హింసను రెచ్చగొట్టేలా ఇమ్రాన్‌ వ్యాఖ్యలు

Narendra Modi speaks to Donald Trump - Sakshi

ఇవి శాంతిస్థాపనకు సహాయకారి కాదు

ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో మోదీ మాట్లాడుతూ..‘ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు భారత్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది శాంతిస్థాపనకు ఎంతమాత్రం సహాయకారి కాదు. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఉగ్రవాదం, హింసలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముంది.

అందులోభాగంగా సీమాంతర ఉగ్రవాదాన్ని  పూర్తిగా నియంత్రించాలి. దీంట్లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రబాటను వీడి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడే ఏ దేశానికైనా భారత్‌ పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని ట్రంప్‌కు మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య, స్వతంత్ర, సురక్షితమైన అఫ్గానిస్తాన్‌ కోసం తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుతో భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా ఇమ్రాన్‌  అభివర్ణించడం తెల్సిందే. భారత అణ్వాయుధాలపై దృష్టి సారించాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.

దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు ఫోన్‌చేసిన ట్రంప్‌ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది జరిగిన రెండ్రోజులకే ట్రంప్‌ భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు, ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చలు సహృద్భావ వాతావరణంలో, ఫలప్రదంగా సాగాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల అధినేతలు దాదాపు 30 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారని వెల్లడించింది. ‘ఈ టెలిఫోన్‌ సంభాషణ సందర్భంగా జపాన్‌లోని ఒకాసాలో గత జూన్‌లో జరిగిన జీ–20 భేటీని మోదీ గుర్తుచేశారు. ఈ సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు భారత్‌–అమెరికాలకు చెందిన వాణిజ్య మంత్రులు త్వరగా సమావేశమై ఇరు దేశాలకు లబ్ధి కలిగేలా ఒప్పందాలను కుదుర్చుకోవాలని మోదీ ఆకాంక్షించారు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

అఫ్గాన్‌కు అండగా నిలుస్తాం..
అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరత, భద్రత కోసం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ తెలిపారు. సోమవారం అఫ్గానిస్తాన్‌ 100వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అఫ్గాన్‌ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top