హెచ్‌1బీ వీసా రద్దు!

Donald Trump considering suspending H1B and other visas - Sakshi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పరిశీలనలో ప్రతిపాదన

వాషింగ్టన్‌: హెచ్‌1బీ సహా పలు వర్క్‌ వీసాల జారీని నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనం ప్రచురించింది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్‌ ఆలోచిస్తున్నారని వెల్లడించింది. పలువురు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వెలువడిన ఆ కథనం ప్రకారం.. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. (‘ట్రంప్.. తిరిగి‌ బంకర్‌లోకి వెళ్లు’)

ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. కొత్తగా హెచ్‌1బీ, లేదా ఇతర వర్క్‌ వీసా వచ్చినవారు అమెరికా వెలుపల ఉంటే, వారికి కూడా దేశంలోకి అనుమతి ఉండదు. అయితే, ఇప్పటికే హెచ్‌1బీ, ఇతర వీసాలపై అమెరికాలో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నిపుణులైన విదేశీయులకు అమెరికాలోని సంస్థలు అమెరికాలో ఉద్యోగ అవకాశం కల్పించేదే హెచ్‌1బీ వీసా. భారతీయుల్లో చాలామంది ఈ వీసా సాధించాలని కలలు కంటుంటారు. భారత్, చైనాల నుంచి వేలాది మంది వృత్తి నిపుణులను టెక్నాలజీ సంస్థలు ఈ వీసాపై అమెరికాకు తీసుకువస్తుంటాయి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయి, ఇండియాకు తిరిగొచ్చిన భారతీయులకు ట్రంప్‌ తీసుకోనున్న నిర్ణయం అశనిపాతం కానుంది.  

హెచ్‌1బీతో పాటు, హెచ్‌2బీ, జే1, ఎల్‌1 వీసాలను కూడా రద్దు చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి హోగన్‌ గిడ్లీ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, సంస్థలకు అవసరమైన నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌నకు యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సీఈఓ థామస్‌ డోనోహూ ఒక లేఖ రాశారు.  (జార్జ్‌ ఫ్లాయిడ్‌ సోదరుడి ఆవేదన)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top