ఆ సవరణలు సహకార బ్యాంకులకు శాపాలు


పట్టణ సహకార బ్యాంకుల సమాఖ్య విమర్శ


సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల చట్ట సవరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహకార బ్యాంకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారుల తీరు సహకార బ్యాంకుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ సహకార సంఘాల చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ తయారు చేసిన చట్టంలో అనేక మార్పులు, చేర్పులూ చేశారని, అవి పట్టణ సహకార బ్యాంకులకు శాపంగా మారాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బహుళ రాష్ట్ర సహకార పట్టణ బ్యాంకుల సమాఖ్య విమర్శించింది.


శుక్రవారం ఇక్కడ ‘తెలంగాణ సహకార సంఘాల చట్టం’పై జరిగిన సదస్సులో సమాఖ్య అధ్యక్షుడు జి.రామమూర్తి మాట్లాడుతూ ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలని సవరణ తీసుకొచ్చారని, లెసైన్స్ రెన్యువల్ ఉంటుందే కానీ, రిజిస్ట్రేషన్‌కు రెన్యువల్ చేసుకోవాలని పేర్కొనడం అర్థరహితమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి వివరించగా ఆయన కూడా విస్మయం వ్యక్తం చేశారన్నారు. అధికారులను తాము నిలదీయగా ఈ నిబంధన నుంచి పట్టణ సహకార బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారని చెప్పారు.


సహకార బ్యాంకుల్లో ఎన్నికల అధికారిని నియమించే అధికారాన్ని సహకారశాఖకు కట్టబెట్టి అధికారుల జోక్యాన్ని మరింత పెంచారన్నారు. జనరల్ బాడీ మీటింగ్‌లకు సహకార సంఘాల రిజిస్ట్రార్ హాజరవుతారని పేర్కొన్నారని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమావేశంలో సమాఖ్య చైర్మన్ వేమిరెడ్డి నర్సింహారెడ్డి, డెరైక్టర్ జి.మదన గోపాలస్వామి, సుధా సహకార పట్టణ బ్యాంకు సీఈవో పెద్దిరెడ్డి గణేష్, సమాఖ్య సీఈవో గంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top