మామిడికి కార్బైట్ కాటు | carbet using in fruits markets in telugu states | Sakshi
Sakshi News home page

మామిడికి కార్బైట్ కాటు

May 7 2016 11:40 AM | Updated on Sep 3 2017 11:37 PM

మామిడికి కార్బైట్ కాటు

మామిడికి కార్బైట్ కాటు

పండ్లలో రారాజుగా.. మధుర ఫలంగా పేరొందిన మామిడిపండ్లు వ్యాపారుల లాభాపేక్ష కారణంగా విషతుల్యమవుతున్నాయి.

► విషతుల్యమవుతున్న మధుర ఫలాలు
►  నిషేధం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం


హైదరాబాద్: పండ్లలో రారాజుగా.. మధుర ఫలంగా పేరొందిన మామిడిపండ్లు వ్యాపారుల లాభాపేక్ష కారణంగా విషతుల్యమవుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టపడే ఈ పండు అనేక రోగాలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది. త్వరగా రంగు వచ్చేందుకు వ్యాపారులు యథేచ్ఛగా కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. వారం రోజులు మగ్గపెడితే కానీ పక్వానికి రాని మామిడికాయలపై కార్బైడ్ రసాయనం చల్లుతుండడంతో ఒక్క రాత్రిలోనే నిగనిగలాడే పసుపు రంగు వస్తోంది. దీంతో రంగు చూసి మోసపోతున్న ప్రజలు వాటిని అధిక ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
 
ఇలా మాగబెడుతున్నారు
 జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. ఏ పండ్ల దుకాణాలు చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల మధ్య ఉన్న పోటీ, సంపాదనే ధ్యేయంగా మార్కెట్‌లోకి వచ్చిన పచ్చి మామిడికాయలను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు ఉపయోగించి మాగబెడుతున్నారు. 30 కిలోల మామిడికాయలకు 200 గ్రాముల కార్బైడ్ రసాయనం ఉపయోగిస్తున్నారు. ఒక్క రాత్రిలో కాయలు పండ్లుగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న కాయల మధ్యలో కార్బైడ్‌ను ఉంచి వాటిని బాక్సుల్లో పెట్టి రవాణా చేస్తున్నారు. అక్కడికి వెళ్లేసరికి ఆ కాయలు పండ్లుగా మారతాయి.

 వచ్చే వ్యాధులు ఇవీ..
రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తిన్న వారికి నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గర్భిణులు, చిన్నపిల్లలకు అనేక రకాల ఆరోగ్య రుగ్మతలు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో అయితే శ్వాస సంబంధిత జబ్బులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాక కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయని, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుందని, పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని కనుక మామిడి పండ్లు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
పట్టించుకోని అధికారులు
కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధం విధించినా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆ విధానాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. మామిడి వ్యాపారం దాదాపుగా దీనిపైనే కొనసాగుతుంది. వినియోగదారులు ఈ కాయల రంగును బట్టి కొనుగోలు చేసి అనారోగ్యాల పాలవుతున్నారు. పబ్లిక్ హెల్త్ అధికారులు సైతం వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement