30-34 శాతం ఫిట్‌మెంట్! | more fitment rather than IR | Sakshi
Sakshi News home page

30-34 శాతం ఫిట్‌మెంట్!

May 30 2014 2:43 AM | Updated on Apr 4 2019 5:41 PM

30-34 శాతం ఫిట్‌మెంట్! - Sakshi

30-34 శాతం ఫిట్‌మెంట్!

పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికను గురువారం గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు సమర్పించింది.

 పదో పీఆర్సీ సిఫార్సు  / గవర్నర్‌కు నివేదిక సమర్పించిన పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్
 
ఐఆర్‌కన్నా ఎక్కువగా ఫిట్‌మెంట్
* మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవు
* 5 సంపుటాలుగా నివేదిక వర్గీకరణ
* రెండు ప్రతులు సమర్పణ

 
 సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికను గురువారం గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు సమర్పించింది. దానిలో 30 నుంచి 34 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తున్న విషయం విదితమే.
 
ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. 34 శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేయాలని పీఆర్సీ దాదాపు నిర్ణయానికి వచ్చిన తరుణంలో.. సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలను భరించే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఫిట్‌మెంట్‌ను కొద్దిగా తగ్గించాలని పీఆర్సీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 30 శాతం కంటే ఎక్కువగానే ఫిట్‌మెంట్ ఉంటుందని, గరిష్టంగా 34 శాతానికి మించి ఉండే అవకాశం లేదని పీఆర్సీ వర్గాల ద్వారా తెలిసింది.

మహిళా ఉద్యోగులకు తమ సర్వీసు కాలంలో గరిష్టంగా రెండేళ్ల పాటు పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కనీస వేతనం రూ. 6,700 నుంచి దాదాపు రూ. 13 వేలకు పెంచుతూ పీఆర్సీ సిపార్సు చేసింది. దాదాపు 2 వేల పేజీలతో కూడిన నివేదికను 5 సంపుటాలుగా వర్గీకరించారు.
 
 రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో రెండు ప్రతులను గవర్నర్‌కు పీఆర్సీ చైర్మన్ ప్రదీప్‌కుమార్ అగర్వాల్ సమర్పించారు. గత ఏడాది ఫిబ్రవరి 28న పదో పీఆర్సీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. మార్చి 13న అగర్వాల్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన విషయం విదితమే. అయితే సకాలంలో సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చకపోవడం, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టడం.. తదితర కారణాల వల్ల నివేదికను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.
 
రాష్ట్ర విభజన తేదీ కూడా దగ్గర పడుతుండటంతో నివేదికను గవర్నర్‌కు సమర్పించడంతో పీఆర్సీ పని పూర్తిచేసింది. పీఆర్సీ అమలు రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను నిర్ణయించనున్నాయి. గత పీఆర్సీల మాదిరిగా కాకుండా పదో పీఆర్సీకి.. ప్రభుత్వం అనుసరించాల్సిన హెచ్‌ఆర్ విధానాన్ని కూడా సిఫార్సు చేసే బాధ్యతను కట్టబెట్టారు. నివేదిక రూపకల్పనలో జాప్యం జరగడానికి అది కూడా కారణమని పీఆర్సీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement