
మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి కన్నుమూత
మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సదాశివరెడ్డి శనివారం గుండెపోటుతో మృతిచెందారు.
♦ గుండెపోటుతో మృతి..
♦ నేడు అంత్యక్రియలు
పటాన్‌చెరు టౌన్: మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సదాశివరెడ్డి శనివారం గుండెపోటుతో మృతిచెందారు. సదాశివరెడ్డి 1981 నుంచి 1986 వరకు పటాన్‌చెరు సమితికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు సహకార సంఘం అధ్యక్షుడిగా రైతులకు సేవలందించారు. 1970 నుంచి 1981 వరకు పటాన్‌చెరు సర్పంచ్‌గా ఉన్నారు. 1994 నుంచి 1999 వరకు సంగారెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో పటాన్‌చెరు నియోజకవర్గమంతా సంగారెడ్డిలో ఉండేది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌గా ఉన్న పి.రామచంద్రారెడ్డిపై సదాశివరెడ్డి అత్యధిక మెజార్టితో గెలుపొంది రికార్డు సాధించారు.
అప్పటి ప్రభుత్వం ఆయన్ను ఏపీఐఐసీ, ఏపీఐడీసీ డెరైక్టర్ పదవుల్లో నియమించింది. అలాగే ఆయన హుడా సభ్యుడిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం సేవలందించారు. ఆ తర్వాత నుంచి పటాన్‌చెరులోనే తన సొంతింట్లో కుటుంబ సభ్యులతోపాటు ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం సదాశివరెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మదీనగూడలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. సదాశివరెడ్డి మృతి వార్తతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబీకులకు తన సంతాపాన్ని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మృతితో పటాన్‌చెరు నియోజకవర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఆయన మృతదేహానికి ఆదివారం పటాన్‌చెరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కె.సదాశివరెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సదాశివరెడ్డితో తన కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సదాశివరెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, ప్రజల మనిషిగా ఆయనకు ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. సదాశివరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.