
మనీలా: దేశంలో నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో రూ. 3 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రతి రోజూ ముద్రిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నగదు లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని, అదనపు డిమాండ్‌ను అందుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నగదు పరిస్థితిపై గతవారం తాను సమీక్షించానని, 85 శాతం ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.‘అవసరం మేరకు నగదును సరఫరా చేస్తున్నాం. అదనపు డిమాండ్ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలో నగదు సంక్షోభం ఉందని నేను భావించడం లేదు’ అని చెప్పారు. దేశంలో రూ.7 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని గార్గ్ తెలిపారు. అవసరాని కంటే ఎక్కువ లభ్యత ఉందని అందువల్ల కొత్తగా రూ. 2 వేల నోట్లు ముద్రించాల్సిన అవసరం లేదన్నారు.