పొఖ్రాన్‌ అణుపరీక్షలు సాధించిందేమిటి?

Pokhran Tests Pushed Pakistan Into Nuclear Weapons Competition - Sakshi

అవలోకనం

తాను అభివృద్ధి చేసిన అణ్వాయుధాల సంఖ్య రీత్యా చూస్తే ఈరోజు పాకిస్తాన్‌ వాస్తవంగా మనకంటే ముందంజలో ఉంది. నిస్సందేహంగా 1998లో పొఖ్రాన్‌లో మనం నిర్వహించిన అణు పరీక్షలు పాకిస్తాన్‌ను అణ్వాయధ పోటీలోకి నెట్టాయి. మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్నలు ఇవే. కానీ 1998లో మనం పర్యవసానాల గురించి ప్రశ్నించుకోలేదు. ఊహించని పర్యవసానాలకు దారి తీసే చర్యకు పూనుకోబోయే ముందు ఏ పరిణత సమాజమైనా, ప్రత్యేకించి ఏ ప్రజాస్వామ్య దేశమైనా ఆ చర్యపై కూలంకషంగా చర్చలు జరపాలి. కానీ మనం అంతటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని పటాసులు పేల్చి ఆనందించుకునే సంబరాల లెక్కకు తగ్గించేశాం.

1998 మార్చి 11, 13 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌ ప్రాంతంలో భారత్‌ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. 1974లో పొఖ్రాన్‌లోనే తొలి అణుపరీక్ష జరిగిన 24 ఏళ్ల తర్వాత రెండో దఫా అణుపరీక్షలు జరిగాయి. కెనడా నుంచి దిగుమతి చేసుకున్న అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నిబంధనలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఉల్లం ఘించి మరీ అణుపరీక్షలు జరపడంతో భారత్‌ ఆంక్షలను ఎదుర్కొంది. అత్యంత అస్థిర పరిస్థితులలో భారత్‌ తొలి అణుపరీక్ష జరిపింది. అంతకు పదేళ్లక్రితమే అంటే 1960ల మధ్యలో చైనా అణు శక్తి దేశంగా ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితిలో వీటో శక్తి కలిగిన అయిదు దేశాల్లో అణుబాంబును సాధించిన చివరి దేశంగా చైనా చరిత్రకెక్కింది.

అవి ప్రపంచం మళ్లీ యుద్ధంలో చిక్కుకున్న క్షణాలు. అమెరికా అప్పుడే వియత్నాం సైనిక ఘర్షణను ముగించింది. ఇందిర అణు పరీక్ష జరిపిన కొన్నేళ్ల తర్వాత సోవియట్‌ యూనియన్‌ ఆప్ఘనిస్తాన్‌పై దాడికి దిగింది. 1970లలో ప్రపంచం ఘర్షణల్లో కూరుకుపోయి ఉండింది. కొరియన్‌ యుద్ధ కాలంలో చైనాపై, ఉత్తరకొరియాపై అణుదాడులు చేస్తామని అమెరికా అత్యున్నత సైనిక జనరల్‌ మెకార్థర్‌ హెచ్చరించాడు. ఇందిరా గాంధీ 48 ఏళ్లక్రితం అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యం విశిష్టమైనది.

అయితే అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో 1998లో భారత్‌పై ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. అది ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాతి కాలం. సోవియట్‌ యూనియన్‌ కుప్పగూలింది. సమాచార సాంకేతిక విప్లవం అప్పుడే పురివిప్పుతోంది. సేవల ప్రాతిపదికన కొత్త ఆర్థిక భవిష్యత్తు వైపుగా భారత్‌కు బెంగళూరు దిశానిర్దేశం కల్పిస్తున్న రోజులవి. అదే సమయంలో ఆయుధాలు కాకుండా సంపదలోనే అధికారం ఉందని తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా ఇతర ఆసియన్‌ టైగర్‌ దేశాలు నిరూపిస్తూ ఆర్థిక శక్తులుగా ఎదిగిన కాలమది. 1998 నాటి అణుపరీక్షలపై మనం ఎలాంటి ముందస్తు చర్చలూ జరపలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం తన 13 రోజుల తొలి పాలనా కాలంలోనే అణ్వాయుధాలను పరీక్షించాలని తలచింది. కానీ ఉన్నతాధికార బృందం అందుకు అంగీకరించనని తెలిపింది. ఎంత సాదా సీదాగా అణుపరీక్షలను చేపట్టారో దీన్నిబట్టి తెలుస్తుంది.

రెండో దఫా అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత సర్వత్రా ఉత్సవాలు, పటాసులు పేల్చడాలు, స్వీట్లు పంచడాలతో దేశం సంబరాలు జరుపుకుంది తప్పితే ఆ పరీక్షలపై నిశిత చర్చ కానీ, మౌలిక ప్రశ్నలను సంధించడం కానీ జరగలేదు. ఆనాటి భావోద్వేగ క్షణాలు ముగిసిపోయి 20 ఏళ్లు గడిచిన తర్వాత అణుపరీక్షలు ఇప్పుడు విసుగు తెప్పించే అంశం కావచ్చు. ఆ మౌలిక ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం.

తొలిప్రశ్న.. ఆ అణుపరీక్షలు భారత్‌ను అణుశక్తి దేశంగా మార్చాయా? అంటే సమాధానం లేదనే వస్తుంది. 1974లో తొలి అణు పరీక్షల తర్వాత ఇండియాను, ఇందిరను ప్రపంచం శిక్షించింది. అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందివ్వకుండా తృణీకరించింది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తామన్న నిబంధనలను ఉల్లంఘించి మనం అణుకార్యక్రమాన్ని ఆయుధీకరించాం మరి. 1998 అణు పరీక్షలు దాన్నే పునరావృతం చేశాయి.

రెండు.. ఈ అణుపరీక్షలు భారత్‌ను సురక్షిత స్థానంలో నిలిపాయా? పొఖ్రాన్‌–2 పరీక్షలు జరిగిన సంవత్సరం తర్వాత 1999లో కార్గిల్‌ యుద్ధం ద్వారా పాకిస్తాన్‌ మనల్ని రెచ్చగొట్టింది. ఆ యుద్ధంలో మనం 500 మంది సైనికులను కోల్పోయాం. పదేళ్ల తర్వాత ముంబైలో దాడులను చవి చూశాం. పొఖ్రాన్‌ అణుపరీక్షల తర్వాత కశ్మీర్‌ ఘర్షణలో అత్యంత హింసాత్మక ఘటన 2001లో జరిగింది. నాటి ఘర్షణల్లో 4,500 మంది ప్రజలు చనిపోయారు.

మూడు.. ఆనాటి అణుపరీక్షలు మన అణు టెక్నాలజీని మెరుగుపర్చాయా? దీనికి కూడా లేదనే సమాధానం వస్తుంది. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంది కానీ మరే దేశంతోనూ అలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయాం.

నాలుగు.. అణుపరీక్షలు భారత్‌ స్థాయిని అంతర్జాతీ యంగా పెంచాయా? లేదనే సమాధానం. ఐక్యరాజ్యసమితి భద్రతాసమితిలో సభ్యత్వం కావాలని భారత్‌ చాలా కాలంగా పోరాడుతోంది. కానీ మనం నిర్వహించిన అణుపరీక్షలు మనల్ని అక్కడికి తీసుకుపోలేదు. పైగా మనకు హాని జరిగింది. అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌కు సభ్యత్వం కావాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు.

ఐదు.. అణుపరీక్షల వల్ల సాధించిన అణు సాంకేతికతతో మనం మరింత విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామా? లేదనే సమాధానం. ఈరోజు భారత్‌ అణువిద్యుత్‌ కంటే సౌర విద్యుత్‌పైనే దృష్టి పెట్టింది. 
ఆరు.. దక్షిణాసియా ప్రాంత దేశాల బలాబలాలను మన అణుపరీక్షలు మార్చాయా? దీనికీ లేదనే సమాధానం. పొఖ్రాన్‌లో భారత్‌ రెండో దఫా అణుపరీక్షలు నిర్వహించిన కొద్ది రోజులకే పాకిస్తాన్‌ బలూచిస్తాన్‌లోని చాగై ప్రాంతంలో అణుపరీక్షలు జరిపింది. ఉపఖండంలో నేడు ఎలాంటి అణు ప్రతిష్టంభనా లేదు. మన సాంప్రదాయిక ఆధిక్యతను మనం ఇకపై ఉపయోగించలేం కూడా.

చైనా మన ప్రాంతంలో ఆర్థిక చొరవను చాలా బలంగా ముందుకు తీసుకొస్తోంది. ఈరోజు మనం చైనా సైనిక బలాన్ని కాకుండా మన అవకాశాలన్నింటినీ కొల్లగొట్టుకుపోయే దాని సామర్థ్యతను చూసి భయపడుతున్నాం. తాను అభివృద్ధి చేసిన అణ్వాయుధాల సంఖ్య రీత్యా చూస్తే ఈరోజు పాకిస్తాన్‌ వాస్తవంగా మనకంటే ముందంజలో ఉంది. నిస్సందేహంగా 1998లో పొఖ్రాన్‌లో మనం నిర్వహించిన అణు పరీక్షలు పాక్‌ను అణ్వాయధ పోటీలోకి నెట్టాయి. మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్నలు ఇవే. కానీ 1998లో మనం పర్యవసానాల గురించి ప్రశ్నించుకోలేదు. ఊహించని పర్యవసానాలకు దారి తీసే చర్యకు పూనుకోబోయే ముందు ఏ పరిణత సమాజమైనా, ప్రత్యేకించి ఏ ప్రజాస్వామ్య దేశమైనా ఆ చర్యపై కూలంకషంగా చర్చలు జరపాలి. కానీ మనం అంతటి కీలకమైన అంశాన్ని పటాసులు పేల్చి ఆనందించుకునే సంబరాల లెక్కకు తగ్గించేశాం.

జరిగిన పరిణామాలన్నింటినీ గ్రహిస్తూనే మనం ఇప్పటికీ అణు సంబంధ పరీక్షలకు, ఆయుధ పోటీకి బరిలో ముందు నిలుస్తూనే ఉన్నాం. ఈ అంశాన్ని పాఠకులకే వది లిపెడతాను. కానీ అణుపరీక్షల వల్ల మనం సాధించిన ఒక్కటంటే ఒక్క ప్రయోజనాన్ని కూడా నేను లెక్కించలేకున్నాను. అదేసమయంలో ఒక ముఖ్యమైన నష్టాన్ని చెబుతాను. 1998–99 సంవత్సరంలో భారత్‌కు విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి. గత శతాబ్ది చివరి పాతికేళ్లలో భారత్‌కు పెట్టుబడులు రాకుండా నిలిచిపోయిన సంవత్సరం అదొక్కటి మాత్రమే.  

విదేశీ పెట్టుబడులు దేశం నుంచి శరవేగంగా తరలిపోయాయి. ఎందుకంటే పెట్టుబడి చాలా పిరికిది. విధ్వం సకర సాంకేతికతను తేలిగ్గా పరిగణించడం ద్వారా జనించే అనిశ్చితిని అది అస్సలు ఇష్టపడదు. ఆ ఘటనతో భారత్‌కు కలిగిన ఆర్థిక నష్టాన్ని ఎవరూ చర్చించినట్లు లేదు. పొఖ్రాన్‌ –2 ఘటన జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎలాంటి వేడుకలూ మనం జరుపుకోవడం లేదు. అంటే అప్పుడు ఏమీ జరగలేదన్నట్లుగా మనం వ్యవహరిస్తున్నాం మరి.

వ్యాసకర్త: ఆకార్‌ పటేల్‌, కాలమిస్టు, రచయిత

ఈ–మెయిల్‌ : aakar.patel@icloud.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top