ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా స్వైన్‌ఫ్లూ అదుపులోకి రావడం లేదు.
గాంధీ ఆస్పత్రి : ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా స్వైన్‌ఫ్లూ అదుపులోకి రావడం లేదు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండ వేడికి స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రభావం తగ్గిపోతుందని సంబంధిత అధికారులు, వైద్యులు భావించారు. ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు చేరుకుంటున్నా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కావడం వైద్య నిపుణులకూ అంతుపట్టడం లేదు. ఈ వైరస్ మరింత బలీయమైనట్లు భావిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో 40 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ 22మంది బాధితులకు, 31 మంది అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. మరో ఆరుగురు స్వైన్‌ఫ్లూ బాధిత చిన్నారులు పీఐసీయూలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూ ఓపీలో శుక్రవారం 21 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీన్ని పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత గట్టిగా ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు.