ఆరోగ్యం... క్యూబా భాగ్యం!

Cuban doctors and nurses arrive in Milan to help fight - Sakshi

కోటి మంది జనాభాలో లక్ష మంది వైద్యులే

ఏ విపత్తు వచ్చినా విదేశాలకు వైద్య సాయం

కరోనా విపత్తు సమయంలో ఇటలీకి సాయహస్తం

1950 ప్రాంతాల్లో క్యూబన్‌ రివల్యూషన్‌ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఓ వైద్య విధానాన్ని రూపొందించుకుంది. దాని పేరే ‘రూరల్‌ మెడికల్‌ సర్వీసెస్‌’. ఆ విధానం మేరకు మారుమూల పల్లెలకు సైతం వైద్యం అందితీరాలని క్యూబా ప్రతినబూనింది. పైపెచ్చు చికిత్స కంటే నివారణకు ఎంతో ప్రాధాన్యమిచ్చింది. అసలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు క్యూబా దగ్గర 750 మంది ఫిజీషియన్లే ఉన్నారు. 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దేశాలన్నీ ‘అల్మా–ఆటా’డిక్లరేషన్‌ చేశాయి. ప్రతి వ్యక్తీ... శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలంటూ... చేసుకున్న ఈ తీర్మానం పై ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు సంతకం చేశాయి.

కానీ వీటిలో చాలా దేశాలు... ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. క్యూబా మాత్రం 1970లలోనే దేశమంతటా మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసుకుంది. అల్మా–ఆటా తర్వాత ఇది మరింత ఊపందుకుంది. 1980ల నాటికి ‘ఫ్యామిలీ డాక్టర్స్‌–నర్సెస్‌’అనే కార్యక్రమంతో మరింత ముందుకెళ్లింది. 1990 నాటికి దేశంలోని 95% జనాభాకు వైద్య ఆరోగ్య సేవలందించే స్థితికి చేరింది. అక్కడి కోటి మంది జనాభా ఉంటే వారిలో 1 శాతం... అంటే లక్ష మంది వైద్యులే. వారిలోనూ 33,000 మంది ఫ్యామిలీ ఫిజీషియన్లే. వైద్యరంగంలో క్యూబా సాధించిన ప్రగతి కారణంగా 2014 మేలో నిర్వహించిన ‘67వ వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ’కి క్యూబా నేతృత్వం వహించింది.  

ఇదీ... క్యూబా ఘనత
► ఈ దేశ రాజ్యాంగంలో ‘ఆరోగ్య హక్కు’ఉంది. దీని ప్రకారం అందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. ఇక్కడ సగటు జీవనకాలం 79 ఏళ్లు.  
► క్యూబా వైద్యులిపుడు ప్రపంచమంతా సేవలందిస్తున్నారు. అంధత్వాన్ని నివారించేందుకు లాటిన్‌ అమెరికా దేశాలైన బొలీవియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్యాటెమాలా, గయానా, హైతీ, హోండురాస్, గ్రనెడా, నికరాగ్వా, పనామా, పరాగ్వే, ఉరుగ్వే లాంటి 14 దేశాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.  
► క్యూబా 1998 నుంచీ లాటిన్‌ అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఈఎల్‌ఏఎమ్‌) ద్వారా వేలమంది ఫిజీషియన్లను తయారు చేసింది. ఇప్పుడు కూడా 120 దేశాలకు చెందిన 11,000 మంది అక్కడ చదువుతున్నారు.
► 1960, 1972, 1990లలో చిలీ, నికరాగ్వా, ఇరాన్‌లలో భూకంపాలు వచ్చినప్పుడు అత్యవసర సహాయం కోసం క్యూబా డాక్టర్లు ముందుకొచ్చారు.
► 1998లో హరికేన్‌ విపత్తు వచ్చినప్పుడు అక్కడి వైద్యబృందాలు హోండురాస్, గ్వాటెమాలాకు తరలివెళ్లి... సేవలందించాయి.
► 2004 సునామీ సమయంలో శ్రీలంకకూ వచ్చి సేవలందించారు. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ ప్రబలినప్పుడు... ఎన్నో దేశాలు గడగడలాడినా... క్యూబా 62 మంది డాక్టర్లనూ, 103 మంది నర్సులను పంపింది.
► తాజాగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్న ఇటలీకి దాదాపు 50 మందికి పైగా ఉన్న ఓ వైద్య బృందం చేరుకుని సేవలందించడం మొదలు పెట్టింది.

అదో చిన్న దేశం. నిజం చెప్పాలంటే చాలా చాలా చిన్న దేశం.
పిచ్చుక లాంటి ఆ దేశంపై అమెరికా అనునిత్యం ఆంక్షల బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తూనే వచ్చింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు సైతం అవకాశం దొరికినప్పుడల్లా క్యూబాపై ఆంక్షలు విధిస్తూ... అక్కడి విధానాలను ఆడిపోసుకున్నాయి. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పూనుకుని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ కాస్ట్రోపై 638 సార్లు హత్యాయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి. అలాంటి క్యూబా... ఈ సంక్షోభ సమయంలో అగ్రరాజ్యమైన ఇటలీకి తమ వైద్యుల్ని పంపి కొండంత అండగా నిలుస్తోంది. ఇంత చిన్న దేశమైన క్యూబా వద్ద అంత పెద్ద వైద్య వ్యవస్థ ఎలా ఉందని ఆశ్చర్యం కలగక మానదు. దాని వెనక పెద్ద కథే ఉంది. అది చూస్తే...

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top