రాష్ట్ర విభజనకు మద్దతివ్వం .. 22 ఎంపీ సీట్లు గెలుస్తాం  

BJP Not support state division : Yeddyurappa - Sakshi

రాష్ట్రం విడిపోతే కుమారస్వామిని ప్రజలు క్షమించరు

   ఆ ప్రాంత బంద్‌లకు బీజేపీ వెన్నుదన్ను

 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రకటన 

 బెంగళూరులో కోర్‌ కమిటీ భేటీ  

 ఆగస్టు 9 నుంచి నేతల రాష్ట్ర యాత్రలు  

సాక్షి బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని, అయితే ప్రయోజనాల సాధనకు మద్దతిస్తాం అని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. బెంగళూరులో పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఉత్తర, దక్షిణ కర్ణాటక విభజన, సీఎం కుమారస్వామి పాలనపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్‌ తరాలు కుమారస్వామిని క్షమించవని అన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 75 ఏళ్ల సీనియర్‌ నాయకుడిగా ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి తాను ఒప్పుకోనని యడ్డి చెప్పారు. ఆగస్టు రెండో తేదీన ఉత్తర కర్ణాటక పోరాట సమితి పిలుపుని చ్చిన ఉత్తర కర్ణాటక బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.  

బడ్జెట్లో ఉత్తరకు అన్యాయం  
కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందని యడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ నెలాఖరులో వాటాల్‌ నాగారాజు ఆధ్వర్యంలో జరిగే కర్ణాటక బంద్‌కు కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ బంద్‌లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రుణమాఫీ ప్రకటించారనే కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని చెప్పారు. కాగా, ఆగస్టు 9 నుంచి మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్ర బీజేపీ నేతలందరూ రాష్ట్ర పర్యటన చేస్తారని తెలిపారు. తొలి బృందంలో తాను, గోవింద కారజోళ, శోభ కరంద్లాజే, రెండో బృందంలో ఆర్‌.అశోక్, అరవింద్‌ లింబావళి, జగదీశ్‌ శెట్టర్, మూడో బృందంలో కేఎస్‌ ఈశ్వరప్ప, సీటీ రవి, లక్ష్మణ సవదిలు ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాధనలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
  
22 ఎంపీ సీట్లు గెలుస్తాం  
తమ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చించాం, అభ్యర్థుల ఎంపిక చర్చకు రాలేదని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలకు 22– 23 స్థానాలు కచ్చితంగా గెలుచుకోగలుగుతామని జోస్యం చెప్పారు.  ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీరాములు డిమాండ్‌ చేయడం లేదని, కేవలం ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసమే ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ మద్దతివ్వదని చెప్పారు. మీడియా ప్రతినిధులను విధానసౌధలోకి రానివ్వనని సీఎం అనడం సమంజసం కాదని అన్నారు. మీడియాను నిర్బంధించడం మంచి పరిణామం కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు.  

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top