ఈసారి నలుగురు ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’

Four People Awarded TIME Person of the Year 2018 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘టైమ్‌’ మాగజైన్‌ 2018 సంవత్సరానికి ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ హోదాను ప్రకటించింది. అయితే ఈసారి ఒక్కరికి కాదు, నలుగురు వ్యక్తులకు ఓ వార్తా పత్రికకు కలిపి ప్రకటించింది. వీరందరిని కలిపి ‘ది గార్డియన్స్‌’గా వ్యవహరించింది. టైమ్‌ పత్రిక ప్రతి ఏడాది వార్తాలను అత్యధిక ప్రభావితం చేసిన వ్యక్తులకు సాధారణంగా ఈ హోదాను కల్పిస్తోంది. వార్తలను అత్యధికంగా ప్రభావితం చేసిన వారిలో మంచివారే ఉండాల్సిన అవసరం లేదు. విలన్లుగా పరిగణించే వారు కూడా ఉంటారు. అందుకనే 1938లో ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ను పేర్కొంది.

ఈసారి గత అక్టోబర్‌ 2వ తేదీన సౌదీ యువరాజు కుట్రకు బలైన సౌదీ సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్‌ జమాల్‌ అహ్మద్‌ ఖషోగ్గి, ఫిలిప్పినో జర్నలిస్ట్‌ మారియా రెస్సా, ఇద్దరు రాయిటర్స్‌ యువ జర్నలిస్టులు వా లోన్, క్యా సో ఊలతోపాటు అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది క్యాపిటల్‌ గెజిట్‌’ను కలిపి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ను ప్రకటించింది. ఈ ఏడాది వార్తాలపై వారు చూపించిన ప్రభావాన్నే కాకుండా జర్నలిజం వత్తిపట్ల వారు ప్రదర్శించిన నిబద్ధతతోపాటు వాస్తవాలను వెల్లడించాలనే వారి సంకల్పాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈసారి ఈ హోదాను ప్రకటించినట్లు టైమ్‌ సంపాదకవర్గం ప్రకటించింది.

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్, ఆయన తండ్రి వ్యవహారాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు వారి పాలనాతీరును విమర్శించినందుకు యువరాజు కాన్సులేట్‌లోనే జమాల్‌ అహ్మద్‌ ఖషోగ్గిని దారుణంగా హత్య చేశారు. అనవాళ్లు దొరక్కుండా ఆసిడ్‌తో మృతదేహాన్ని కరిగించారు. మాజీ సీఎన్‌ఎన్‌ కరస్పాండెంట్‌ మెరియా రెస్సా ఏడేళ్ల క్రితం రాప్లర్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ను స్థాపించి నిక్ష్పక్షపాతంగానే కాకుండా ధైర్యంగా నిజాలను రాశారు. ఫిలిప్పినో అధ్యక్షుడు డ్యూడర్టే నియంత్రత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శించారు. డ్రగ్‌ మాఫియా కనిపిస్తే కాల్చివేయడంటూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఆయన 12 వేల మందిని చంపించారు. వాటిని ఎప్పటికప్పుడు వెల్లడించడంతో ఆన్‌లైన్‌లో ఆమెను డ్యూడర్ట్‌తోపాటు ఆయన సైన్యం కూడా ఎన్నో వేధింపులకు గురిచేసింది. అమెను పన్నులు ఎగ్గొట్టారన్న సాకుతో ఆమెకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు అధికార రహస్యాల చట్టం కింద వా లోన్, క్యా సో ఊన్‌లకు వారి ప్రభుత్వం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ‘ది క్యాపిటల్‌ గెజట్‌’ కార్యాలయంలోని గత జూన్‌ నెలలో ఓ ఉన్మాది జొరబడి ఐదుగురు జర్నలిస్టులను కాల్చి చంపారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల స్ఫూర్తికి గుర్తింపుగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైమ్‌ సంపాదకవర్గం ప్రకటించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top