చారిత్రక విభాతసంధ్యల వైపు...

Mallampalli somashekara sherma try hard to find Telugu history - Sakshi

రెండో మాట
అపభ్రంశాల మూలంగా, కుల, మత వైరుధ్యాల ఫలితంగా తెలుగువారి చరిత్ర రచనకు కూడా న్యాయం జరిగి ఉంటుందని విశ్వసించలేం. చదువుకు మెట్రిక్యులేషన్‌ ‘గ్రాడ్యుయేట్‌’ అయిన మల్లంపల్లి సోమశేఖరశర్మ ‘కాళ్లకు బలపాలు’ కట్టుకుని ‘తెలుగునాటి పూర్వ చరిత్ర కాణాచి యెల్ల తవ్వి తలకెత్తిన’ మహనీయుడు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు విస్తృతి కల్పించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగువారి చరిత్రకు సంస్కృతికి పనికివచ్చే అసలు సిసలు సాధనాలేవో ఆరు దశాబ్దాల నాడే చెప్పారు.

‘భారతదేశ పురా చరిత్ర ఈనాటిది కాదు. అది క్రీస్తుపూర్వం 5000 నుంచి, క్రీస్తుశకం 500 ఏళ్ల దాకా అనలు తొడిగి కొనలు సాగి కొనసాగుతున్న చరిత్ర. ఆ మాటకొస్తే తెలుగువారి రెండు ప్రాంతాలు కలిపిన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ పురా చారిత్రక యావద్భారతవానికే రాజధాని’ – హెచ్‌.డి. సంకాలియా (భారత పురావస్తు శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు)

‘ఈ చోట తొలినాడు ప్రాచీ సతి ముఖాబ్జమున/ ఎఱ్ఱ కుంకుమబొట్టు దిద్ది/ ఈ పవిత్ర ధరిత్రనోపి త్రైలింగ రాజ్యశ్రీ సుధా ప్రవర్షంబు కురిసె/ ఇచ్చట మంటిగడ్డలు సైతమ్ము/ నవమృగీవాసనలు విదర్చె.....’
– విశ్వనాథ

ఇంతవరకూ విశ్వసిస్తున్నట్టు తెలుగువారి చరిత్ర క్రీస్తుపూర్వం 3000, ఆ పైచిలుకు బౌద్ధయుగానికే పరిమితం కాలేదు. తెలుగు(ఆంధ్ర)జాతికి అంతకు మించిన చరిత్రే ఉందని ఆచార్య సంకాలియా పేర్కొనడం విశేషం. తొలి మానవుడి ఆవిర్భావం ఆఫ్రికా ఖండం మీదే జరిగిందని భావిస్తున్న సమయమిది. ప్రాచ్య ఖండంలో అంతర్భాగమైన భారతదేశంలో ఈ మూలన ఉన్న తెలుగు తెగల భూమి ఆదిలాబాద్‌ ప్రాంతం (తెలంగాణ) తొలి మానవుడి జన్మస్థలిగా సంకాలియా భావించారు. చరిత్రలో తొలి మానవుడి జన్మస్థలం కడప జిల్లాయేనని మెకంజీ, మన్రో సిద్ధాంతీకరించారు.

రాజకీయులు రెండుగా చీల్చినందుకు తెలుగుజాతి ఆవేదనలో ఉన్న మాట నిజమే. అందుకే అలాంటి సంకుచిత విభేదాలులేని పురాతత్వ పరిశోధకుల, చరిత్రకారుల దృష్టి వైశాల్యం ఓ అద్భుత అంశంగానే దర్శనమిస్తుంది. సుప్రసిద్ధ చరిత్రకారుడు బుర్ఖార్డ్, ‘గతించిన యుగాల చరిత్ర వెలుగులోనే వర్తమాన చరిత్రను ఆవిష్కరించుకోగలం. గతించిన సమాజాల ప్రారంభ వికాసాలనూ, పతన దశలనూ అర్థం చేసుకొని మానవుడు వర్తమాన సమాజాన్ని తీర్చి దిద్దుకోగలుగుతాడు. ఇదే చరిత్ర కార్యాచరణ విధి’ (జడ్జిమెంట్స్‌ ఆన్‌ హిస్టరీ అండ్‌ హిస్టోరియన్స్‌) అని వాఖ్యానించడంలోని అంతరార్థం ఇదే కావచ్చు. ఇదే చరిత్రతత్వంతో, సంకాలియా, దామోదర ధర్మానంద కొశాంబి, మల్లంపల్లి, పరబ్రహ్మశాస్త్రి వంటి పరిశోధక శిఖామణులు చూపిన బాటలో వెలువడినవే ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర–సంస్కృతి’ని వివరించే తొమ్మిది సంపుటాలు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ చరిత్ర అధ్యాపకులు, చరిత్రకారుల సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం సహకారంతో, ఎమెస్కో చేయూతతో ఈ బృహత్‌ సంపుటాలను తెలుగువారికి అందించారు. ప్రతి సంపుటానికి నిపుణుడైన ఒక చరిత్రకారుడు సంపాదక బాధ్యతలు నెరపినప్పటికీ, మొత్తం సంపుటాల రచనలో ప్రధాన సంపాదకుని బాధ్యతనూ, రచనా సంఘం కృషిని సమన్వయం చేసే పనినీ ఆచార్య వకుళాభరణం రామకృష్ణ అవిశ్రాంతంగా నిర్వహించారు. 

ఇదొక చరిత్రాత్మక యజ్ఞం
తెలుగుజాతి వైభవోన్నతులకూ, విభిన్న పాలనా వ్యవస్థల కింద వారు అనుభవించిన కష్టసుఖాలకూ ఈ సంపుటాలన్నీ అద్దంపడతాయి. పురాతన ఆంధ్రప్రదేశ్‌ (క్రీ.పూ. 500–క్రీ.శ. 624) చరిత్ర సంస్కృతి నుంచి; మధ్య యుగాలు, అనంతర యుగాలలో తెలుగువారి సంస్కృతీ విశేషాలను, తదుపరి కాలంలో ఆధునిక హైదరాబాద్, కంపెనీ పాలనలో తొలిదశలను విఫులంగా ప్రస్తావించారు. ఇంకా, అత్యాధునిక చారిత్రక, సాంస్కృతిక దశలను కూడా వివేచనాత్మకంగా, అకుంఠిత దీక్షతో అందించారు. వేల ఏళ్ల తెలుగువారి చరిత్రను దాదాపు రెండు దశాబ్దాల పాటు, 200 మందికి పైగా నిష్ణాతులు, పండితులు, రచయితలు అందించిన రచనలతో ఈ సంపుటాలను సమున్నతంగా వెలువరించారు. కాగా, ఇందులో తొలి ఎనిమిది చరిత్ర, సంస్కృతులను విశ్లేషిస్తాయి. వీటన్నిటికి ప్రామాణికతను చేకూర్చే ఆధారాలు, రికార్డులు, పత్రాలు, పరామర్శ గ్రంథాలు వంటి సమాచారం అందించేదే చివరి 9వ గ్రంథం (క్రీ.పూ. 5000–క్రీ.శ. 2016).

దేశంలో లభిస్తున్న ఆధారాలే కాకుండా, తెలుగుల చరిత్ర–సంస్కృతులకు సంబంధించి విదేశీయుల, పురావస్తు శాస్త్రవేత్తల పరిశీలనలలో లభిస్తున్న ప్రస్తావనలు కూడా చివరి సంపుటంలో పొందుపరిచారు. అంటే ఈ మహా చారిత్రక పరిశోధనకు, ఈ పరిశోధనను ఆవిష్కరించిన ఈ సంపుటాలకు మూలం రాతి పలకలలో, రాగి రేకులలో, నాణేలలో నిక్షిప్తమైన సమాచారమే. చరిత్రకు అందని కాలం నుంచి కొత్తగూడెంలో లభించిన కెంపుల వంటి ఎరుపురంగు రాళ్లను ఆభరణాలలో పొదిగి రెండువేల ఏళ్ల నాడే రోమ్, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని నవరత్నాల పరిశోధనలకు చెందిన భూగర్భశాస్త్రవేత్తల బృందం ఈ నెల 14న వెల్లడించింది. గరీబ్‌పేట రత్నాలను తమిళనాడులోని అరికమేడ వద్ద శుద్ధి చేసి ఎగుమతి చేసేవారనీ, ఈ పని క్రీ.శ. 1–7 శతాబ్దాలలో సాగేదనీ పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. అందుకే ‘చరిత్ర అంటే ఏమిటి?’ అన్న తన గ్రంథంలో, ‘చారిత్రక పత్రాలలో, శాసనాలలో, చెక్కిన శిలల్లో వాస్తవాలు లభ్యమవుతాయి– చేపలని వలేసి పట్టి అమ్మే జాలరి వలెనే చరిత్రకారుడికి కూడా చారిత్రక సత్యాలు దొరికిపోతాయి. కనుకనే చరిత్రకారుడు చేతికందిన శాసనాధారాలను, నాణేలను సేకరించుకుని ఇంటికి తీసుకుపోతాడు. అక్కడ వాటి ఆధారంగా చరిత్రను వండి వార్చి తనకు నచ్చిన పద్ధతిలో నలుగురికీ అందిస్తాడు’ అని ఇంగ్లండ్‌కు చెందిన ఈహెచ్‌ కార్‌ అనే చరిత్రకారుడు అన్నారు.

ఏది యథార్థం? ఏది కల్పన?
కానీ, పరిశోధనల ఫలితంగా వెలువడే వాస్తవాధారాలకూ, జనబాహుళ్యంలో ఉండే గాథలకూ అసలు సంబంధం లేకపోవడం కూడా కద్దు. అలాగే సాహిత్యాధారాలు కూడా. అందుకే వైరుధ్యాల జాబితా పెరిగి ఏది నిజమో, ఏది కల్పనో తెలుసుకోలేనంత అంతరం ఏర్పడిందని కొశాంబి అభిప్రాయపడవలసి వచ్చింది. రామాయణ, మహాభారతాలలోని తొల్లింటి శ్లోకాల సంఖ్యను పెంచేసిన ‘మహానుభావుల’ మూలంగా చరిత్రకూ, కల్పిత గాథలకూ మధ్య పొత్తూ పొంతనా లేకుండా పోయాయని, మహా యుద్ధాలుగా జరిగినవని చెప్పే ఘటనల స్థలకాలాలకు, జరిగిన వాస్తవాలకు సమన్వయం కుదరని కొన్ని ఉదాహరణలను డాక్టర్‌ కొశాంబి తన విశిష్ట గ్రంథం ‘ఇండియన్‌ హిస్టరీ’లో (1956) పేర్కొన్నారు. గదా యుద్ధాల్లాంటి కథా యుద్ధాలతో ఏది కల్పితమో, ఏది కాదో నిర్ణయించలేని దుస్థితిలోకి పాఠకుల్ని నెట్టారు. విక్రమాదిత్యుడి పట్టాభిషేకం క్రీ.పూ. 57లోనా మరెప్పుడు జరిగిందో నిర్ధారించలేని తగాదా గురించిన శషబిషలు శతాబ్దాలు గడచినా ‘విక్రమ శకా’నికి సక్రమ రూపం రానేలేదు. కశ్మీర మహా పండితుడు కల్హణుడు చారిత్రిక సత్యాలతో కూర్చిన ‘రాజతరంగిణి’(సంస్కృత కావ్యం; 1149–50) సారాన్ని కూడా ‘చెయ్యాడింపు’తో ఎవరో ద్వంద్వార్థాలతో కలగాపులగం చేసి, అసలు కల్హ ణుడు చెప్పదలచుకున్న వాస్తవాలకు కూడా మసిపూసి మారేడుకాయగా మార్చారని కొశాంబి విమర్శించారు. అలా, ముస్లిం పాలనాకాలం వచ్చేదాకా కల్హణుడు రాసిన పాత చరిత్రను కూడా కొందరు హిందూ పండితులు మిగల్చక పోయారని ఆయన ఆరోపణ.

ఇలాంటి అపభ్రంశాల మూలంగా, కుల, మత వైరుధ్యాల ఫలితంగా తెలుగువారి చరిత్ర రచనకు కూడా న్యాయం జరిగి ఉంటుందని విశ్వసించలేం. చదువుకు మెట్రిక్యులేషన్‌ ‘గ్రాడ్యుయేట్‌’ అయిన మల్లంపల్లి సోమశేఖరశర్మ ‘కాళ్లకు బలపాలు’ కట్టుకుని ‘తెలుగునాటి పూర్వ చరిత్ర కాణాచి యెల్ల తవ్వి తలకెత్తిన’ మహనీయుడు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు విస్తృతి కల్పించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగువారి చరిత్రకు సంస్కృతికి పనికివచ్చే అసలు సిసలు సాధనాలేవో ఆరు దశాబ్దాల నాడే ఇలా చెప్పారు. ‘రాజుల, రాజ్యాల చరిత్ర రాయడం అంత కష్టం కాదు. కానీ సాంఘిక చరిత్ర రాయడమే కష్టం. దీనికి దారాలు తక్కువ. తెనుగు సారస్వతం, శాసనాలు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీయులు వచ్చి చూసి రాసిన చరిత్రలు. శిల్పాలు, చిత్తరువులు, నాణేలు, సామెతలు, దానపత్రాలు, సుద్దులు, పూర్వ వస్తు సంచయాలు– ఇవి చరిత్రకు పనికివచ్చే సాధనాలు’. 

ఈ దృక్పథానికి దగ్గరగా వచ్చే సమకాలీన చరిత్రకారుడైన డి.డి. కొశాంబి సింధు నదీలోయ నాగరికత ‘విత్తన కేంద్రం’గా (సీడ్‌ న్యూక్లియస్‌) ఎలా భరత ఖండం దాటి సుమేరియాను సువర్ణ కలశంగా తీర్చిదిద్దిందో చెబుతూ కల్పిత గాథలకూ, వాస్తవ పరిణామాలకు మధ్య ఎంతగా పూడ్చరాని అఖాతం ఉంటుందో ఇలా వివరించాడు: ‘మసిపూసి మారేడుకాయ చేసే కల్పితగాథలోని సారాన్ని పిండ చూడడం వృధా ప్రయాస, తద్వారా అందులోంచి చారిత్రక సమాచారాన్ని సరాసరి పొందడం అరుదైన ఘటన. ఫలి తంగా భారత చారిత్రిక మహనీయులు, మహాఘట్టాలూ కల్పితగాథా స్రవంతిలో దురదృష్టవశాత్తూ కనుమరుగైపోతారు. అలా కాలం గడచిన కొలదీ వాస్తవ దూరమైన ఈ కల్పిత గాథలే జనాల మధ్య నిజాలుగా చెలామణీలో ఉంటుంటాయి’.వెలుగుదివ్వెలు
నిజానికి పొరుగువాడి కల్పిత గాథలకు చెవియొగ్గి, తన జాతి చరిత్రకు, భాషకు చేటు తెచ్చుకుని, ఎదురొడ్డి నిలబడలేక ‘ఇది మా భాష’ కాదన్న కొందరు తెలుగువాళ్లు మద్రాసు హైకోర్టు దాకా ఎగబడి తెలుగు ప్రాచీన చరిత్రను, సంస్కృతినీ న్యూనతపరిచిన పొరుగువాడితో చేతులు కలిపిన పరిణామాన్ని ‘గతమని’ సరిపెట్టుకోవాలి. ఈ ఆంధ్రజాతికి అక్షరజ్ఞానమే తెలియదన్న పుండాకోరులకు గోదావరి నీళ్లను యావద్భారతమూ ఆబతో పుక్కిటపట్టి ఆనందించిన రోజులు పరగడుపైపోయాయి. శిల్పకళకు తొలి పూజలందించినాడు, విమల కృష్ణానదీ ఇసుక తిన్నెలలో కోకిలపు పాట పిచ్చుకగూళ్లు కట్టుకుని వెన్నెలరాత్రులలో నేర్చుకున్న తెలుగుజాతి అక్షర జ్ఞానమెరుగదన్న మాట పొరుగువాడి ఏడుపు పాట. వేల సంవత్సరాల భాషా సంస్కృతులతో తులతూగిన అలాంటి తెలుగు భాషీయుల సమగ్ర చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని తెలుసుకోగోరే వారందరికీ అలాంటి అధ్యయన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ కల్పిస్తోంది. పండిత రాళ్లపల్లి అన్నట్లు ‘‘తెలిసికొన మాకు బతుకులో తీరికేది? మరిచిపోయిన జ్ఞాపించు మార్గమేది?’’ అని వాపోయే వారికి తీరికను, మార్గాన్నీ చూపించే తెలుగు వెలుగు దివ్వెలే ఈ సంపుటాలు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top