ఓ బిలియనీర్ ఒంటరితనం

ఓ బిలియనీర్ ఒంటరితనం


లాస్ ఏంజెలిస్: అది నగరంలోని విలాసవంతమైన భవనాల్లో ఒకటి. 23 వేల చదరపు గజాల్లో దాన్ని అందంగా నిర్మించారు. అందులో ఎనిమిది ఖరీదైన బెడ్ రూమ్‌లు, 18 బాత్‌రూమ్‌లు, 16 కారు పార్కింగ్ గ్యారేజీలు, కొన్నింటిలో ప్రపంచంలోనే ఖరీదైనా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. డైనింగ్‌హాల్‌లో నగషీలు చెక్కిన 18 అడుగుల డైనింగ్ హాలు, భవనం వెలుపల విశాలమైన స్మిమ్మింగ్ పూల్, భవనమంతా అందమైన నగిషీలతో కూడిన ఆధునిక ఆర్కిటెక్చర్. ఏ గదిలో నుంచి చూసిన పసిఫిక్ సముద్రపు అందాలు కనువిందు చేస్తాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన స్వీట్ షాప్ కూడా ఉంది. భూలోక స్వర్గంగా కనిపించే ఆ భవనంలో అలా విహరిస్తుంటే....ఆహా ఏమి హాయిలే అలా.. అనిపిస్తుంది. ఇక ఆందులో నివసించే వాళ్ల జీవితమే...జీవితం అనుకుంటాం. కానీ 15వేల కోట్ల రూపాయలకుపైగా ఆస్తి కలిగిన ఆ ఇంటి యజమాని మాత్రం అలా అనుకోవడం లేదు.
జీవితం బోర్, జీవితానకి లక్ష్యమంటూ లేకుండా పోయింది. మానవ సంబంధాలు మృగ్యమయ్యాయి. భయంకరమైన ఒంటరితనం. నా అన్నవారు లేకుండా పోయారనే బాధ. ఒంటరి తనం పోయేందుకు ఏర్పాటు చేసే విలాసవంతమైన పార్టీలకు కులాసా మనుషులు వస్తారు. కుషీగా గడిపి పోతారు. మళ్లీ ఒంటరితనం తరుముకొస్తుంది....ఇదీ 'మైన్‌క్రాఫ్ట్' అనే వీడియో గేమ్‌ను కనిపెట్టి రాత్రికి రాత్రి కుభేరుడైన మార్కస్ పర్సన్ ప్రస్తుత వ్యధ. ఒకరకమైన పశ్చాత్తాపం. ఆయన ఈ బాధను ట్విట్టర్‌లో ఫాలోవుతున్న రెండున్నర లక్షల మందితో పంచుకున్నారు.
స్వీడన్‌కు చెందిన కంప్యూటర్ ప్రోగామర్‌గా పనిచేసిన మార్కస్‌ది కొంతకాలం క్రితం వరకు అందరిలాంటి సాధారణ జీవితమే. పైగా పేదిరికంతో కష్టాలు కూడా పడ్డారు. చిన్నప్పుడే కంప్యూటర్‌కు అతుక్కుపోయారు. అందుకని పెద్దగా ఎవరితో స్నేహం కూడా చేసేవాడుకాదు. ఆయన 12వ ఏట తాగుబోతైన తండ్రితో తల్లి విడిపోయింది. దొంగతనాలు చేసి తండ్రి జైలుపాలయ్యాడు. 2011, డిసెంబర్‌లో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరి అన్నా పడుచు ప్రాయంలోనే మత్తు పదార్థాలకు అలవాటై ఇంటి నుంచి గుర్తుతెలియని చోటుకు పారిపోయింది.
మార్కస్ తన 18వ ఏట స్వీడన్‌లో కంప్యూటర్ ప్రోగామర్‌గా ఉద్యోగంలో చేరారు. అటూ ఉద్యోగం చేస్తూనే తీరిక వేళల్లో తనకిష్టమైన గేమ్ డిజైనింగ్‌కు ప్రయత్నించేవాడు. 2009లో ఆయన 'మైన్‌క్రాఫ్ట్' అనే వీడియో గేమ్‌ను కనిపెట్టడంతో ఆయన జీవితమే మారిపోయింది. ఆయన గేమ్‌ను దాదాపు పది కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. ఈలోగానే ఆయన అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌కు మారారు. తన గేమ్‌ను, గేమ్ డిజైనింగ్ కోసం ఏర్పాటు చేసిన తన కంపెనీని దాదాపు 15వేల కోట్ల రూపాయలకు మైక్రోసాఫ్ట్ కంపెనీకి అమ్మేశాడు. నగరంలో విలాసవంతమైన భవనాన్ని నిర్ముంచుకున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఏడాదిలోగే ఆమె విడిపోయింది. అ తర్వాత సామాన్య కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆమె కూడా మార్కస్‌ను కాదని మరో సామాన్యుడితో వెళ్లిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో మార్కస్ ఒంటరి వారయ్యారు. దాన్ని నుంచి తప్పించుకునేందుకు కోట్లాది రూపాయలు పెట్టి పార్టీలు ఏర్పాటు చేసేవారు. దానికి సెలబ్రిటీలు వచ్చేవారు. అయినా ఆ పార్టీలు ఆయనకు సంతృప్తినివ్వలేదు. కొన్నిసార్లు తన ఇంట్లో పనిచేసే వాళ్లను విమానాల్లో తీసుకొని పర్యాటక ప్రాంతాలు చుట్టి వచ్చేవారు. అయినా సంతృప్తిలేని జీవితంగానే భావించేవారు.
'ఏది కోరుకుంటే అది అందివస్తే. దానికి అర్థం లేదు. కావాల్సిన దాని కోసం కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. కల సాకారం అయినప్పుడు కలిగే అనుభూతి అనుభవించాలి. జీవితానికంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది లేనప్పుడు నాలా ఒంటరవుతారు' అంటూ ఆయన ట్విట్టర్‌లో తన బాధను షేర్ చేసుకున్నారు. ఆయన కనిపెట్టిన 'మైన్‌క్రాఫ్ట్' గేమ్ పిల్లల్లో ఎంత పాపులరైనా ఏ మాత్రం గొప్ప గేమ్ కాదు. క్రూడ్ బొమ్మలతో బిల్డింగ్ బ్లాక్‌లను నిర్మించే ఆట. ఆ గేమ్‌కు ఒక లక్ష్యమంటూ లేదు. అలాగే మన మార్కస్‌కు కూడా జీవితంలో ఓ లక్ష్యమంటూ లేకుండా పోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top