నిరంకుశత్వంపై నిరసన గళాలు | Social Activist Devi Guest Column On Protests | Sakshi
Sakshi News home page

నిరంకుశత్వంపై నిరసన గళాలు

Jan 9 2020 12:54 AM | Updated on Jan 9 2020 12:54 AM

Social Activist Devi Guest Column On Protests - Sakshi

‘సర్‌ ఫరోషీకి తమన్నా ఆజ్‌ హమారే దిల్‌ మె హై దేఖనా హై జోర్‌ కితనా బాజువే కాతిల్‌ మెహై’... అంటూ తెల్లదొరలకు సవాలు విసిరిన రాంప్రసాద్‌ బిస్మిల్‌ని, ఆ పాట పెదాలపై చిరునవ్వుగా వెలయించి మరణించిన అష్ఫదుల్లా ఖాన్‌ని భుజాన్నేసుకుని ఊరేగుతున్నది నేటి యువతరం. పౌర చట్టం వద్దంటూ వీధి వీధినా... ‘కాబిల్‌’ ఎవడయినా, ఏ నిరంకుశుడయినా కావచ్చుగాని జనం కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధమవుతున్న యువత పీక నులిమేంత శక్తి ఏ పాలకుడికీ, పోలీసు మిలటరీకి లేదన్నదే ఈ సవాలు. 

నేటి నిరసనల్లో ప్రతి వ్యక్తికీ తమదయిన ఒక అభివ్యక్తీకరణ ఉంది. తాము చెప్పదల్చుకున్నది పోస్టరు నినాదమో, చిత్ర రూపమో స్వంతంగానే రాసుకుంటారు. లేదంటే ‘నెట్‌’ సృజనకారుల నుండి తమను వ్యక్తపరిచేదాన్ని స్వంతం చేసుకుంటారు. ‘తు జింద హై తా జిందగీకి జీత్‌ మే యకీన్‌ కర్‌’ అంటూ ‘నువ్వు బతికే ఉంటే జీవిత విజ యాన్ని విశ్వసించు. స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించు’ శంకర్‌ శైలేంద్రని బతికిస్తారు. ‘హమ్‌ దేఖేంగే’ అన్న ప్రముఖ ఉర్దూ కవి ఫెయిజ్‌ అహ్మద్‌ ఫెయిజ్‌ని ఇక్సాల్‌ బానో స్వరంతో మేళవించి ‘మేం చూస్తాం వాగ్దానం చేసిన ఆ రోజులు... శిలాఫలకాలపై రాసిన ఆ రోజులు వస్తాయో లేదో మేమూ చూస్తాం... నియంతృత్వ పర్వతాలు దూదిపింజల్లా ఎగిరిపోయే కాలాన్ని మేం చూస్తాం’ అంటూ గిటార్‌ స్వరాలు పలుకుతారు. అన్నిరంగాలవాళ్లు ‘మాకు కావాలి ఆజాదీ.. పౌర చట్టం నుండి ఆజాదీ, మత రాజ్యం నుండి, దరిద్రం నుండి, నిరుద్యోగం నుండీ’ అంటూ జేఎన్‌యూ నినాదం కొత్త సొబగులు అద్దుకుంటోంది. 

ఫీజుల పెంపుకు నిరసనలో ‘గుడ్డోడికి కూడా నిరసనా’ అంటూ గల్లీ పోలీసుల చేతుల్లో వీపుపైనే కాదు మనసు కూడా గాయపడిన సుమన్‌ ‘ఈ నేలపై ప్రవహిస్తున్న నెత్తుటికి లెక్కలు కావాలి గులాబీలు కాదు విప్లవాలు కావాలి’ అని గంభీరంగా నిలదీస్తాడు. ‘విలాస మందిరాల్లోనే వెలిగే దీపాల్ని, కాంతిలేని ఉదయాల్ని నేను స్వాగతించను, నేను అంగీకరించను’ అంటూ జైలు కవిత్వం రాసిన హబీజ్‌ జలీబ్‌ని ఆవాహన చేస్తాడు. ‘బెల్గానియో వెనక్కి పో’ అంటూ రెండో ప్రపంచ యుద్ధకాలంలో ముస్సోలినీని తిరగ్గొట్టిన గీతం హిందీలో ‘వాపస్‌ జావ్‌’ అంటూ గిటారు చేతులతో ప్రకంపిస్తాడు ఫూజన్‌. వాపస్‌ జావ్‌ అంటూ వేల గొంతులతనికి బదులు పలుకుతాయి. ‘నేనెవరిని ఎక్కడినుండి వచ్చాను నాకు చోటేది’ అన్న ఎమర్జెన్సీ నాటి రంగస్థల గీతాలు, ‘రుకేన జాకీన’ ఆగేది లేదు లొంగేది లేదు అంటూ క్రమశిక్షణగా సాగే ఊరేగింపుల మార్చింగ్‌ సాంగ్‌లవుతున్నాయి. వ్యంగ్యంలో కూడా తీసిపోకుండా ‘మోదీజీ... మోదీజీ... లాఠీచార్జీ తేలిగ్గా ఉంటుందనీ బాష్పవాయువు హాయిగా ఉంటుందనీ మీరు చెబితే ఇపుడే తెలిసిందని’ జామియా మిలియా భజనలు చేస్తున్నది ‘దేనే హైసారీ దునియా ప్రపంచం అంతా చుట్టావు... జపాను నుండి అమెరికా దాకా అపుడపుడూ భారత్‌లో ఆగుతావు.. మంచిరోజుల కలలమ్ముతావు’ అంటూ 80వ దశకంలో మార్మోగిన ఐలవ్‌ ఇండియా పాట పేరడీకి డ్యాన్స్‌ చేస్తారు.

స్టాండప్‌ కమెడియన్లు గత ఆరేళ్లుగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇవ్వాళ యువతకు వీరు హీరోలు. సంగీతకారుడు రాహుల్‌రాయ్‌ రాసిన అనేక వ్యంగ్య గీతాలు తీవ్రమైన నిరసనల మధ్య వినోదాన్ని పంచుతూ పాలకుల్ని వెక్కిరి స్తున్నాయి. ఇది ముస్లింల సమస్య కాదు సమస్త భారతీయులదీ. ఈ దేశం అదానీలు, అంబానీలు, సంఘీయుల వారసత్వం కాదు. స్వాతంత్య్ర పోరా టంలో మీ అడ్రసెక్కడ అంటూ ప్రశ్నిస్తున్నాయి.  

జంతర్‌ మంతరా, షహీక్‌ బాగా, ఆజాద్‌ మైదానా లేక అనేక నగరాల్లోని గల్లీలధర్నా చౌకీలా కాదు.. ప్రతిచోటా.. ఒక పద్ధతిలో వస్తారు. పాడతారు, నృత్యం చేస్తారు, ఉపన్యాసాలిస్తారు. కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు తమ బాధ్యతగా కలాలు పదునుపెడుతున్నారు. పరిపాలకుల ప్రతి విధానం కవితారూపక వ్యంగ్యాన్నో, విసురునో, నిరసననో ఎదుర్కొంటున్నది. 
హిందీ సినిమా రచయిత వరుణ్‌గ్రోవర్‌ కవిత 
‘మేం కాగితాలు చూపించం (సర్టిఫికెట్లు) 
రాం ప్రసాదు ‘బిస్మీల్‌’ కాగల దేశం 
ఈదేశం మా అందరికీ సొంతం 
మట్టినెట్లా విభజిస్తావు 
కలిసుంది దాన్లో అందరి రక్తం’

దేవి
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త, 
ఈమెయిల్‌: devi11021967@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement