డాక్యుమెంట్లతో పాటు స్వీయ ప్రకటన | In addition to the self-declaration documents | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్లతో పాటు స్వీయ ప్రకటన

Aug 10 2016 3:18 AM | Updated on Sep 4 2017 8:34 AM

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులకు స్థానికత కావాలంటే...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులకు స్థానికత కావాలంటే స్వీయ ప్రకటనతో పాటు తెలంగాణలో నివాసం ఉన్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో గానీ మీసేవలోగానీ సమర్పిస్తే సబంధిత తహసీల్దారు వారం రోజుల్లోగా స్థానికత పత్రం జారీ చేస్తారు. వారంలోగా తహసీల్దారు జారీ చేయకపోతే స్వయంచాలకం (ఆటోమేటిక్)గా ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలాగ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి స్థానికతపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2లోగా తెలంగాణలోని ఏ ప్రాంతంనుంచైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికతను వర్తింప చేస్తారు. ఆ తరువాత వెళ్లే వారికి స్థానికత వర్తించదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు, విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని, వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు కాదని పేర్కొన్నారు. మైనర్లకు స్థానికత కావాలంటే తల్లిదండ్రులు, సంరక్షకులు ధరఖాస్తు చేసుకోవచ్చును. స్వీయ ప్రకటనలోని సమాచారం తప్పు అని తేలితే.. స్థానికత పత్రం ద్వారా పొందిన ఉద్యోగం లేదా అడ్మిషన్ రద్దు చేస్తారు. అంతేగాక ప్రాసిక్యూషన్ చర్యలు చేపడతారు. డెరైక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడ నివాసం ఉంటున్నారనే దాన్నే పరిగణనలోకి తీసుకోవాలి గానీ వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నివాసాన్ని కాదని స్పష్టం చేశారు.
 
ధ్రువీకరణ పొందాలంటే..
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్యోగార్థులు, విద్యార్థులు ఏపీలో స్థానికత పొందాలంటే.. తెలంగాణలో నివాసం ఉన్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఒకటి జత చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement