మృత్యు ఘంటికలు మోగిస్తోన్న స్వైన్‌ఫ్లూ 

Shortage of beds and Ventilators at Osmania and Gandhi Hospital - Sakshi

     తాజాగా గాంధీలో ఒకరు.. ఉస్మానియాలో మరొకరు మృతి

     స్వైన్‌ ఫ్లూ బాధితులతో గాంధీ నోడల్‌ సెంటర్‌ కిటకిట

     వెంటిలేటర్లు, పడకల కొరతతో రోగుల ఇక్కట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ వైరస్‌.. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గురువారం ఒక్కరోజే ఇద్దరు మహిళలు స్వైన్‌ ఫ్లూతో మృత్యువాత పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం మరో 20 మం దికిపైగా బాధితులు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 140కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. వీటిలో వందకుపైగా గ్రేటర్‌లోనే నమోదయ్యాయి. ప్రస్తుత ఫ్లూ బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. 

గాంధీలో వెంటిలేటర్ల కొరత.. 
గాంధీ నోడల్‌ కేంద్రానికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఆస్పత్రి డిజాస్టర్‌ వార్డులో 10 వెంటిలేటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పటికే వీటిని రోగులకు అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర విభాగాల్లోని వెంటిలేటర్లు వినియోగించుకోవచ్చని భావించినా.. ఆయా వార్డుల్లోని రోగులకే వెంటిలేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని స్వైన్‌ ఫ్లూ నోడల్‌ కేంద్రంగా ప్రకటించినప్పటికీ.. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో పాలనా యంత్రాంగం కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మంది ఫ్లూ పాజిటివ్‌ బాధితులు ఆస్పత్రిలో చేరగా, వీరిలో నలుగురు మృతి చెందారు. 

మేడ్చల్‌ మహిళ మృతి.. 
గాంధీ ఆస్పత్రిలో వారం రోజుల్లో 10 స్వైన్‌ ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఈ నెల 8న గాంధీలో చేరిన మేడ్చల్‌ జిల్లా బండ్లగూడకు చెందిన మహిళ (56) స్వైన్‌ ఫ్లూతో గురువారం మృతి చెందింది. ప్రస్తుతం మరో 14 మంది ఆస్పత్రి డిజాస్టర్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో సిద్దిపేట మహిళ(55), వనపర్తి మహిళ(50), బాన్సువాడ పురుషుడు(60), కుత్బుల్లాపూర్‌ మహిళ(55), భువనగిరి పురుషుడు(45), కాచిగూడ గర్భిణి(29), మహేశ్వరం పురుషుడు(45), మహబూబ్‌నగర్‌ మహిళ(54), ముషీరాబాద్‌ మహిళ(32), విద్యానగర్‌ మహిళ(32)లు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. బాధితులందరికీ వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స చేస్తున్నారు.  

ఉస్మానియాలో గర్భిణి మృతి.. 
ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 15 మంది చేరగా, వీరిలో ముగ్గురికి ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో సనత్‌నగర్‌కు చెందిన లతీఫ్‌(57) అక్టోబర్‌ రెండున మృతి చెందగా, తాజాగా గురువారం ఉదయం తలాబ్‌కట్టకు చెందిన గర్భిణి (27) మృతి చెందింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ బాధితులు చనిపోయిన తర్వాతే స్వైన్‌ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2 పాజిటివ్‌ కేసులు, మరో 10 అనుమానాస్పద కేసులకు చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో గ్రేటర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్పత్రి స్వైన్‌ ఫ్లూ డిజాస్టర్‌ వార్డు ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీధర్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో 10 పడకలు ఉండగా, ఒక వెంటిలేటర్‌ అందుబాటులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఏఎంసీ వార్డులోని వెంటిలేటర్లను వినియోగిస్తామని తెలిపారు.

ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందే...
- సాధారణ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్‌ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. 
- నిజానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువ.  
- సాధారణ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. స్వైన్‌ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి.  
- బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. 3 రోజులు కంటే ఎక్కువగా ఈ లక్షణాలు వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. 
- ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించడం ద్వారా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. స్వైన్‌ ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.   
– డాక్టర్‌ శ్రీధర్, స్వైన్‌ ఫ్లూ నోడల్‌ అధికారి,ఉస్మానియా ఆస్పత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top