష్టత రాక అవస్థ పడుతున్నారు.

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బృహత్తర లక్ష్యంతో ప్రవేశపెట్టిన సాక్షర భారత్‌ కొండెక్కింది. అక్షరాస్యతా శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2010లో సాక్షరభారత్‌ను ప్రవేశపెట్టి..నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. గ్రామాల్లో కూలీలు, సామాన్యులు పగటి వేళల్లో పనులకు వెళ్తుంటారని, సాయంత్రం సమయంలో వీరికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. పథకం లక్ష్యం 2017 సెప్టెంబర్‌ వరకుగా నిర్ణయించి, 2018 మార్చి వరకు పొడిగించారు. అయితే లక్ష్యం ఘనమైనా ఆచరణలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. నూరుశాతం అక్షరాస్యతను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఈ పథకం ద్వారా తీరలేదు.

అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వయోజన విద్య శాఖ ద్వారా సాక్షరభారత్‌ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగట్లేదు. కొన్నేళ్లుగా జిల్లాలో అమలవుతున్న సాక్షరభారత్‌ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి. అయితే పర్యవేక్షణ లోపం..ఇతర కారణాలతో ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో కూడా వయోజన విద్య కేంద్రాలు అంతంతమాత్రంగానే నడిచాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్షరాస్యతకు చేరువవుతున్న దశలో ప్రభుత్వం సాక్షరభారత్‌ను నిలిపివేసే ఆలోచనలో ఉండటం పథకం లక్ష్యాలను దెబ్బతీసేలా ఉంది. అందరికీ విద్యను అందించాలంటే సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కొనసాగింపుపై కేంద్రాన్ని కోరాలని అంటున్నారు.

కొణిజర్ల మండలం చిన్నగోపతిలో సాక్షరభారత్‌ కేంద్రం 

సాక్షరభారత్‌ సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకం.. 

సాక్షరభారత్‌ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అనే విషయం తేలకపోవడంతో ఇందులో పనిచేస్తున్న ఎంసీవోలు, వీసీవోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లోని 631 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పథకంలో మండలానికి ఒక కో ఆర్డినేటర్‌ (ఎంసీఓ), గ్రామానికి ఇద్దరు విలేజ్‌ కో ఆర్డినేటర్లు (వీసీఓ) ఉంటారు. మొత్తం 631 గ్రామ పంచాయతీల్లో 1262 మంది విలేజ్‌ కోఆర్డినేటర్లు ఉన్నారు. మండలానికి ఒక కో ఆర్డినేటర్‌ చొప్పున 36 మంది మండల కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు.

ఒకవైపు పథకం పొడిగిస్తారో లేదో అనే అనుమానాలతోపాటు గత కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలేజ్‌ కో ఆర్డినేటర్లకు రూ.2వేల గౌరవ వేతనం, మండల కో ఆర్డినేటర్లకు రూ.6వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే వీసీవోలకు 7 నెలలు, ఎంసీవోలకు 6నెలల గౌరవ వేతనం ఇంకా అందాల్సి ఉంది. ప్రతి ఆరునెలలకోసారి వీరికి జీతాలు రావాలి. అదే సమయానికి పథకం పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వీరికి వేతనాలు అందలేదు. అయితే ప్రభుత్వం వీరిని అనేక పనులకు వినియోగించుకుంది. పథకం పొడిగించేది..? లేనిది కేంద్రం స్పష్టం చేసి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని వారు కోరుతున్నారు.  

పొడిగింపుపై స్పష్టత లేదు.. 

సాక్షర భారత్‌ కార్యక్రమం 2018 మార్చితో ముగిసింది. ప్రభుత్వం నుంచి మాకు దీనిని పొడిగిస్తున్నట్లు కానీ..లేదా ఇతర ఏ సమాచారమూ రాలేదు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం మేం విధులు నిర్వహించనున్నాం.
– ధనరాజ్, డిప్యూటీ డైరెక్టర్, సాక్షర భారత్, ఖమ్మం

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top