‘లైంగిక వేధింపులు’పై వేధింపులు

Cambridge Student Danielle Bradford Mocked by Men - Sakshi

లండన్‌: కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పీజీ చదువుతున్న 21 ఏళ్ల డానియెల్లీ బ్రాడ్‌ఫోర్డ్‌కు ‘మార్శ్‌ ఆర్కియాలోజీ’ విభాగం నుంచి ఫోన్‌ రాగానే ఆమె ఆనందంతో ఎగిరి గంతేశారు. ‘ఆర్కియాలజీ ఫీల్డ్‌ వర్క్‌లో మహిళలపై లైంగిక వేధింపులు’ అన్న అంశంపై రీసెర్చ్‌ చేసి థీసిస్‌ను సమర్పించినందుకుగాను ఆమెకు అవార్డు ఇస్తున్నట్లు చెప్పడానికే ఆ ఫోన్‌కాల్‌. నవంబర్‌ 22వ తేదీ సాయంత్రం తమ ఆర్కియాలజీ విభాగం ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా బ్రాడ్‌ఫోర్డ్‌ను ఆహ్వానించారు. ఫీల్డ్‌వర్క్‌లో లైంగిక వేధింపులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలను కూడా ఆమె తన థీసిస్‌లో సూచించారు.

అవార్డు అందుకోబోతున్న సంతోషంలో ఆమె అవార్డుల కార్యక్రమానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించిన నిర్వాహకులు ఆర్కియాలజీ ఫీల్డ్‌వర్క్‌లో మహిళలపై లైంగిక వేధింపులపై అధ్యయనం జరిపినందుకు అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించగానే ప్రేక్షకులు ముఖ్యంగా మగాళ్లు గొల్లున నవ్వారు. ఆమె అవార్డు అందుకోవడానికి వేదికపైకి వెళుతున్నప్పుడు కూడా ‘ఆర్కియాలజీ ఫీల్డ్‌ వర్క్‌లో లైంగిక వేధింపులా’ అంటూ పగలబడి నవ్వారు. అవార్డు కింద ఓ జ్ఞాపికను, సర్టిఫికెట్‌ను అందుకున్న ఆనందం క్షణం కూడా నిలబడకుండా పోవడంతో బ్రాడ్‌ఫోర్డ్‌ వెక్కి వెక్కి ఏడుస్తూ పరుగు పరుగున వెళ్లి తన సీటులో కూర్చుంది.

‘ఆర్కియాలజీ ఫీడ్‌వర్క్‌లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులు జరగకపోవచ్చుకానీ మీ పట్ల జరిగి ఉండవచ్చు’ అంటూ ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలను భరించలేక ఆమె అక్కడి నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. బ్రాడ్‌ఫోర్డ్‌ సాహసించి రీసర్చ్‌కు ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నందుకు ప్రశంసించాల్సిందిపోయి, హేళన ఎందుకు చేస్తారంటూ నిర్వాహకులు ప్రేక్షకులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ తర్వాత ట్విటర్‌లో కూడా ఆమెను ట్రోల్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top