ఆత్మహత్యల అడవంటే ఇదే!

ఆత్మహత్యల అడవంటే ఇదే! - Sakshi


టోక్యో: ఆ దట్టమైన అడవిలోకి అడుగుపెడితే దెయ్యాలు , భూతాలు తిరిగే ప్రాంతంలోకి వెళ్లినట్లు ఉంటుంది. ఎల్తైన చెట్ల మానులు పచ్చగా పాకురుపట్టినట్లు కనిపిస్తూ అల్లిబిల్లిగా అల్లుకొని ఎక్కడికక్కడ వేలాడుతున్న తీగలను చూస్తుంటే ఎంత ధైర్యవంతులకైనా గుండె జారిపోతున్నట్లు ఉంటుంది. ఇక అక్కడక్కడ చెట్లకు వేలాడుతున్న ఉరితాళ్లు గుండెలో గుబులు పుట్టిస్తాయి. ఒక్కో చోట మానవ కళేబరాలు, కొన్ని చోట్ల కుల్లిపోతున్న మాంసం ముద్దలతో వేలాడుతున్న మానవ శవాలను చూస్తే భయంతో ప్రాణాలే పోతాయి.



ఇంతటి భీతిని కలిగించే అడవిని జపాను భాషలో అహోకిఘరా (ఆత్మహత్యల అడవి), జుకాయ్‌ (చెట్ల సముద్రం) అని పిలుస్తారు. 30 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ అడవి ఫుజి అగ్ని పర్వతం క్రీస్తుశకం 864లో బద్దలై చల్లబడడంతో ఏర్పడిందట. జపాన్‌లో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునే నెంబర్‌ వన్‌ సైట్‌గా, ప్రపంచంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ వంతెన తర్వాత అత్యధిక ఆత్మహత్యలు చేసుకునే రెండో సైట్‌గా వ్యవహరిస్తున్నారు. 2004లో అత్యధికంగా 108 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. 2010లో 217 మంది ఆత్మహత్యలకు ప్రయత్నించారట. వారిలో ఎక్కువ మంది బతికారట.



జపాన్‌లో సంప్రదాయబద్ధంగా ఆత్మహత్యలు చేసుకోవడాన్ని గౌరవప్రదంగా చూస్తారు. స్థానిక భాషలో దీన్ని ‘సెప్పుకు’ అని పిలుస్తారు. ఊపిరాడకుండా నోరు, ముక్కు, కళ్లకు ఏదైనా గుడ్డ లేదా అలాంటిది కట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం జపాన్‌ సంప్రదాయం. అందుకని ఆత్మహత్యలను సామాజికంగా, చట్టపరంగా నేరంగా పరిగణించరు. జపాన్‌లో ఏటా 30 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అయినా ఈ ఆత్మహత్యల అడవిలో చనిపోయిన వారంతా ఆత్మహత్యలతో మరణించిన వారు కాదని, జబ్బు పడిన వారిని, వద్ధాప్యంలో ఉన్న వారిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ అడవిలో వదిలి పెట్టడం వల్ల మరణించిన వారు కూడా ఉన్నారని స్థానికులు చెబుతారు.



ఈ అడవిలో ఆత్మహత్యలను నిరోధించేందుకు ఓ ఎన్జీవో సంస్థ కషి చేస్తోంది. మనసు మార్చుకోవాల్సిందిగా కోరుతూ కొన్ని చోట్ల ఆ సంస్థ ఆత్మహత్యలకు పాల్పడేందుకు వచ్చే వారిని ఉద్దేశించి బోర్డులను ఏర్పాటు చేసింది. మనిషి ప్రాణం విలువ తెలియజేసే సూచనలు చేసింది. ఏదేమైనా ఆత్మహత్యల అడవిగా ముద్ర పడడంతో ఇక్కడ రెండు హాలివుడ్‌ చిత్రాలను, ఒక డాక్యుమెంటరీని నిర్మించారు. వాటిలో ‘ది సీ ఆఫ్‌ ట్రీస్‌’ ఒక చిత్రం కాగా, డాక్యుమెంటరీ ఇటీవలనే విడుదలైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top