స్పర్శను గుర్తించే రోబో చర్మం

Robots Can Respond To Touch - Sakshi

బెర్లిన్‌: ఇకపై రోబోలు స్పర్శకు స్పందిస్తాయి. చుట్టూ ఉన్న వేడిని, వాతావరణంలో మార్పును, ప్రమాదాలను గుర్తించగలవు. రోబో శరీరంపై అమర్చిన ప్రత్యేకమైన చర్మం ద్వారా అవి వీటిని చేయగలవు. రోబోలు ఈ పనులు చేయగలిగేలా చేసే చర్మాన్ని జర్మనీకి చెందిన మునిచ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు తయారుచేశారు. చర్మం తీరిది... ఈ చర్మంలో హెక్సాగోనల్‌ సెల్స్‌ను అమర్చారు. ఇందులోని ప్రతి సెల్‌ ఒక మైక్రోప్రాసెసర్‌ను, కొన్ని సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇవి వేగాన్ని, ఉష్ణోగ్రతను, చిన్న మార్పులను సైతం గుర్తించగలవు. స్పర్శాజ్ఙానం పెరగడం వల్ల, రోబోలు మరింత కచ్చితత్వంతో పనిచేస్తాయని చర్మాన్ని రూపొందించిన గోర్డోన్‌ చెంగ్, అతని బృందం తెలిపారు. చర్మం సెల్స్‌ను పదేళ్ల క్రితమే తయారుచేశామని అయితే దాన్ని రోబోలు ఆకళింపు చేసుకునేలా సాంకేతికత అభివృద్ధి చెందడానికి సమయం పట్టిందన్నారు. సెన్సార్ల నుంచి వచ్చే సమాచారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

సమాచారం ఎక్కువ కాకూడదు.. గతంలో తయారుచేసిన సెల్స్‌తో సమాచారం అధికంగా వచ్చేదని దీని వల్ల పనితీరు 90 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. మనుషుల్లాగే సమాచారాన్ని పంపే వ్యవస్థ తయారీ కోసం లోతైన పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఉదాహరణకు మనిషి టోపీ ధరిస్తే, పెట్టుకున్న వెంటనే సమాచారం అందుతుంది. కానీ సమయం గడిచే కొద్దీ టోపీ ఉందన్న సంగతి కూడా మర్చిపోతాం. రోబో చర్మాన్ని కూడా అలాంటి సమాచార వ్యవస్థతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. 

ఎక్కడ ఉపయోగపడతాయంటే.. ప్రస్తుతం తయారుచేసిన రోబోలో 1,260 సెల్స్‌ ఉన్నాయి. అందులో 13 వేలకు పైగా సెన్సార్లు ఉన్నాయి. వీటిని తల, చేతులు, మొండెం, కాళ్లు, కాలి వేళ్లలో అమర్చారు. వీటి వల్ల స్పర్శను గుర్తించే శక్తి రోబోకు అందుతుంది. నేల చదునుగా ఉన్న ప్రాంతాల్లో కాలి వేళ్ల సెన్సార్ల ద్వారా గుర్తించి జాగ్రత్తగా నడుస్తుంది. మనుషులకు హాని కలగకుండా ఆలింగనం చేసుకోగలదు. ఒకే కాలిపై నిలబడగలిగే సదుపాయాన్ని కూడా ఇందులో పొందుపరచారు. అయితే ఈ రోబోలు పరిశ్రమల అవసరాలకు ఉపయోగవడవు. వృద్ధులు, రోగులకు సహాయం అందించడం, మనుషులతో దగ్గరగా ఉండే పనులు చేయడంలో మాత్రమే ఉపయోగపడతాయి.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top