ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా? | railway projects delayed in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?

Feb 18 2016 11:15 AM | Updated on Sep 3 2017 5:54 PM

ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?

ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?

రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం, అవసరమైన నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీలను (జేవీలు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం తాజాగా అనుమతిచ్చింది.

► రైల్వేలో జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటు
►ఏపీతో ఇటీవల కుదుర్చుకున్న రైల్వేశాఖ
► రూ.9 వేల కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో రైల్వే ప్రాజెక్టులు

హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం, అవసరమైన నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీలను (జేవీలు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం తాజాగా అనుమతిచ్చింది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు రైల్వే శాఖకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేశాఖ జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుపై ఏపీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 వేల కోట్లతో పలు రైల్వే ప్రాజెక్టులు 50 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా నిధులు విదుల్చుతోండటంతో సుదీర్ఘకాలంగా ఇవి పట్టాలెక్కడం లేదు. వాటా ప్రాజెక్టులన్నీ పడకేశాయి. అరకొరగా కేటాయిస్తున్న నిధులతో ఈ ప్రాజెక్టులు ఎన్నటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుతోనైనా పడకేసిన రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

జాయింట్ వెంచర్ కంపెనీలేం చేస్తాయి?
రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ సమస్యలు, నిధులు సమకూర్చడం వంటివి ఎప్పటికప్పుడు జేవీలు పర్యవేక్షిస్తాయి. ఎంపిక చేసిన ప్రతినిధులతో కలిసి ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టును బట్టి రూ.100 కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవాలి. రైల్వేశాఖ ముందుగా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది రూ.50 కోట్ల వరకు ఉంటుంది. రైల్వేశాఖ ప్రాజెక్టుకు, నిధుల సమీకరణకు ఆమోదముద్ర వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీలు, ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి.
 
► కడప-బెంగళూరు రైల్వే లైన్‌కు రూ.1,000.23 కోట్లతో అంచనా వేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.189.95 కోట్లు కేటాయించాయి.  
► నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1,314 కోట్లు. ఇప్పటివరకు రూ.6 కోట్లే కేటాయించారు. గుంటూరు, నెల్లూరు జిల్లాలో భూసేకరణ కోసం రాష్ట్రం రూ.289 కోట్ల నిధులు విడుదల చేసింది.
► కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1,050 కోట్లు. రాష్ట్రం రూ.2.69 కోట్లు, కేంద్రం రూ.5 కోట్లు కేటాయించింది.
► కాకినాడ-పిఠాపురం లైన్ రూ.123.68 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇంతవరకు పైసా మంజూరు చేయలేదు.
► తుమ్కూరు-రాయదుర్గం రైల్వేలైన్‌కు 970.34 కోట్లు అంచనా వ్యయమైతే, ఇప్పటివరకు రూ.200 కోట్లు కేటాయింపులు జరిగాయి.
► విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం, భీమవరం/నర్సాపురం-నిడదవోలు లైన్‌కు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.1009.08 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.141 కోట్లు కేటాయించారు.
► గుంటూరు-తెనాలి-రేపల్లె డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.133.46 కోట్లు అంచనా వ్యయం. ఇప్పటివరకు రూ.35 కోట్లు కేటాయించారు.
► భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్‌కు రూ.923.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇంతవరకు సర్వే దశ దాటలేదు. దేవరపల్లి-పెనుకొండ 48 కి.మీ. లైన్ రూ.400 కోట్ల అంచనా వ్యయం కాగా, ఏపీ తన వాటా నిధులపై నోరు మెదపడం లేదు.
► గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌కు రూ.2,033 కోట్లు అంచనా వ్యయమైతే కాగితాలకే పరిమితమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement