ఉగ్రవాదంపై పోరును తీవ్రతరం చేసిన పాకిస్తాన్.. ఇందుకుగానూ ఫెడరల్ కౌంటర్ టైజం ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై పోరును తీవ్రతరం చేసిన పాకిస్తాన్.. ఇందుకుగానూ ఫెడరల్ కౌంటర్ టైజం ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ దళం తక్షణం అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. రక్షణ శాఖకు అనుబంధంగా ఇది పని చేస్తుందని, దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని పేర్కొంది.
ఈ దళం పౌర, మిలిటరీ, నిఘా, భద్రతా ఏజెన్సీలు, కౌంటర్ టైజం విభాగాలతో కలసి పనిచేస్తుందని తెలిపింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసంలో శుక్రవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదురి నిసార్ కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ.. ఐదువేల మందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, శుక్రవారం నాటి సమావేశంలో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై నిఘా పెట్టాలని వివిధ ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదల సంస్థలు, మిలిటెంట్లకు అందే నిధులపై ఆర్థిక శాఖ, స్టేట్ బ్యాంక్ పర్యవేక్షించనుంది.