
భోగికి నిండుగా..
పండక్కి పల్లె‘టూరు’ వెళ్లినప్రయాణికులతో ఆదివారమూ రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌లతో పాటు...
- పండగ ప్రయాణం
- రైళ్లు, బస్సులు కిటకిట
- ఆదివారం 6.81 లక్షల మంది సొంతూళ్లకు పయనం
- నరకం చ విచూసిన ప్రయాణికులు
సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అఫ్జల్‌గంజ్ , న్యూస్‌లైన్ : పండక్కి పల్లె‘టూరు’ వెళ్లినప్రయాణికులతో ఆదివారమూ రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌లతో పాటు జూబ్లీబస్‌స్టాండ్, ఎంజీబీఎస్‌లు వేలాది మంది జనంతో రద్దీగా కనిపించాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు, బస్సులు లేకపోవడంతో ప్రజలు నానా బాధలు పడ్డారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఊపిరి సలపని రద్దీలో ప్రయాణించాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ప్రయాణికుల సంఖ్యే 2.50 లక్షలకు చేరుకోవడం విశేషం. ఆర్టీఏ అధికారులు 40 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడంతో ఆ మేరకు రైళ్లు, ఆర్టీసీ బస్సులకు మరింత తాకిడి పెరిగింది. మొత్తంగా ఆదివారం నగరం నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో సుమారు 6.81 లక్షల మంది పల్లెబాట పట్టినట్లు తెలిసింది.
కిక్కిరిసిన సికింద్రాబాద్ స్టేషన్
ఒకవైపు సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు, మరోవైపు శబరిమల అయ్యప్ప భక్తులతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిక్కిరిసినప్రయాణికులతో రద్దీగా కనిపించింది. ప్లాట్‌ఫారాలు మొదలు ఏ రైలు చూసినా జనప్రభంజనమే. శబరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు మార్గాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణించేందుకు పెద్దసంఖ్యలో ప్రయాణికులు తరలివచ్చారు. ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్, గోదావరి, విశాఖ, ఇంటర్‌సిటీ, జన్మభూమి వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లు కిక్కిరిసిపోగా, సిర్పూర్ కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లా మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లలో సైతం ఇసుక పోస్తే రాలనంతగా జనం కనిపించారు.
రద్దీ తీవ్రంగా ఉండటంతో ఊపిరి బిగపట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని పలువురు ప్రయాణికులు వాపోయారు. ఇక జనరల్ బోగీల్లో వెళ్తున్న ప్రయాణికులైతే నరకం చవిచూస్తున్నారు.ఒక్కోబోగీలో 70 మందికి అవకాశం ఉండగా.. 300 మంది వరకు ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించడం గమనార్హం. ఊపిరాడని పరిస్థితుల్లో చేస్తున్న ఈ ప్రయాణాలు పిల్లలు, మహిళలు, వృద్ధుల పాలిట శాపంగా మారుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాధారణ సెలవు రోజుల్లో 1.80 లక్షల మంది ప్రయాణిస్తుంటారని.. పండగ రీత్యా ఆదివారం ఈ సంఖ్య మరో 70 వేలకు పెరిగిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
జేబీఎస్‌లో ప్రయాణికుల పడిగాపులు
సికింద్రాబాద్‌లోని జూబ్లీబస్‌స్టేషన్‌లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, గోదావరిఖని, మెదక్, హన్మకొండ, కోరుట్ల వెళ్లే బస్సుల కోసం వేలాది మంది ప్రయాణికులు ఆదివారం గంటల తరబడి నిరీక్షించారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమయ్యారు. రద్దీని అంచనా వేయకపోవడంతో అదనపు బస్సులు ఏ మూలకూ సరిపోలేదు. కాగా ఆదివారం ఒకేరోజు ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు 1343 బస్సులు బయలుదేరి వెళ్లాయి. సుమారు 60 వేల మంది ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. కాగా నిత్యం ఈ బస్టాండు నుంచి 1200 బస్సుల్లో 35 వేల మంది దూరప్రాంతాలకు వెళ్లడం సర్వ సాధారణం. సంక్రాంతి రద్దీ సందర్భంగా ఆర్టీసీ 945 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల రద్దీకి ఇవి సరిపోవడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో..
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో గత నాలుగు రోజుల నుంచి ప్రయాణికుల సందడి నెలకొంది. నాంపల్లి నుంచి బయలుదేరిన వెళ్లిన రైళ్లన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి. ఆదివారమూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆదివారం ఒకే రోజు సుమారు 40 వేల మంది ఈ స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు తరలివెళ్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నాంపల్లి నుంచి వెళ్లే సాధారణ రైళ్లతో పాటుగా స్పెషల్ రైళ్లలో కూడా టికెట్టు దొరకడం కష్టంగా మారింది. బెర్తులన్నీ పుల్ కావడంతో.. టికెట్ లభించని వ్యక్తులు జనరల్ బోగీల్లో నిలబడి ప్రయాణించారు. కాగా అధికారులు సీజ్ చేయగా మిగిలిన ప్రైవేట్ ట్రావె ల్స్‌లో సుమారు 20 వేల మంది ప్రయాణించినట్లు అంచనా. ఆదివారం ఎంజీబీఎస్‌లో విపరీతమైన రద్దీ నెలకొంది. సమయానికి రాని బస్సులు, చాలీచాలని అదనపు బస్సుల కారణంగా బస్సుల్లో సీట్ల కోసం కుస్తీలు పట్టాల్సిన దుస్థితి తలెత్తింది. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించిన ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గౌలిగూడ సీబీఎస్ హ్యాంగర్ నుంచి సీమాంధ్ర ప్రాంతం వైపు వెళ్లే ప్రయాణికులకు కనీసం నీటి వసతిని సైతం ఏర్పాటు చేయలేదు.
ఆర్టీసీ లూటీ
సేవలను విస్మరించి ఆర్టీసీ ప్రైవేట్ సంస్థలా వ్యవహరిస్తుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాల్సిన ఆర్టీసీ పండగల సందర్భాల్లో అదనపు బస్సుల పేరిట ప్రజలను లూటీ చేస్తుంది. సిటీలో నడిపే డొక్కు బస్సులపై 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం.
- శంకరమూర్తి, చిత్తూరు
ఐదు వేల అదనపు బస్సులు వేశాం
ప్రయాణికుల తాకిడి అధికంగా ఉన్నందున ఈ సంక్రాంతికి ఐదు వేల అదనపు బస్సులను నడుపుతున్నాం. ఈ నెల 8వ తేదీ నుంచి ఆదివారం వరకు 17,785 షెడ్యూల్డ్ బస్సుల్లో 6,01,475 మంది ప్రయాణికులను, 4017 అదనపు బస్సుల్లో 1,40,595 మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చాము.
- వినోద్‌కుమార్, రంగారెడ్డి జిల్లా రీజియన్ ఆర్‌ఎం
లాభాలే ధ్యేయమా?
పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ఆర్టీసీ అదనపు బస్సుల సాకుతో అందినకాడికి దోపిడీ చేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా వ్యవహరించడం దారుణం.
- రామాంజనేయులు, మదనపల్లి