‘దళిత్‌’ రణనినాదంపై ఆంక్షలా?

Mallepally Laxmaiah Article Over Dalit Word Dispute - Sakshi

కొత్త కోణం

ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్‌’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటువంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్‌ చర్య తప్ప మరొకటి కాదు. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి.

నీ విశాలాకాశంలోని సూర్యచంద్రులని నాకి మ్మని అడగలేదు/ విస్తరిం చిన నీ ఆస్తులూ, నీ భూములూ నేనడగనేలేదు/ నీవు కట్టుకున్న విలాసవంతమైన భవనాలూ, ఆకాశ హార్మ్యాలూ నాకక్కర్లేదు/ నీ ఉత్సవాలనూ, పండుగ లనూ, నీ దేవుళ్ళని కూడా నేనేనాడూ ఆశించలేదు/ నీ కులాలూ, నీ జాతులూ నాకక్కర్లేదు సుమా!/ కనీసం నీ తల్లులూ, నీ చెల్లెళ్ళూ, నీ కూతుళ్ళనీ కన్నెత్తిసైతం చూడలేదు/నేనడిగిందొక్కటే.. నేను కోరుకున్నదీ అదొ క్కటే నా హక్కులు../అదే నన్ను నన్నుగా, ఒక మని షిగా చూసే నా జన్మహక్కునే నేనడుగుతున్నాను...

మరాఠీ దళిత కవుల సంకలనం ‘పాయిజన్‌ బ్రెడ్‌’ లోని పంక్తులివి. దళిత పాంథర్స్‌ ఉద్యమ చైతన్య స్ఫూర్తి ఆధిపత్యంపై గురిపెట్టిన అక్షరశూలాలివి. సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట శతాబ్దాల అణచి వేతపై ధిక్కారాన్ని ప్రకటించిన ఒకే ఒక్క పదం ‘దళిత్‌’. కాలిధూళికన్నా హీనంగా చూడబడ్డ ఓ సమూహాన్ని సమీకరించి పెనుఉప్పెనై ఎగిసిపడేలా చేసిందీ ఆ పదమే. 1972లో ముంబాయిలో కొందరు దళిత యువకులు సంయుక్తంగా ‘దళిత్‌ పాంథర్స్‌’ అనే ఒక సంస్థను ఏర్పర్చుకున్నారు. ఆ తదుపరి సంవత్సరం 1973 ఆగస్టు 15వ తేదీన దాదాపు 200 మందికి పైగా యువకులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన ప్రకటన చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 26 ఏళ్ళ తరువాత బూటకపు స్వాతంత్య్రం తమకు ఒరగబెట్టిందేమీలేదని భారత వినీలాకాశంలో నల్లజెండాలు ఎగురవేసారు. అనంతరం ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమం మహారాష్ట్ర మొత్తం విస్తరించింది. ఎందరో దళిత కవులనూ, రచయిత లనూ సృష్టించింది. ఆ తరువాత అంటరాని కులాల సమీకరణకూ, సంఘటిత పోరాటానికీ ‘దళిత్‌’ అనే పదం ఓ ప్రతిఘటనా సంకేతంగా మారింది. అనం తర కాలంలో ఆ పదమే సమానత్వ శక్తిగా అవతరిం చింది. దేశవ్యాప్తంగా ‘దళిత్‌ పాంథర్స్‌’ సంస్థ కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. వేయికిపైగా కులా లుగా విభజనకు గురైన అంటరాని వారిని ఏకం చేసింది. దేశం నలుమూలల నుంచి ఎవరు ఎక్కడ కలిసినా అంటరాని కులాల గుర్తింపు దళిత్‌ అనే మూడక్షరాల్లో సంపూర్ణంగా ఒదిగిపోయింది.

మొట్టమొదటిగా దళిత్‌ అనే పదాన్ని వివక్షల నేపథ్యంలో జ్యోతీబా ఫూలే ఉపయోగించినట్టు పరి శోధకులు చెప్తున్నారు. కానీ సంఘం నిర్మాణానికి ఈ పేరును మొట్టమొదట వాడిన స్థలం హైదరాబాద్‌ కావడం విశేషం. 1947 జూలై 20 వతేదీన ‘దళిత్‌ జాతీయ సంఘ్‌’ పేరుతో ఒక సంఘాన్ని హైదరా బాద్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు విడివడి ఉన్న ‘ఆదిహిందూ ఇండిపెండెంట్‌ లీగ్‌’, ‘అరుంధ తీయ మహాసభ’, ‘డిప్రెస్డ్‌ క్లాసెస్‌ కాంగ్రెస్‌’, ‘ఇండి పెండెంట్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌’, ‘హరిజన్‌ అసోసియేషన్‌’లు కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల ప్రతినిధులందరూ హైదరాబాద్‌ స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ ఇంట్లో సమావేశమై హైదరాబాద్‌ దళిత నాయకుడు అరిగె రామస్వామి కన్వీనర్‌గా 15 మందితో ఒక కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ సంఘం ఏర్పాటు ఆనాటి అంటరాని కులాల సంఘ టితత్వానికి ఒక చిరునామాగా మారింది.

సరిగ్గా ఇదేరకమైన ఐక్యత మహారాష్ట్రలోని దళిత యువకులకు అవసరమైంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణానంతరం ఏర్పడిన ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ దళితుల పక్షాన నిలబడి పోరాటం చేయకపోవడం మాత్రమే కాకుండా అస్తి త్వాన్ని సైతం కోల్పోయి  ముక్కలు చెక్కలై దళితుల్లో నిరాశానిస్పృహలను నింపింది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటరాని కులాలను నిర్ల క్ష్యం చేయడంతోపాటు ఇటీవలి కాలంలో దళితులపై  గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతున్న దాడులను ఏమాత్రం అరికట్టలేకపోయింది. దీంతో మరొక ఉద్యమ అవసరాన్ని దళిత యువతరం గుర్తించింది.

ఒకవైపు దేశంలోని దళితుల జీవన పరిస్థితులు ఈ సంఘం ఆవిర్భావానికి ఒక కారణం అయితే, 1960 ప్రాంతంలో అమెరికాలో పెల్లుబికిన పౌరహక్కుల ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ‘బ్లాక్‌ పాంథర్స్‌ పార్టీ’ ఇక్కడి ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమానికి తక్షణ ప్రేర ణగా నిలిచింది. ఒకరకంగా మహారాష్ట్రలోని ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమ తరహాలోనే అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో దళితుల్లో నిరసనజ్వాలలు పెల్లుబి కాయి. దేశంలో కూడా ఆనాడు వివిధ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఈ ఉద్య మానికి ఆనాటి దళితుల్లో, ఆదివాసీల్లో ఉన్న అసం తృప్తే ప్రధాన కారణం. అదే కాలంలో 1960, 70 దశకాల్లో వచ్చిన మహత్తర ఉద్యమాల్లో ‘దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం’ కూడా దళితుల చైతన్యస్థా యిలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది. 

గత కొంతకాలంగా ‘దళిత్‌’ అనే పదంమీద నిషేధం విధించడానికి కొంతమంది కారణాలను వెతుకుతున్నారు. ఇటీవల నాగ్‌పూర్‌ హైకోర్ట్‌ బెంచ్‌లో ఒక దళితుడి చేతనే ‘దళిత్‌’ అనే పదాన్ని వాడుకలో నుంచి తీసివేయాలంటూ పిటిషన్‌ వేయిం చారు. అంతటితో ఆగకుండా ‘దళిత్‌’ అనే పదాన్ని ప్రసార మాధ్యమాల్లో వాడకూడదనే ఉచిత సల హాను కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆదే శాల రూపంలో జారీ చేసింది. ఇది యాదృచ్ఛికమైన చర్యకాదు. ఈ పదానికున్న శక్తిని నిరోధించే లక్ష్యంతో కావాలనే దీని వాడకాన్ని అడ్డుకునే కుట్ర చేసారు. 

దేశంలోకి బ్రిటిష్‌ వారు రాకముందు ప్రజ లంతా కులాల పేరుతోనే ఉనికిలో ఉన్నారు. అంట రాని కులాలు కూడా వందల సంఖ్యలో విభజనకు గురై వివిధ పేర్లతో వాడుకలో ఉన్నాయి. 1911 జనాభా లెక్కల్లో ‘డిప్రెస్డ్‌ క్లాసెస్‌’గా తొలిసారిగా ఒకచోటికి చేర్చారు. ఆ తరువాత 1935 భారత చట్టం ఏర్పడిన తరువాత వాటిని ‘షెడ్యూల్డ్‌ కాస్ట్‌’గా మార్చారు. ఇప్పటికీ అదే పేరు రాజ్యాంగంలోనూ, ఇతర అధికారిక కార్యకలాపాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడే ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు గాంధీ కూడా అంటరాని కులాలకు ఒక పేరు పెట్టారు. అదే ‘హరిజన్‌’. ఆ పేరుని అంబేడ్కర్‌తో సహా అనేక మంది వ్యతిరేకించారు.

1970 తరువాత వచ్చిన దళిత చైతన్యం ఆ పేరును అధికార కార్య కలాపాల్లో వాడకూడదని డిమాండ్‌ చేసింది. దానితో ప్రభుత్వాలు తలొగ్గి హరిజన్‌ అనే పేరుని తొలగిస్తూ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇంతటితో హరిజన్‌ పద వాడకం చట్ట విరుద్ధంగా మారింది. ‘హరిజన్‌’ అంటే అవ్వ అయ్య లేని బిడ్డ అని అర్థం. తల్లి దండ్రులు లేకుండా దేవుడికి పుట్టినవాడని అర్థం. ఈ హరిజన్‌ అనే పేరుని అంటరాని కులాల వారికి ఇత రులు పెట్టారు. కానీ ‘దళిత్‌’ అనే పదం తమకు తాముగా, తమ ఆత్మగౌరవ పతాకగా, తమ అస్తి త్వానికి సంకేతంగా, తిరుగుబాటు నినాదంగా దళి తులు పెట్టుకున్నారు. 

భారత స్వాతంత్రోద్యమంలో ‘షాహీద్‌’ భగత్‌ సింగ్‌ ఇచ్చిన ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదం లాగా ‘దళిత్‌’ అనే పదానికి వీరంతా భయకంపితు లవుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. దళితో ద్యమ ఉప్పెనలో తమ ఉనికి ఎక్కడ కొట్టుకుపో తుందోనని బెంబేలెత్తి పోతున్నారు. అందువల్లనే ‘దళిత్‌’ అనే పదాన్ని ముందుగా అధికారిక కార్యకలా పాల్లో ఆ తర్వాత ప్రసార మాధ్యమాల్లో వాడకూడ దని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అప్ర జాస్వామికం. ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్‌’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవ రైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటు వంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్‌ చర్య తప్ప మరొకటి కాదు. 

నిజానికి ‘దళిత్‌’ అనే పదం 1241 అంటరాని కులాలను ఒక్కతాటిపైకి తెచ్చిన బలీయమైన ఐక్య నినాదం. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం ఆ శక్తి ప్రభుత్వానికీ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. కేరళ నుంచి కాశ్మీర్‌ వరకు మణిపూర్‌ నుంచి గుజరాత్‌ వరకు అంటరాని కులా లను సమైక్యపరిచే అంతులేని శక్తి కేవలం ఆ ఒక్క దళిత పదానికే ఉంది. ఇటీవల ఎస్సీ ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశా లకు వ్యతిరేకంగా అంటరాని కులాలన్నింటినీ ఐక్యం చేసింది కేవలం దళిత పదమే. ఈ ఐక్యతాశక్తి దేశం లోని మరే సామాజిక వర్గానికీ లేదు. అందువల్ల ఈ ఐక్యతా నినాదాన్ని దెబ్బగొట్టే ప్రయత్నంలో భాగం గానే ‘దళిత్‌’ అనే పదంపై ప్రత్యక్ష, పరోక్ష నిషేధా లను విధిస్తున్నారు.

అయితే, ఈ నిషేధాలకు దళిత శక్తి తలొగ్గే అవకాశం లేదు. దళితులు నడచివచ్చిన గత చరిత్రంతా రక్తసిక్తమే. ఎన్నో దాడులు, దమన కాండలు, అన్యాయాలూ, అణచివేతలూ అమానుషా లకు తిరుగుబాటుగా, ప్రతిఘటనగా వచ్చిందే దళిత నినాదం. భారతదేశంలోని వివక్షనూ, అణచివేతనూ, ఇలాంటివే కుట్రలనూ తూర్పారబట్టి, ఆధిపత్య భావ జాలాన్ని జల్లెడ బట్టి ఒక విముక్తి సిద్ధాంతాన్ని అంబే డ్కర్‌ దళితులకు అందించాడు. అందుకే దళితులు ఒంటరి కాదు. దళితులకు అందివచ్చిన పోరాట పతాకం జైభీం. అంబేడ్కర్‌ పేరుతో మారుమోగే ఈ నినాదం దేశంలోని దళితులందరినీ ఒక్కటి చేసింది. దళిత అస్తిత్వం, అంబేడ్కర్‌ తాత్విక సిద్ధాంతం, జైభీం నినాదం కోటానుకోట్ల దళిత ప్రజల హృద యాలనుంచి వేరు చేయడం అసాధ్యం అన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు

మొబైల్‌ : 97055 66213  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top