కాక్‌పిట్‌లో కాఫీ తెచ్చిన తంటా..

Cockpit coffee spill caused flight diversionair investigators say - Sakshi

విమాన ప్రయాణంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తూ వుంటాయి. తాజాగా కాక్‌పిట్‌ కంట్రోల్‌ ప్యానెల్‌లో వేడి వేడి కాఫీ ఒలకడంతో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. చివరకు పైలట్‌ అప్రమత్తతో  విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.  ఫిబ్రవరి 6న  చోటుచేసుకున్న ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఎయిర్‌ యాక్సిడెంట్స్‌ ఇన్వేస్టిగేషన్‌ బ్రాంచ్‌ వివరాల ప్రకారం కాండోర్‌ ఎయిర్‌బస్‌ ఏ330-243 విమానం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి మెక్సికోలోని కాన్‌కున్‌కు 326 మంది ప్రయాణికులతో అట్లాంటిక్‌ సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. ఆ సమయంలో పైలట్‌ మూతలేకుండా ఇచ్చినటువంటి కాఫీని కప్‌ హోల్డర్‌లో కాకుండా ట్రేలో ఉంచాడు.  అయితే ప్యానెల్‌మీద  ప్రమాదవశాత్తు కాఫీ ఒలికిపోయింది.  దీంతో ప్యానెల్‌ నుంచి కాలిన వాసన రావడంతో పాటు పొగలు రావడం మొదలైంది. వెంటనే  కెప్టెన్‌ అప్రమత్తమై విమానాన్ని దారి మళ్లించి, షానన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు. ఈ ఘటనలో విమానంలోని  11 మంది సిబ్బంది సహా 326 మంది ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.

ఈ ఉదంతం అనంతరం అన్ని మార్గాల్లో ప్రయాణించే విమానాల్లో మూతలతో కూడిన కాఫీలు అందేలా చర్యలు తీసుకున్నట్లు థామస్ కుక్ గ్రూప్  అనుబంధ సంస్థ అయిన ఎయిర్లైన్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే పైలట్లకు అందించే ద్రవాలతో జాగ్రత్తగా ఉండాలని   సూచించినట్టు పేర్కొన్నారు. తమ ఇంజనీర్ల బృందం విమానం పూర్తిగా తనిఖీ చేసి మరమ్మతుల తరువాత, మాంచెస్టర్ మీదుగా విమానం గమ్యానికి చేరుకుందని, ఈ వ్యవహారంలో ప్రయాణికుల అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top