14న మళ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ | Sakshi
Sakshi News home page

14న మళ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

Published Wed, Mar 9 2016 3:13 AM

Again on the 14th meeting of the Committee of Privilege

♦ హాజరవ్వాలంటూ రోజా, కొడాలి, జ్యోతుల, కోటంరెడ్డి, చెవిరెడ్డిలకు నోటీసులు
♦ టీడీపీ ఎమ్మెల్యే అనితకు కూడా..
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 14వ తేదీన మళ్లీ సమావేశం కానుంది. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అందజేసిన నివేదికలో ప్రస్తావించిన ఎమ్మెల్యేల వాదనలను ఆ రోజున విననుంది. ఆ మేరకు తమ వాదనలు వినిపించాల్సిందిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతోపాటు ప్రివిలేజ్ కమిటీలో సభ్యునిగా ఉన్న జ్యోతుల నెహ్రూకు కూడా మంగళవారం నోటీసులు జారీ చేసింది. అలాగే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కూడా అదేరోజున కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించాలంటూ నోటీసులిచ్చింది.

ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ఇందులో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ(వైఎస్సార్‌సీపీ), కె.రామకృష్ణ(టీడీపీ) పాల్గొన్నారు. కమిటీ ముందు రోజా మంగళవారం హాజరై వాదనలు వినిపించాల్సి ఉంది. తాను నగరంలో ఉండట్లేదు కాబట్టి హాజరు కాలేనని, మరో రోజు హాజరవుతానని ఆమె లేఖ రాశారు. లేఖను కమిటీ ఆమోదించి.. 14న కమిటీ తిరిగి సమావేశమవుతుంది కాబట్టి ఆరోజున హాజరు కావాలని ఆమెను కోరింది. గత డిసెంబర్‌లో శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించిన బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ.. కొడాలి నానితోపాటు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను ెహ చ్చరించాలని సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందర్నీ 14న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవ్వాలని నోటీసులిచ్చింది. అందరి వాదనలు విన్న తరువాత కమిటీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా తన నివేదికను అసెంబ్లీకి సమర్పించనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement