ఆదివాసీ యోధుడు కొమురం భీం

Komaram Bheem 70th Death Anniversary Special Story - Sakshi

నేడు కొమురం భీమ్‌ 70వ వర్థంతి  

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్‌ మండలం జోడేఘాడ్‌ సంకెనపల్లి గ్రామంలో 1900లో కొమురం భీం జన్మించినాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే అతని తండ్రిని అటవీ అధికారులు చంపివేశారు. భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని ‘‘సిద్దిభి’’ అనే జాగిర్దార్‌ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. ఎక్కడికి పారిపోయి బ్రతకాలి ఎందుకు భయపడాలి. ప్రళయ ఘర్జనలో భీంలో ధిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలౖపై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడే చనిపోయాడు.  పోలీసులు భీంనీ వేటాడారు.

దీంతో అస్సాంలో ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు. బాభి ఝారి చుట్టు పక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదాన్ని అబ్దుల్‌ సత్తార్‌ అనే తాలుక్‌ దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ నుంచి సుర్దాపూర్‌కి తిరిగి వచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం ‘జల్‌ జంగల్‌ జమీన్‌’ తమదే అంటూ గర్జించాడు. స్వయం పాలన 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్‌ కలెక్టర్‌తో చర్చలు జరి పాడు. పరిష్కారం దొరకలేదు. దీంతో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్‌ వెళ్ళాడు కానీ నిజాం నుంచి అనుమతి దొరకలేదు ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకున్నాడు.

దట్టమైన అడవుల్లో ఉన్న ‘జోడే ఘాట్‌’ గుట్టల్లో గెరిల్లా అర్మీని తయారు చేశాడు. భీంతో చర్చలు జరిపినప్పటికీ ఫలించకపోవడంతో  భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్‌ భావించింది. భీం దగ్గర హవల్దార్‌గా పనిచేసే కుర్దు పటేల్‌ని లోబరుచుకుని భీం స్థావరాన్ని బ్రిటిష్‌ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. 3 రోజుల సుదీర్ఘ పోరాటంలో అలసిన భీం గెరిల్లాలపై నిజాం సైన్యం ఒకసారి గుంపుగా విరుచుకపడి కొమురం భీం గుండెల్లో బుల్లెట్‌ దింపారు. ఆదివాసీల ఆశయాల సాధనే భీంకి ఇచ్చే ఘన నివాళి. 
వ్యాసకర్త:  పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం(తెలంగాణ). 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top