రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థులకు చదవడం, రాయడం రావట్లేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థులకు చదవడం, రాయడం రావట్లేదు. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల్లేవ్.. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖ అధికారులే స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యాశాఖ బృందాలు చేసిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఈ దుస్థితి నుంచి పాఠశాల విద్యను బయటపడేసేందుకు ఇకపై ఒకటో తరగతి నుంచే పక్కాగా నిరంతర సమగ్ర మూల్యాంక నం (సీసీఈ) విధానం అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో 3, 4, 5 తరగతుల్లో అరకొరగా, 9, 10 తరగతుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఇకపై 1 నుంచి పదో తరగతి వరకు పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది.
ప్రైవేటు పాఠశాలల్లోనైతే 9, 10 తరగతులు మినహా మిగతా తరగతుల్లో ఈ విధానం అసలే అమలు చేయడంలేదని గుర్తించిన ఆ శాఖ ఇకపై అన్ని పాఠశాలల్లో పక్కాగా అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్ వరకు ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్యపుస్తకాలనే విధిగా బోధించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
సీసీఈ ఎందుకంటే...
వార్షిక పరీక్షలు, మార్కుల పేరుతో విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతోంది. ఏడాదిలో చదివిన అంశాలను ఒక్క వార్షిక పరీక్షల ద్వారానే అంచనా వేయకుండా, విద్యార్థిని అన్ని కోణాల్లో అంచనా వేసేందుకు సహపాఠ్య కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ప్రయోగాలు, అసైన్‌మెంట్స్, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని ఇప్పటికే 9, 10 తరగతుల్లో అమలు చేస్తోంది. 9, 10 తరగతుల్లో మొన్నటి వరకు అదనంగా ఇంటర్నల్స్ విధానం అమలు చేసింది. 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్స్ విధానం ఉంది.
ఇదే విధానాన్ని 6 నుంచి 10వ తరగతి వరకు వచ్చే మార్చిలో జరిగే పరీక్షల్లో అమలు చేయబోతోంది. ఇక 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టులో నిర్మాణాత్మక మూల్యాంకానికి (ఫార్మేటివ్) 50 మార్కులకు, సంగ్రహణాత్మక మూల్యాంకానికి (సమ్మేటివ్) 50 మార్కులు కలిపి 100 మార్కులతో తుది ఫలితాలు ఇస్తారు. ప్రాథమిక స్థాయిలో పిల్లల భాగ స్వామ్యం-ప్రతిస్పందనలు, రాత, ప్రాజెక్టులు, లఘు పరీక్షలకు 50 మార్కులు ఉంటాయి. అదే 6 నుంచి పదో తరగతిలో వాటికి ఒక్కో దానికి 5 మార్కుల చొప్పున ఇంటర్నల్స్‌గా 20 మార్కులు ఇస్తారు.