ఉపాధ్యాయులు సాంకేతికతపై పాఠాలు నేర్వనున్నారు. ఈ మేరకు డిజిటల్ క్లాసుల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు సాంకేతికతపై పాఠాలు నేర్వనున్నారు. ఈ మేరకు డిజిటల్ క్లాసుల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 6 వేలకుపైగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతి టీచర్‌కు కనీస సాంకేతిక నైపుణ్యాలు ఉండాలని నిర్దేశించింది. డిజిటల్ తరగతుల నిర్వహణపై జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ల బృందం నివేదించిన అంశాలపై పాఠశాలల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. .
ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి దశ డిజిటల్ తరగతులను 1000 పాఠశాలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సబ్జెక్టులవారీగా డిజిటల్ కంటెంట్ రూపకల్పన విధానం, బోధనాపద్ధతులతోపాటు టీచర్లకు కనీస సాంకేతిక నైపుణ్యాలుంటేనే డిజిటల్ తరగతుల బోధన పక్కాగా నిర్వహించడం సాధ్యం అవుతుందని ప్రొఫెసర్ల బృందం సూచనల చేసింది. ఈ మేరకు తదుపరి కార్యాచరణకు విద్యాశాఖ సిద్ధమైంది. సర్వ శిక్షాఅభియాన్- యూనిసెఫ్ సంయుక్తాధ్వర్యంలో అభివృద్ధి చేసిన డిజిటల్ కంటెంట్‌ను విద్యాశాఖ జేఎన్‌టీయూహెచ్‌లోని వివిధ విభాగాల ప్రొఫెసర్లతో అధ్యయనం చేయించింది. ఆరు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులవారీగా బోధించేందుకు రూపొందించిన డిజిటల్ కంటెంట్‌ను ప్రొఫెసర్లు అధ్యయనం చేసి పలు సిఫారసులు చేశారు. విద్యార్థులకు డిజిటల్ తరగతుల బోధన పకట్బందీగా చేపడితే విద్యార్థుల్లో సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయని సూచించారు.
డిజిటల్ కంటెంట్‌ను వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచాలని, తద్వారా బోధించే టీచర్లే కాకుండా భవిష్యత్తులో బోధించబోయే టీచర్లు, ఇతర టీచర్లు కూడా వాటిపై అవగాహన పెంచుకునేందుకు వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో డిజిటల్ కంటెంట్ మొత్తాన్ని విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టీచర్లు డిజిటల్ కంటెంట్‌ను సిద్ధం చేసేందుకు వీలుగా తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ప్రొఫెసర్ల బృందం సూచించింది. టీచర్లకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లలో కంటెంట్‌ను మరింతగా డెవలప్ చేసేందుకు వీలుగా ఉచిత, ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు సబ్జెక్టులవారీగా డిజిటల్ కంటెంట్‌కు సంబంధించిన అన్ని రకాల సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూచించింది.