
మనం నిత్యం తినే పండ్లు ఫలాలు ఒక్కోదాన్ని ఓ దేశంగా ఊహించుకుంటే.. అగ్రరాజ్యం అమెరికా స్థానం దేనికి దక్కుతుందో చెప్పుకోండి! ఇంకెవరికి.. పళ్లురాని పసిపిల్లల నుంచి పళ్లులేని పండు ముదుసళ్ల వరకూ అందరికీ ప్రీతిపాత్రమైన అరటిపండుకే..! ఈ మాట మేమన్నది కాదు. ఓ మేధావి ఎప్పుడో అన్నమాట ఇది. మనదేశంలో యుగాలుగా అరటిని వాడుతున్నాం గానీ.. యూరప్ దేశాలకు ఇది చేరింది మాత్రం ఇటీవలి కాలంలోనే.. కచ్చితంగా చెప్పాలంటే 1663 ఏప్రిల్ 10న తొలిసారి లండన్ నగర వీధుల్లో అరటిపండు ఊరేగింది. కదళీఫలం తాలూకూ ముచ్చట్లు మరిన్ని కావాలా.. అయితే చదివేయండి..
గోధుమలు, బియ్యం, పాల తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద పంట అరటి అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐరోపా వాసులకు అరటి పండు ఎంతో ప్రీతిపాత్రమైనది. ప్రధానంగా ఉష్ణమండలానికి చెందిన ఈ పండుకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 63–14 మధ్యకాలంలో రోమన్ ప్రభువు ఆక్టవియస్ అగస్టస్‌కు వ్యక్తిగత వైద్యుడు ‘ఆంటోనియస్ ముసా’ఆఫ్రికాకు చెందిన ఈ పంట విస్తరణకు కారణమయ్యాడు. 15వ శతాబ్దంలో పోర్చుగీస్ నావికులు పశ్చిమ ఆఫ్రికా నుంచి ఈ పండును ఐరోపాకు తీసుకొచ్చారు. గ్యూనియా పేరు బనేమానే కాలక్రమంలో ఇంగ్లిష్‌లో ‘బనానా’గా మారింది. అలా 17వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లోకి ప్రవేశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండు యూరప్‌కు చేరి కొంచెం అటు ఇటుగా 385 ఏళ్లు అయిందన్నమాట.
అక్కడి నుంచి ఇది వివిధ ఖండాలు దాటుకుంటూ 1761లో కరీబియన్ దీవులకు చేరుకుంది. ఇది ఎంత శక్తిమంతమైన ఫలమంటే.. ప్రభుత్వా లను మార్చేసేంత! బనానా రిపబ్లిక్ అన్న సామెత వినే ఉంటారు కదా.. ఆ సామెత ఇలా పుట్టుకొచ్చిందే. యునైటెడ్ ఫ్రూట్ అనే కంపెనీ ఈ పండును కొలంబియాకు పరిచయం చేసింది. విశాలమైన ప్రాంతాల్లో సాగు మొదలుపెట్టింది.
ఈ క్రమంలో 1928 ప్రాంతంలో అరటితోటల్లో పనిచేసే కార్మికులు వేతనాల కోసం సమ్మె చేస్తే యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ కాస్తా.. కొలంబియా దళాల సాయంతో వారిపై కాల్పులకు తెగబడింది. అలాగే.. 1954లో గ్వాటేమాలలోనూ ఈ కంపెనీ తన ప్రతాపం చూపింది. కంపెనీ వృథాగా వదిలేసిన భూములను జాతీయం చేస్తామని జాకోబు ఆర్బెంజ్ ప్రకటించడమే తడవు.. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ఆ దేశ మిలటరీతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు అక్కడ మిలటరీ రాజ్యమే కొనసాగింది.