breaking news
fruit ripening
-
ఇవి తింటే.. రోగాలు వెంటే..
ఆసిఫాబాద్‌క్రైం : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైం ది. చూడగానే నీళ్లూరించే మామిడి పండ్లను ఎం త ధర ఉన్నా కొనేందుకు జనం మొగ్గుచూపుతా రు. కాని వీటి వెనుక దాగి ఉన్న పచ్చి మోసాన్ని మాత్రం పసిగట్టలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రి మంగా మాగబెడుతున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. జిల్లాలో 750 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ సారి ఈదురుగాలులు అధికంగా రావడంతో కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జిల్లాలో మామిడి కాయలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 15 వరకు మామిడి పండ్ల గోదాములు ఉండగా వివిధ రకాల కాయలను అందులో నిల్వ చేస్తూ నిషేధిత రసాయనాలతో మాగపెట్టి పండ్లుగా మారుస్తున్నారు. ప్రధానంగా మామిడి సీజన్లో ఈ దందా జోరుగా నడుస్తున్నా అధికార యం త్రాంగం చోద్యం చూస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రికి రాత్రే పండుతున్నాయి మార్కెట్లో సీజనల్ పండ్లకు డిమాండ్ బాగా పెరిగింది. కాయలను సహజసిద్ధమైన పద్ధతుల్లో మాగబెట్టి పండ్లుగా మార్చే వరకు వినియోగదారులు, వ్యాపారులు ఓపిక పట్టే పరిస్థితి లేదు. దీంతో నిషేధితమైనా విషపూరిత కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలను వినియెగించి రాత్రికి రాత్రే పండ్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి రసాయనాలను ఉపయోగించి పండించిన పండ్లు తినడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండు సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినపుడు తింటే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రమాదకర రసాయనాలు వినియోగించిన పండ్లు తినడం ద్వారా అజీర్తి, కడుపు నొప్పి, దురద, జీర్ణాశయం దెబ్బతింటుదని వైద్యులు చెబుతున్నారు. కొత్త పంథాను ఎంచుకున్న వ్యాపారులు జిల్లాలోని కొన్ని గోదాముల్లో కాయలను పండించేందుకు వ్యాపారులు సరికొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. కొత్తగా స్ప్రే ద్వారా మామిడి పండ్లపై రసాయనాలు చల్లుతున్నారు. గోదాముల్లో కాకుండా ఇళ్లలో మగ్గించి అవి పండిన తర్వాత గోదాములకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సహజ సిద్ధమైన పండ్లు లేవనేది జగమెగిరిన సత్యమే అయినా అధికారుల మాత్రం తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘మామూళ్ల’ మత్తులో అధికారులు జిల్లాలో పెద్ద మొత్తంలో పండ్లను మగ్గించడం దందా నడుస్తున్నా అధికారులు మాత్రం ఇటువైపు చూడకుండా మూమూళ్ల మత్తులో మునిగిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం జిల్లాలోని ఒక్క గోదాముల్లో కూడా ఇప్పటి వరకు తనిఖీలు చేయకపోవడమే. పదిహేను, నెల రోజులకు ఒకసారి అధికారులు వ్యాపారుల వద్దకు వచ్చి చేతులు తడుపుకుంటున్నట్లు సమాచారం. కృత్రిమంగా పండించిన పండ్లు ఇలా ఉంటాయి.. æ కృత్రిమంగా పండించిన పండ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. æ సహజ పండ్లకు, కృత్రిమ పండ్లకు రుచిలో తేడా ఉంటుంది. æ మామిడి పండ్లు పండినా రుచి పుల్లగా ఉంటే రసాయనాలు వినియోగించినట్లుగా గుర్తించాలి. æ అరటి పండ్లు సైతం పైన పసుపు రంగులో ఉండి లోపల మగ్గకపోగా రుచిలో కూడా తేడా ఉంటుంది. æ ఈ పండ్లను పరిశీలిస్తే తెల్లటి మిశ్రమం ఉంటుంది. æ నీటిలో వేస్తే రంగు మారుతుంటుంది. -
మామిడికి కార్బైట్ కాటు
► విషతుల్యమవుతున్న మధుర ఫలాలు ► నిషేధం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం హైదరాబాద్: పండ్లలో రారాజుగా.. మధుర ఫలంగా పేరొందిన మామిడిపండ్లు వ్యాపారుల లాభాపేక్ష కారణంగా విషతుల్యమవుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టపడే ఈ పండు అనేక రోగాలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది. త్వరగా రంగు వచ్చేందుకు వ్యాపారులు యథేచ్ఛగా కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. వారం రోజులు మగ్గపెడితే కానీ పక్వానికి రాని మామిడికాయలపై కార్బైడ్ రసాయనం చల్లుతుండడంతో ఒక్క రాత్రిలోనే నిగనిగలాడే పసుపు రంగు వస్తోంది. దీంతో రంగు చూసి మోసపోతున్న ప్రజలు వాటిని అధిక ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా మాగబెడుతున్నారు జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. ఏ పండ్ల దుకాణాలు చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల మధ్య ఉన్న పోటీ, సంపాదనే ధ్యేయంగా మార్కెట్లోకి వచ్చిన పచ్చి మామిడికాయలను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు ఉపయోగించి మాగబెడుతున్నారు. 30 కిలోల మామిడికాయలకు 200 గ్రాముల కార్బైడ్ రసాయనం ఉపయోగిస్తున్నారు. ఒక్క రాత్రిలో కాయలు పండ్లుగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న కాయల మధ్యలో కార్బైడ్‌ను ఉంచి వాటిని బాక్సుల్లో పెట్టి రవాణా చేస్తున్నారు. అక్కడికి వెళ్లేసరికి ఆ కాయలు పండ్లుగా మారతాయి. వచ్చే వ్యాధులు ఇవీ.. రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తిన్న వారికి నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గర్భిణులు, చిన్నపిల్లలకు అనేక రకాల ఆరోగ్య రుగ్మతలు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో అయితే శ్వాస సంబంధిత జబ్బులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాక కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయని, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుందని, పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని కనుక మామిడి పండ్లు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టించుకోని అధికారులు కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధం విధించినా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆ విధానాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. మామిడి వ్యాపారం దాదాపుగా దీనిపైనే కొనసాగుతుంది. వినియోగదారులు ఈ కాయల రంగును బట్టి కొనుగోలు చేసి అనారోగ్యాల పాలవుతున్నారు. పబ్లిక్ హెల్త్ అధికారులు సైతం వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.