వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 24,24,418 కేసులు నమోదవ్వగా 1,23,000 మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు తగ్గాలంటే పరీక్షలు తగ్గించాలని ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. శనివారం ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు వెలుగు చూస్తాయని, అందుకే తక్కువ పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల్ని తగ్గించాలన్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. (తల్లిని కోల్పోయా.. ఇప్పుడు పిల్లలకు దూరంగా..’i)
ఈ నేపథ్యంలో ట్రంప్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు శ్వేతసౌధ అధికారలు వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ట్రంప్ మరోసారి స్పందిస్తూ.. తానేమీ జోక్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఎక్కువ పరీక్షలు నిర్వహించడం వల్ల మరిన్ని కేసులు పెరుగుతున్నాయని విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు. అమెరికా పరీక్షల సామర్థ్యం ప్రపంచంలోని అత్యుత్తమమైనదని పునరుద్ఘాటించారు. టెస్టింగ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని.. ఒకవైపేమో కేసులు ఉన్నాయని చెబుతూనే.. మరోవైపు అవి ఎక్కడ ఉన్నాయో తెలపడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. అదే విధంగా తాము మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని.. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని ట్వీట్ చేశారు.
మరోవైపు.. కరోనా వ్యాప్తిపై అమెరికా కాంగ్రెస్ కమిటీ చేపట్టిన దర్యాప్తు సందర్భంగా డాక్టర్ ఆంటోనీ ఫౌజీ నేతృత్వంలోని ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఆంటోనీ మాట్లాడుతూ.. కరోనా పరీక్షలు ఆలస్యంగా చేయాలని తమ ఆరోగ్య అధికారులు ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అంతేగాక మరిన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడించారు. అలాగే తమ అధ్యక్షుడు ట్రంప్ కరోనా పరీక్షలు తగ్గించాలని ఆదేశాలు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. కరోనాతో దేశమంతా చారిత్రాత్మక సవాళ్లను ఎదుర్కొంటుందని, భవిష్యత్తులో మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. (అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్)
రాబోయే రెండు వారాల్లో ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనా వంటి రాష్ట్రాల్లో వైరస్ తీవత్ర అధికంగా ఉండబోతుందని ఆంటోని ఫౌజీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఎంతకాలం ప్రమాదకరంగా ఉంటుందో ఊహించడం కష్టంగా మారుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో అమెరికా మరింత గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా కరోనా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేస్తున్నట్లు, ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఎడాది ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ వాడుకలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. (ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు)


