
బాధితులకు పరిహారం అందడం లేదు
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో 200 మందికి పైగా పరిహారం అందలేదంటూ పిటిషనర్లు సమర్పించిన ...
కోర్టుకు జాబితా సమర్పించిన కోదండరాం, మరికొందరు
వాటిని పరిశీలించి పరిహారంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ జూన్ 20కి వాయిదా
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో 200 మందికి పైగా పరిహారం అందలేదంటూ పిటిషనర్లు సమర్పించిన జాబితాలను పరిశీలించి, వారికి పరిహారం చెల్లించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన జాబితాల ఆధారంగా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు ఏం చర్యలు తీసుకున్నారో రాతపూర్వకంగా వివరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బాధిత కుటుంబ సభ్యులకే నేరుగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేయడంతో పాటు.. రైతుల ఆత్మహత్యల నివారణకు 2006లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేలా ఉభయ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్... తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ. లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి... మరొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాల్లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాం అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కోదండరాం తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో అనేక మంది అర్హులకు పరిహారం అందలేదంటూ 200 మందితో కూడిన ఓ జాబితాను కోర్టు ముందుం చారు. అలాగే మిగిలిన పిటిషనర్లు కూడా మరికొందరి జాబితాను కోర్టుకు సమర్పించారు. ఈ జాబితాల్లో పేర్లన్నింటినీ పరిశీలించి, అందులో అర్హులుంటే వారికి తక్షణమే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్‌కు స్పష్టం చేసింది. అంతేకాక పరిహారం బాధితులకు నేరుగా అందేలా చూడాలంది. దీనికి శరత్ స్పందిస్తూ, ఇప్పటికే 80 శాతం కేసుల్లో పరిహారం చెల్లించామని కోర్టుకు నివేదించారు. మిగిలిన వారి విషయంలో పరిశీలన జరుగుతోందన్నారు. ఆత్మహత్యలపై కొన్ని సందేహాలున్నాయని తెలిపారు. మిగిలిన వారికి పరిహారం అందించే విషయంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి కొంత గడువు కోరుతున్నారన్నారు.