
అమీర్‌పేటలో ఆధునిక పార్కింగ్
మహానగరంలో అత్యాధునిక ‘వర్టికల్ పార్కింగ్’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న సెమీ ఆటోమేటెడ్
- రూ.28కోట్లతో హైటెక్ నిర్మాణం
- 8 అంతస్తులతో వర్టికల్ టవర్
- పీపీపీ విధానంలో ప్రాజెక్టుకు శ్రీకారం
- టెండర్‌పై హెచ్‌ఎండీఏ కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో అత్యాధునిక ‘వర్టికల్ పార్కింగ్’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న సెమీ ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వ్యవస్థను తొలుత అమీర్‌పేటలో నిర్మించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. రూ.28 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంతో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇందుకు ఏపీఐడీఈ అనుమతి కోరుతూ అధికారులు సదరు ఫైల్‌ను ఇటీవల ప్రభుత్వానికి పంపగా... ఆమోదం తెలిపినట్టు హెచ్‌ఎండీఏకు గురువారం వర్తమానం అందింది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొన్నారు. 18 నెలల వ్యవధిలో టవర్ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకయ్యే వ్యయాన్ని రాబట్టుకొనేందుకు నిర్మాణ సంస్థకు సుమారు 15 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిర్వహించుకొనే అవకాశాన్ని హెచ్‌ఎండీఏ కల్పిస్తోంది.
ప్రణాళిక ఇదీ...
అమీర్‌పేటలో స్వర్ణజయంతి కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారికి ఆనుకొని (ప్రస్తుతం ఎవర్స్ కార్స్) ఉన్న స్థలంలో మల్టీలెవెల్ వర్టికల్ పార్కింగ్ టవర్‌ను నిర్మిస్తారు.
సుమారు 1647చ.గ.ల విస్తీర్ణంలో 18 మీటర్ల ఎత్తులో నిర్మించే ఈ టవర్‌లో 7-8 అంతస్తుల్లో పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేస్తారు.
ఒక్కో అంతస్తు 4.5 నుంచి 5 మీటర్ల ఎత్తు ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో 320 కార్లు, 320 టూ వీలర్స్ మొత్తం 640 వాహనాలను పార్క్ చేసుకోవచ్చు.
హైడ్రాలిక్ విధానంతో వాహనాన్ని పైఅంతస్తుల్లోకి తీసుకెళ్లి పార్కు చేయడం, ఇదీ క్షణాల్లో జరిగిపోవడం ప్రత్యేక. వాహనాన్ని పార్కు చేయాలన్నా... తిరిగి కిందికి తీసుకు రావాలన్నా 4-5 నిముషాల వ్యవధిలోనే ఆ ప్రక్రియ పూర్తయ్యేలా టెక్నాలజీని వినియోగించనున్నారు.
మలిదశలో...
మెట్రోరైల్ అందుబాటులోకి వచ్చేనాటికి పలు రద్దీ ప్రాంతాల్లో స్టేషన్ల వద్ద హెచ్‌ఎండీఏ స్థలాల్లో పార్కింగ్ లాట్స్/ మల్టీలెవెల్ టవర్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల సంస్థకు అదనపు ఆదాయం రావడంతో పాటు సొంత స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడవచ్చను కొంటున్నారు. నగరంలో మల్టీలెవెల్ టవర్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ఎక్కడెక్కడ స్థలాలను కేటాయించ వచ్చు, అందుకు గల అవకాశాలపై హెచ్‌ఎండీఏ దృష్టిపెట్టింది. అమీర్‌పేటలో ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తే మలిదశలో ఐమాక్స్ థియేటర్‌కు సమీపంలోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వద్ద, శిల్పారామం సమీపంలో మల్టీలెవెల్ వర్టికల్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. గతంలో ఇక్కడ వర్టికల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించేందుకు ‘బృగు’ సంస్థ ముందుకు వచ్చింది. అయితే... అధికారులు సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో ఆ సంస్థ వెనుదిరిగింది.
ప్రయోజనాలివీ...
నగరంలో ఏటా 20శాతం మేరకు కార్ల సంఖ్య పెరుగుతోంది. అందుకనుగుణంగా పార్కింగ్ సదుపాయాల్లేవు. ఈ క్రమంలోనే మల్టీలెవెల్ పార్కింగ్ గురించి హెచ్‌ఎండీఏ యోచిస్తోంది
సాధారణంగా 50 చ.గ.ల స్థలంలో మూడు కార్లను మాత్రమే పార్కింగ్ చేసే అవకాశం ఉంది. అదే... వర్టికల్ పార్కింగ్‌లోనైతే ఒక్కో అంతస్తులో మూడు చొప్పన 10 అంతస్తుల్లో 30 కార్లు పార్క్ చేయవచ్చు. 600 చ.గ. స్థలం ఉంటే చాలు... సుమారు వెయ్యి కార్లను పార్క్ చేయవచ్చు
ఆటోమేటిక్ పార్కింగ్ అండ్ డెలివరీ సిస్టమ్‌ను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తారు. దీనివల్ల తక్కువ స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు
{పధానంగా సినిమా థియేటర్లు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మల్లీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద ఈ ప్రత్యామ్నాయ పార్కింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయించే దిశలో హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.