
లండన్: జీహాదీ ఫైటర్లను ఆకట్టుకుని, తమ విధ్వంస రచనను కొనసాగించేందుకు ఐఎస్, బోకో హరమ్ సంస్థలు మహిళలు, బాలికలను ఎర వేస్తున్నాయి. మిలిటెంట్లపై తమ నియంత్రణను నిలుపుకునేందుకు ఆయా సంస్థలు కిడ్నాప్ చేసిన మహిళలు, బాలికలను వారికి సెక్స్ బానిసలుగా మార్చివేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన హెన్రీ జాక్సన్ ఉగ్ర సంస్థల వికృత విన్యాసాలను ఓ నివేదికలో వెల్లడించింది. కొత్తగా ఉగ్ర సంస్థల్లోకి రిక్రూట్ చేసుకునే యువతకు, విదేశాల్లో ధ్వంస రచనలో నిమగ్నమైన వారికి ఉత్తేజం కలిగించేందుకు వారికి మహిళలను భార్యలుగా, సెక్స్ బానిసలుగా ఎరవేస్తున్నారని రీసెర్చర్ నికితా మాలిక్ ఈ నివేదికలో పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు లైంగిక వేధింపుల పర్వాన్ని తమ ఉన్మాద చర్యల్లోకి తీసుకువచ్చాయని వ్యాఖ్యానించారు. నైజీరియాలోని బోకోహరం, సిరియాలో ఐఎస్ అయినా ఇవే విశృంఖల ధోరణులతో సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో బోకోహరం ఇస్లామిస్ట్ మిలిటెంట్లు నైజీరియాలోని వేలాది మహిళలు, బాలికలను అపహరించగా వారంతా నరక కూపంలో కూరుకుపోయారని చెప్పారు. ఇక 2014 ఏప్రిల్‌లో ఓ స్కూల్ నుంచి కిడ్నాప్ చేసిన 200 మందికి పైగా బాలికలను కుక్‌లు, సెక్స్ బానిసలు, చివరికి ఆత్మాహుతి బాంబర్లుగా బోకోహరం మార్చివేసింది. ఈ ఉగ్రసంస్థ నూతన తరం ఫైటర్లను తయారుచేసేందుకు అమాయక బాలికలు, మహిళలను బలవంతంగా మిలిటెంట్లచే లైంగిక దాడులకు ప్రేరేపించడం దారుణమని ఈ నివేదిక పేర్కొంది. ఇక 2014లో సిరియాలోని సింజార్‌కు సమీపంలోని ఓ గ్రామాన్ని చుట్టుముట్టిన ఐఎస్ ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో యాజిదీ మహిళలను అపహరించారు. వీరంతా ఐఎస్ మిలిటెంట్ల వికృత చేష్టలతో నరకం చవిచూస్తున్నారు. దాదాపు 5000 మంది యాజిదీలను ఊచకోత కోశారని, 7000 మంది మహిళలు, బాలికలను బలవంతంగా సెక్స్ బానిసలుగా చేశారని ఐరాస పరిశోధకులు అంచనా వేశారు.
దెబ్బతిన్న ఆర్థిక మూలాలతోనే...
ఐఎస్, బోకోహరామ్ ఉగ్ర సంస్థలు నిధుల ఊతం లభించకపోవడంతో తమ ఆపరేషన్లను కొనసాగించలేక సెక్స్ ట్రాఫికింగ్, భారీ మొత్తాలను డిమాండ్ చూస్తూ కిడ్నాపింగ్‌లకు దిగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. సంప్రదాయంగా ఈ ఉగ్ర గ్రూపులకు అందే నిధులు పలు కారణాలతో నిలిచిపోయాయని తెలిపింది. 2016లో కిడ్నాప్‌ల ద్వారా ఐఎస్ 3 కోట్ల డాలర్లను ఆర్జించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.