కరోనాను ఊడ్చేసేవారికి విలువేది?

Mallepally Laxmaiah Article On Sanitation Workers - Sakshi

కొత్త కోణం

ఎంతటి కరోనా సంక్షోభంలోనైనా పారిశుద్ధ్య కార్మికుల చీపురు వీధులను శుభ్రం చేయడం మానలేదు. ఈ ప్రపంచమంతా కరోనాతో స్తంభించిపోయి నప్పుడూ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. పక్కవాడి గాలిసోకితేనే భయంతో వణికిపోతూన్న తరుణంలో, మనమంతా వాడిపారేసిన చెత్తను చేతులతో ఎత్తిపోస్తున్నారు.  కరోనాను సమాజం నుంచి తరిమికొడుతున్నారు. అయితే ఈ సమాజం అనునిత్యం వెలివేస్తున్నా, వారిని శతాబ్దాలుగా తరిమి కొడుతున్నా.. తరతరాలుగా ఈ సమాజం మురికిని కడిగిపారేస్తోంది మాత్రం వాళ్ళే. చెత్త ఎత్తే వారికి ఇంతకంటే విలువక్కర్లేదనుకుంటే మాత్రం కోవిడ్‌ లాంటి ఉపద్రవాలనుంచి కాపాడే వారు భవిష్యత్‌లో మనకు కనుచూపుమేరలో కనిపించరు. 

‘‘నాకు మళ్ళీ జన్మించాలనే కోరిక లేదు. ఒకవేళ నేను పునర్జన్మ పొందితే బంగీ (సఫాయి) కర్మచారిగా పుట్టాలని మాత్రమే కోరుకుంటాను’’ అన్నది భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ వ్యాఖ్యానం.

నాటి మహాత్మాగాంధీ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకూ సమాజ పరిశుభ్రతకోసం పాటుపడటం అంటే అది దేశానికి ఎనలేని సేవచేయడమే. అందుకే ‘పరిసరాల్లో ఉన్న చెత్తాచెదారాన్ని, మురికిని తొలగించి భారతమాతకు సేవ చేస్తాను. ప్రతివారం రెండు గంటల చొప్పున సంవత్సరం మొత్తం వంద గంటలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేసి చరిత్రలో నిలిచిపోతాను’ అంటూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరితో ప్రత్యేకించి ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రజాప్రతినిధులందరితో ప్రమాణం చేయించారు. కానీ ఒకటి రెండు గంటలు కాదు, ఒక యేడాదో, రెండేళ్ళో కూడా కాదు. కొన్ని దశా బ్దాలుగా అదే పనిని చేస్తున్న వాళ్ళకు మాత్రం ఏ చరిత్రలోనూ చోటు దక్కదు. కరోనాయే కాదు, అంతకు మించిన మహమ్మారి వచ్చినా అన్ని వ్యాధులనుంచి మనల్ని కాపాడే మనుషులకు కనీసం పశువుల కున్న పాటి గౌరవం కూడా ఉండదు.

మహాత్మాగాంధీ పరిసరాలను శుభ్ర పరుస్తున్న సఫాయికర్మచారీ లను పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసిస్తే, నరేంద్ర మోదీ పరిసరాలను శుభ్రంచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ప్రశం సలు సఫాయికర్మచారీల జీవితాల్లో ఎటువంటి మార్పులు తేలేదు. గాంధీకి మాత్రం పేరు తెచ్చిపెట్టాయి. మోదీ మాటలు కూడా గాలి లోనే కలిసిపోయాయి. ఫోటోలకు ఫోజులివ్వడానికి ప్రము ఖులు చీపుర్లు పట్టుకొని నటించారే తప్ప, ఏనాడూ చిత్త శుద్ధితో వ్యవహరిం చలేకపోయారు. పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో ఏ ‘దీపాల’ వెలు గులూ  నింపలేకపోయారు. గత మూడు నెలలుగా వీరంతా తమ అందమైన భవనాల్లో ఏసీ గదులకు పరిమితమైపోయి, వంటలు, వార్పులూ చేస్తూ, టీవీల్లో భాష్యాలు చెపుతున్నారు. అయినా ఆశ్చ ర్యంగా వీధులు శుభ్రంగానే ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగానే ఉంటున్నాయి. అయితే అది ఎవరివల్ల సాధ్యమైంది? ఎవరు దీనికి కారకులు? వారి జీవితాలకు కావాల్సిందేమిటి అన్న ప్రశ్న మాత్రం ఎక్కడా వినిపించదు. 

ఎంతటి కరోనా సంక్షోభంలోనైనా పారిశుద్ధ్య కార్మికుల చీపురు వీధులను శుభ్రం చేయడం మానలేదు. మనమంతా లాక్‌డౌన్‌తో ఇండ్లల్లో సేదతీరుతోంటే వీరు మాత్రం మనల్ని కరోనానుంచి కాపాడే మహత్తరమైన పనిలో నిమగ్నమై ఉన్నారు. భారత దేశంలో 2018లో జరిగిన సర్వే ప్రకారం యాభై లక్షల మంది నగరాల్లో, మరో ముప్ఫై అయిదు లక్షల పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లో ఉన్నారు. ఇంటింటికీ తిరిగి సేకరించి తీసుకెళుతున్న వాళ్ళు మరో 20 లక్షల మంది ఉన్నారు. వీరితో పాటు ఒక లక్షా 82 వేల కుటుంబాలు మాన్యువల్‌ స్కావెం జర్స్‌గా పనిచేస్తున్నట్టు, ఇటీవలి సర్వేలో వెల్లడైంది. అంటే దాదాపు 70 లక్షలకుపైగా పారిశుద్ధ్య కార్మికులు సమాజాన్ని శుద్ధిచేసే కార్య క్రమంలో ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. సమాజంగానీ, ప్రభుత్వాలు గానీ, వీరిని అంతగా పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈ పని చేస్తున్న మనుషులకు విలువ లేదు. ఆ పనికి ఎటువంటి ప్రా«ధా న్యతా లేదు. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళల్లో ప్రతిఏటా వందల మంది చనిపోతున్నా, ఆ లెక్కలేవీ ఎవరికీ పట్టవు. మనం ఇండ్లల్లో ‘స్టే హోం–స్టే సేఫ్‌’ అంటూ విశ్రమిస్తోంటే కరోనాను మన ఇంట్లోకి రాకుండా చూస్తున్నది ఏగౌర వమూలేని ఈ పారిశుద్ధ్య కార్మి కులే. ఈ సమాజం అనునిత్యం వెలి వేస్తున్నా, తరతరాలుగా ఈ సమాజం మురికిని కడిగిపారేస్తోంది మాత్రం వాళ్ళే. 

 మన దేశంలో తప్ప ఇతర ఏ దేశాల్లోనైనా ఇటువంటి పనిచేస్తున్న కార్మికులకు సమాజంలో సమాన గౌరవం ఉంటుంది. అదే మన సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా సమాజ క్షేమం కోసం, అభివృద్ధి కోసం, స్వచ్ఛత కోసం పని చేస్తోన్న వీరిని ఈ కుల సమాజం శతృవులుగానే పరిగణిస్తున్నది. ఈ కరోనా సమయంలోనూ సుప్రీం కోర్టు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చింది. దీన్ని సమాజం ప్రతిస్పందనగానే భావించాల్సి ఉంటుంది. గనుల్లో, రైల్వేల్లో, ఇతర ప్రమాదకర పనిస్థలాల్లో పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన వీళ్లకు ఇప్పటికీ ఈ దేశ సంపదలో తగిన వాటా లభించ లేదు. బీడు భూముల్ని సాగు భూములుగా మార్చి కోట్లాది ఎకరాల్లో భూమిని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేసిన దళితులకు జానెడు భూమి లేదు. పశువులు చనిపోతే ఊరు పవిత్రతకోసం, స్వచ్ఛత కోసం తమ ఆరోగ్యాన్నీ, ప్రాణాలనూ ఫణంగా పెడుతోన్న  దళితులు ఇంకా ఊరికి ఆవలే బతుకులీడుస్తు న్నారు. మనుషులు చనిపోతే అక్కడా వీళ్ళే, తరతరాలుగా ఇన్ని రకాల పనుల్లో తమ జీవితా లను సమిధలుగా చేసిన దళితులపై ఎందుకంత విద్వేషం అనేది శతాబ్దాలుగా సమాధానం లేని శేష ప్రశ్న. 

కరోనాను ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలబడి ప్రాణా లకు తెగించి పోరాడుతున్నది డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. సహజంగానే వైద్య సిబ్బందీ, పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులకు, జీతాలు కూడా కొంత మెరుగ్గానే ఉన్నాయి. కానీ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలకు ఏ గ్యారంటీ లేదు. అవి పర్మినెం ట్‌కాదు. కాంట్రాక్టు కార్మికులనో, ఔట్‌ సోర్సింగ్‌ అనో, ఇంకేపేరుతోనో పిలిచినా అవి ఎప్పుడు కాదనుకుంటే అప్పుడు తొల గించే అవకాశమున్న, ఏ ఉద్యోగ భద్రతా, ఏ సామాజిక రక్షణా లేని అతి చవకైన ఉద్యోగాలు. జీతాలు పదివేలకు మించవు. నాలుగు అయిదు వేలు వచ్చేవాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఈ ప్రపంచ మంతా కరోనాతో స్థంభించిపోయినప్పుడూ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. పక్కవాడి గాలిసోకితేనే భయంతో వణికిపోతోన్న తరు ణంలో మనమంతా వాడిపారేసిన చెత్తను చేతులతో ఎత్తిపోస్తున్నారు.  కరో నాను సమాజం నుంచి తరిమికొడుతున్నారు. ఈ సమాజం మాత్రం వారిని శతాబ్దాలుగా తరిమి కొట్టడం మానలేదు.

ఇదే రకమైన వెలివేత వైఖరిని ప్రభుత్వాలు కూడా అనుసరిస్తు న్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఇతర అవసరాలకోసం కేంద్ర ప్రభుత్వం 21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కానీ అందులో అత్యంత దయనీయమైన జీవితాలను గడుపుతున్న పారిశుద్ధ్య కార్మి కుల ఊసేలేదు. అందులో తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికీ వేతనంతో అదనంగా 8,500 రూపాయలు అందజేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చొరవను మనమంతా అభినందిం చాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అటువంటి ఆలోచన చేయక పోవడం విచారకరం. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం దళితులు, ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నదనే విమర్శను ఈ చర్య బలపరుస్తున్నది. పారిశుద్ధ్య కార్మికులు, గార్బెజ్‌ కలెక్టర్లు, మాన్యువల్‌ స్కావెంజర్లందరికీ కరోనా విపత్తు కొనసాగినంత కాలం ప్రతి వ్యక్తికీ ప్రతి నెలా 20,000 రూపాయల చొప్పున చెల్లించాలనే డిమాండ్‌ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు, దళిత, ఆదివాసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. చాలా చోట్ల గ్లౌజులు, మాస్క్‌లు, పీపీఈ కిట్లు లేకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. దీంతో ఢిల్లీ, పూనా, ఇతర చోట్ల పదిమందికి పైగా కరోనా బారిన పడి మరణించారు.  వీరికి ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించాలి.

పారిశుద్ధ్య కార్మికులకు అదనపు రెమ్యూనరేషన్‌ను వెంటనే ప్రకటించాలనే డిమాండ్‌ను కేంద్రం పరిష్కరించాలి. కరోనా సమ యంలో ఈ కుటుంబాలు మరింత పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇచ్చే బోనస్‌ వల్ల వాళ్ళకు కొంత ఉపశమనం. నిజానికి వీళ్లు ఆరోగ్యంగా పనిచేయగలిగితేనే కరోనాను అరికట్టగలం. వీరి అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. సమాజంలోని సంఘాలు, సంస్థలు, వ్యక్తులు మానవతా దృక్పథంతో వీరి పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సి ఉంది. చెత్త ఎత్తే వారికి ఇంతకంటే విలువక్కర్లేదనుకుంటే మాత్రం కోవిడ్‌ లాంటి ఉపద్రవాలనుంచి కాపాడే వారు భవిష్యత్‌లో మనకు కనుచూపుమేరలో కనిపించరు. మనల్ని రక్షించే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నది కరోనా సాక్షిగా రుజువైన సత్యం.

వ్యాసకర్త :మల్లెపల్లి లక్ష్మయ్య,  సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top