breaking news
PK Agarwal
-
ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు?
-
ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు?
* ఈ ఆర్థిక సంవత్సరంలో కష్టమంటున్న ఆర్థికశాఖ వర్గాలు * ఈ నెల మూడో వారంలో ఫిట్మెంట్ ప్రకటించనున్న కేసీఆర్ * ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్న టీ సర్కారు * ఫిట్మెంట్ 42 శాతం ఇస్తే.. అదనపు భారం రూ. 3,000 కోట్లు * ఏటా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులకే రూ. 23 వేల కోట్లు! * ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే పడే భారం మరో నాలుగైదు వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ వచ్చే ఏప్రిల్ నుంచి అమలుకానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్త వేతన సవరణ ఫిట్మెంట్ ఎంతన్నది ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ నెల మూడోవారంలోనే ప్రకటించనున్నారు. కానీ నగదు రూపంలో అమలు మాత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పీఆర్సీ భారం పడితే ఇబ్బంది ఎదురవుతుందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికను గత మే నెలలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలోనే గవర్నర్ నరసింహన్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో... ఆ నివేదికను ఇరు రాష్ట్రాలకు గవర్నర్ అప్పగించారు. పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్ ఆ నివేదికలో ఫిట్‌మెంట్‌ను 29 శాతంగా సిఫారసు చేశారు. అయితే పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి ముందే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతిని... దాదాపు ఏడాది కాలంగా ఉద్యోగులకు ఇస్తూ వస్తున్నారు. తాజాగా పీఆర్సీని అమలు చేయాలంటూ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో... దీనిపై త్వరగా ఒక నిర్ణయానికి రావాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గత నెల 30న తెలంగాణ ఉద్యోగ సంఘాల డైరీల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్... పీఆర్సీపై జనవరి మూడోవారంలో ప్రకటన చేస్తామని వెల్లడించారు. దీంతో ఉద్యోగ సంఘాలు జనవరి నుంచే వేతన సవరణ అమలు అవుతుందని భావిస్తున్నాయి. కానీ ఆర్థిక శాఖ అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు లేదన్న కారణంతో... పీఆర్సీ అమలును ఏప్రిల్‌కు వాయిదా వేయించాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చిల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కసారిగా నిధులు విడుదల చేయాల్సి వస్తుందని.. ఆ సమయంలోనే పీఆర్సీ అమలు చేయాలంటే కష్టమనే అభిప్రాయంతో వారు ఉన్నారు. మరోవైపు... ఉద్యోగ సంఘాలు 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇచ్చే 27 శాతం మధ్యంతర భృతి పోగా ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు ఖజానాపై ఏడాదికి రూ. 200 కోట్ల భారం పడుతుందని ఓ అధికారి వివరించారు. ఆ లెక్కన ఫిట్మెంట్ 42 శాతంగా ప్రకటిస్తే ఏటా మూడు వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఈ లెక్కన ఏటా ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే మొత్తం రూ. 21 వేల కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల మేరకు చేరుకుంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఫిట్‌మెంట్‌ను ఎంత నిర్ణయిస్తారన్నదానిపై భారం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఖాళీగా ఉన్న లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తే... ఆ ఉద్యోగులకు చెల్లించడానికి ఏటా మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. -
30-34 శాతం ఫిట్మెంట్!
పదో పీఆర్సీ సిఫార్సు / గవర్నర్‌కు నివేదిక సమర్పించిన పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ * ఐఆర్‌కన్నా ఎక్కువగా ఫిట్మెంట్ * మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవు * 5 సంపుటాలుగా నివేదిక వర్గీకరణ * రెండు ప్రతులు సమర్పణ సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికను గురువారం గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు సమర్పించింది. దానిలో 30 నుంచి 34 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తున్న విషయం విదితమే. ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్మెంట్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. 34 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేయాలని పీఆర్సీ దాదాపు నిర్ణయానికి వచ్చిన తరుణంలో.. సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలను భరించే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఫిట్‌మెంట్‌ను కొద్దిగా తగ్గించాలని పీఆర్సీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 30 శాతం కంటే ఎక్కువగానే ఫిట్మెంట్ ఉంటుందని, గరిష్టంగా 34 శాతానికి మించి ఉండే అవకాశం లేదని పీఆర్సీ వర్గాల ద్వారా తెలిసింది. మహిళా ఉద్యోగులకు తమ సర్వీసు కాలంలో గరిష్టంగా రెండేళ్ల పాటు పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కనీస వేతనం రూ. 6,700 నుంచి దాదాపు రూ. 13 వేలకు పెంచుతూ పీఆర్సీ సిపార్సు చేసింది. దాదాపు 2 వేల పేజీలతో కూడిన నివేదికను 5 సంపుటాలుగా వర్గీకరించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో రెండు ప్రతులను గవర్నర్‌కు పీఆర్సీ చైర్మన్ ప్రదీప్‌కుమార్ అగర్వాల్ సమర్పించారు. గత ఏడాది ఫిబ్రవరి 28న పదో పీఆర్సీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. మార్చి 13న అగర్వాల్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన విషయం విదితమే. అయితే సకాలంలో సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చకపోవడం, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టడం.. తదితర కారణాల వల్ల నివేదికను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్ర విభజన తేదీ కూడా దగ్గర పడుతుండటంతో నివేదికను గవర్నర్‌కు సమర్పించడంతో పీఆర్సీ పని పూర్తిచేసింది. పీఆర్సీ అమలు రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను నిర్ణయించనున్నాయి. గత పీఆర్సీల మాదిరిగా కాకుండా పదో పీఆర్సీకి.. ప్రభుత్వం అనుసరించాల్సిన హెచ్ఆర్ విధానాన్ని కూడా సిఫార్సు చేసే బాధ్యతను కట్టబెట్టారు. నివేదిక రూపకల్పనలో జాప్యం జరగడానికి అది కూడా కారణమని పీఆర్సీ వర్గాలు తెలిపాయి.