కేరళ కుట్టికి అత్యున్నత పురస్కారం | Gates Foundation's Goalkeeper award for three young change-makers | Sakshi
Sakshi News home page

ప్రపంచ వేదికపై భారతీయ యువతి గళం!

Sep 30 2018 1:45 AM | Updated on Sep 30 2018 12:31 PM

Gates Foundation's Goalkeeper award for three young change-makers - Sakshi

‘ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించేందుకు ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజ ప్రక్రియకి స్త్రీలంతా శిక్షకు గురవుతున్నారు’ అంటూ పట్టుమని 18 ఏళ్లు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్‌ బ్రిటన్‌ వీధుల్లో ప్రారంభించిన ‘ఫ్రీ పీరియడ్స్‌’ ఉద్యమం ఆమెకు గోల్‌కీపర్స్‌ గ్లోబల్‌ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్‌ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్‌ 2017లో గోల్‌కీపర్స్‌ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

18 ఏళ్ల అమికా జార్జ్‌ పేద బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్‌ కోసం బ్రిటన్‌ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్‌ వీధుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా సాగింది. దాదాపు 2 వేల మంది యువతీయువకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్‌ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలను తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్‌ కోసం 1.5 మిలియన్‌ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధి చెందిన బ్రిటన్‌లాంటి దేశాల్లోనే ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు శానిటరీ ప్యాడ్స్‌ని కొనుగోలు చేయలేని పేదరికంలో మగ్గుతున్నారని ప్లాన్‌ ఇంటర్నేషనల్‌ సర్వేలో చదివిన అమికా జార్జ్‌ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్‌ పేద బాలికలు శానిటరీ న్యాప్‌కిన్స్‌ కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్‌ పేపర్స్‌నీ, సాక్స్‌నూ వాడుతుండటం తన హృదయాన్ని కలిచివేసిందంటోంది అమికా జార్జ్‌. ఇదే ఆమె చేపట్టిన ‘ఫ్రీ పీరియడ్‌’ ఉద్యమానికి పునాది అంటోంది. కేంబ్రిడ్జి వర్సిటీలో చదువుకు నేందుకు వెళ్లిన అమికా ఈ ఉద్యమంతో చరిత్రే సృష్టించింది. 2017 డిసెంబర్‌లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్‌కీపర్స్‌ సోషల్‌ ప్రోగ్రెస్‌ ఆస్కార్‌ అవార్డుతో సత్కరించింది.

ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్‌ తదితర ప్రముఖులు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్‌కు చెందిన 24 ఏళ్ల నదియా మురద్, కెన్యాకు చెందిన 28 ఏళ్ల డిస్‌మస్‌ కిసీలు ఈ అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement