సమానత్వం.. ఎక్కడ? | Indira Shobhan Guest Column On Women Gender Equality | Sakshi
Sakshi News home page

సమానత్వం.. ఎక్కడ?

Mar 8 2020 1:59 AM | Updated on Mar 8 2020 1:59 AM

Indira Shobhan Guest Column On Women Gender Equality - Sakshi

మహిళా దినోత్సవం రోజున మాత్రమే ప్రశంసల పూల జల్లు కురవడం, మిగిలిన రోజుల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగానే నిరాదరణకు గురవడం మహిళలకు అలవాటైపోయింది. మన దేశంలో మాత్రమే కాదు...ప్రపంచమంతటా ఇదే స్థితి. సమానహక్కులు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణ రూపం దాల్చటం లేదు. ప్రాచీనకాలం నుంచి ఇప్పటివరకూ సమాజం ఎదగడానికి జరిగిన, జరుగుతున్న ఉద్యమాల్లో, పోరాటాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు. అయినా మహిళల భద్రత ఇప్పటికీ డేంజర్‌ జోన్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలను అభద్రతా భావనలో ఉంచడం ప్రపంచ మనుగడకు కూడా ముప్పు కలిగిస్తుందన్న సంగతిని సమాజం గ్రహించలేకపోతోంది.

సాంకేతికత విస్తరించిన వర్తమానంలో మహిళలపై వేధిం పులు మరింత పెరిగాయి. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టడం, వారిని కేవలం భోగవస్తువుగా పరిగణించే ఫొటోలు, వీడియోలు పెట్టడం వంటివి మహిళల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తున్నాయి. అత్యాచార సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మహిళలకు భారత్‌ అత్యంత ప్రమాదకరమైన దేశమని 2018లో థామ్సన్‌ రాయిటర్స్‌ సర్వే తేల్చింది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే...’అని గొప్పగా చెప్పే దేశానికి ఇంతకన్నా అవమానకరమైనది ఉంటుందా?  పురుషాధిక్య సమాజం మహిళలకు అందం, అణకువ, పరువు, శీలం, పాతివ్రత్యం...ఇవే ఆభరణాలని నూరిపోస్తోంది. వారు ఆత్మవిశ్వాసంతో ఎదగకుండా అనేక అవరోధాలు కల్పిస్తోంది. 

తెలంగాణలో మహిళల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఈమధ్య జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయి. తొమ్మిది నెలల పసికందు శ్రీహిత హత్యాచారం ఎంత గగుర్పాటు కలిగించిందో చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. దిశ ఉదంతం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన భవిష్యత్తును కలగని, మంచి ఉద్యోగాన్ని సంపాదించి, మాటలు రాని జంతువులపై కూడా ఎంతో మమకారాన్ని ప్రదర్శించి మనిషితనానికి నిలువెత్తు రూపంగా నిలిచిన దిశపై దుండగులు అత్యంత అమానుషంగా, క్రూరంగా దాడిచేసి, ఆమెను హతమార్చిన తీరు అందరినీ కలవరపరిచింది. ఆదిలాబాద్‌ జిల్లాలో సమత హత్యాచారం కూడా ఇదే స్థాయిలో ఆందోళన కలిగించింది. నిర్భయ తర్వాత దేశవ్యాప్తంగా అందరినీ కదిలించి, నిరసనలు వెల్లువెత్తేలా చేసిన ఉదంతాలు ఇవే. ఈ అకృత్యాలన్నిటికీ మద్యమే మూలమని ప్రతిసారీ నిరూపణవుతోంది. నిర్భయ ఉదంతం జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా... దోషులకు ఉరిశిక్ష వేసినా ఇంతవరకూ అది అమలు కాలేదు.

ఆ నేరస్తులు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ఉరికంబాన్ని తప్పించుకోవడానికి నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనేవున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి సత్వరం శిక్షలు పడే ఏర్పాటు లేనంతకాలం ఆ రకమైన నేరాలు కొనసాగుతూనేవుంటాయి. మహిళల రక్షణకు వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తీసుకుంటున్న చర్యలేమిటో ప్రభుత్వాలు గమనించి వాటిని అమలు చేయడం తక్షణావసరం. ఇలాంటి నేరాలను అదుపు చేయడంతోపాటు మహిళల ఎదుగుదలకు తోడ్పడే చట్టాలపై దృష్టిపెట్టాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పించే బిల్లు ఏళ్లు గడుస్తున్నా పార్లమెంటులో పెండింగ్‌లోనేవుంది. చట్టసభల్లో మహిళల శాతాన్ని పెంచినప్పుడే వారి అభ్యున్నతికి, రక్షణకు తోడ్పడే చట్టాలు వస్తాయి. మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పే కేంద్ర ప్రభుత్వం మహిళా కోటా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, దాని ఆమోదానికి చర్యలు తీసుకోవాలి. ఈ దేశ మహిళలకు కావలసింది వట్టి మాటలు కాదు...గట్టి కార్యాచరణ. ఆ దిశగా అడుగులు పడాలి. 
ఇందిరాశోభన్,
తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement