నకిలీ ఓట్లతో ‘అసలు’కు మకిలి

GV Sudhakar Reddy Article On Voters Names Removing In AP - Sakshi

విశ్లేషణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్‌ ఓట్ల వ్యవహారం ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తోంది. అధికారంలోని పార్టీలు డూప్లికేట్‌ ఓటర్లను నమోదు చేయడం, ప్రతిపక్షాలకు అనుకూలురైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో సమస్య పరాకాష్టకు చేరింది. తమ పార్టీ అభిమానులకు చెందిన ఓట్లను పనిగట్టుకుని తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో రాష్ట్రపతి ఎదుట ఆరోపించడం సంచలనం కలిగించింది. ఓటర్‌ జాబితాను ఆధార్‌కు అనుసంధానించడం, లేకపోతే బయోమెట్రిక్‌ పద్ధతిని అమలు చేయడం ఒక పరిష్కారం. ఎన్నికల పర్యవేక్షక వ్యవస్థలో సమూల మార్పులు జరగకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం కాక తప్పదు.

బోగస్, డూప్లికేట్‌ ఓట్ల వ్యవహారం చాలాకాలంగా మన దేశంలో వివాదాలు రేపుతున్నప్పటికీ ఇటీవలి కాలంలో ఈ అంశం రాజ కీయ పార్టీలకు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ముగిసిన తెలంగాణ శాసససభ ఎన్నికల్లో దాదాపు 20 లక్షలకు పైగా ఓటర్లను ఓటింగ్‌ జాబితానుంచి తీసివేసిన విషయం నిర్ధారణ కావడమే కాకుండా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 60 లక్షల వరకు డూప్లికేట్‌ ఓట్లు నమోదయ్యాయని, ప్రతి పక్షపార్టీ వైఎస్సార్‌ సీపీ అనుకూలురకు చెందిన ఓట్లను పనిగట్టుకుని తొలగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా ఢిల్లీలో రాష్ట్రపతిని స్వయంగా కలిసి ఆరోపించడం సంచలనం కలిగించింది. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆ మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో లక్షల కొద్దీ బోగస్‌ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఆ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుదాకా తీసుకెళ్ళింది కానీ సరైన ఆధారాలు చూపించక పోవటం వల్ల కేసు నిలువలేకపోయింది. ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బోగస్‌ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు వివాదాలను రేపుతూనే ఉన్నాయి. మౌలికంగా ఓటింగ్‌ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈసీ తీరు పట్ల పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరపున డా‘‘ మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు అంశంపై ఎన్నికల కమిషన్‌ పనితీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 59.18 లక్షల డూప్లికేట్‌ ఓట్లు ఉన్నట్లు, ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకి చెందిన కామన్‌ ఓటర్లు దాదాపు 20 లక్షల వరకు ఉన్నట్లు ఓటర్‌ అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీం (వీఏఎస్‌టీ) నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ విషయంలో గట్టి పోరాటమే చేస్తున్నారు. 

గత ఎన్నికలలో కేవలం 5 లక్షల స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ అవకతవకలను సీరియస్‌గానే తీసుకుంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర గవర్నరును కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ వివిధ సర్వేల పేరిట తమ వ్యతిరేక ఓట్లను తొలగించడమే గాకుండా, బోగస్‌ ఓట్లను చేర్పిస్తోందని వీరి ఆరోపణ. ఎన్నికల సంఘం లోపభూయిష్టమైన పనితీరు కూడా ఆరోపణలకు తావిస్తోంది.

అసలెందుకిలా జరుగుతోంది?
ఎన్నికల సంఘానికి తనకంటూ ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. రాష్ట్రప్రభుత్వ వ్యవస్థనే ఉపయోగించుకోవలసిన పరిస్థితి.  బూత్‌ లెవల్‌ సమాచారం కోసం (బీఎల్‌ఓ)గా చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు లేక అంగన్‌వాడీ కార్యకర్తల వంటి వారిని నియమిస్తారు. ఈ పనికోసం ఎన్నికల సంఘం వారికి ఇచ్చే భత్యం వారి కనీస ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. అంతేగాక వారిపై రాజకీయ ఒత్తిడులు కూడా ఉంటాయి. చాలా చోట్ల అధికార పార్టీ అనుకూలురనే బీఎల్‌ఓలుగా నియమించుకుంటారు. దీంతో ఓటర్ల నమోదు విషయంలో పలు అవకతవకలకు తావిచ్చినట్లవుతుంది. 

ఇక ఎన్నికల సంఘం పరిభాషలో ఏఈఆర్‌ఓలుగా పిలిచే తహసీల్దారు ఓటర్ల బూత్‌ లెవల్‌ ఏజెంట్ల వాదనలు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలి. కానీ అంత సమయం వారికి లేదు. కాబట్టి ఇది ఆచరణలో అమలు కావడం లేదు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం 1. వారం రోజులపాటు పోలింగ్‌ బూత్‌ల వారిగా వాదనలు, అభ్యంతరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచాలి. 2. తహసీల్దారు (ఏఈఆర్‌ఓ) ఆఫీసు నోటీసు బోర్డులో వీటిని కనీసం 7 రోజుల పాటు ఉంచాలి. 3. సంబంధిత పోలింగ్‌ స్టేషను నోటీసు బోర్టులో అతికించాలి. జాబితా నుంచి తొలగించ వలసిన ఓటరుకు తగిన కారణాలు తెలుపుతూ ఓటరు అడ్రసుకు నోటీసు పంపించవలసి ఉంటుంది. మార్పులు, చేర్పుల జాబితాపై అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి వారికి అందజేసి వారి అభ్యంతరాలను పరిష్కరించాలి. 

ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం ఉపయోగించే ఏఈఆర్‌ఓ నోట్‌ను ప్రతిష్ఠాత్మకమైన పుణేకు చెందిన సి.డాట్‌ సంస్థ రూపొందించింది. కానీ ఇది అత్యంత లోపభూయిష్టమైందని వ్యాస్ట్‌ (వీఏఎస్‌టీ) సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం ముందు నిరూపించగలిగింది. ఉదా. ఓటరు ఐడి ఒకరికి ఒక్కటే ఉండాలి. కానీ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఒక ఓటర్‌ ఐడి మీద పదుల కొద్దీ ఓట్లు ఉన్నా గుర్తించలేని స్థితిలో ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌ ఉంది. పైగా తెలంగాణ ఓటరు లిస్టునందు 2017 సంవత్సరాల వయస్సు గలవారితోపాటు ఒక సంవత్సరం వయస్సు గలవారూ ఉన్నారు. 

ఇలా నాలుగు అంకెలు, ఒక అంకె వయస్సును స్వీకరించకుండా సాఫ్ట్‌వేర్‌లో కోడింగ్‌ రాస్తే చాలు, ఈ సమస్య ఉండదు. ఇటువంటి సులువైన సమస్య కూడా పరిష్కరించలేని స్థితిలో ఈఆర్‌ఓ–ఎన్‌ఈటీ ఉండటం గర్హనీయం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కామన్‌ ఓటర్లు సుమారు 20 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి కాబట్టి, వారు మళ్ళీ ఏపీలో ఓటు వేసే అవకాశం ఉన్నందున కామన్‌ ఓటర్లను తొలగించండి అని ఓటరు అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినప్పుడు రెండు రాష్ట్రాలలో ఉన్న కామన్‌ ఓటర్లను (ఒకే ఓటరు ఐడి మీద ఉన్నవారు) గుర్తించే సాఫ్ట్‌వేర్‌ తమవద్ద లేదని తెలిపారు.

దొంగ ఓటర్ల మాఫియా
గ్రామాల్లో వలె, పట్టణాలలో ఓటర్లను గుర్తించడం అంత సులువు కాదు. దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని మాఫియాలు వేలకొద్దీ ఓట్లను చేర్పించి రాజకీయ పార్టీలతో ఒక్కో ఓటరుకు వేల చొప్పున బేరం కుదుర్చుకుం టారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం నామినేషన్‌ ముగిసే రోజు వరకు ఓటర్లను చేర్పించే అవకాశం ఉంటుంది. వాటిపై అభ్యంతరాలు తెలియజేసే సమయం ఉండదు కాబట్టి చివరి రోజుల్లో వేలకొద్దీ కొత్త ఓటర్లను చేరుస్తారు. పోలింగ్‌ తేదీ దగ్గరవుతున్నపుడు ప్రత్యర్థి పార్టీలు ఈ విషయాన్ని గమనించే స్థితిలో ఉండవు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒకే ఇంటి అడ్రసు మీద పదుల వందల సంఖ్యలో ఓట్లు చేరుస్తారు. (వీరిని ఘోస్ట్‌ ఓటర్లు అంటారు). ఉదాహరణకు మలక్‌పేట నియోజక వర్గంలో 16–8–131 నంబరు గల ఇంట్లో 694 ఓట్లు ఉన్నాయి. కాని ఆ ఇంట్లో వాస్తవంగా ఉన్నవారి సంఖ్య 5 మాత్రమే. ఒకే ఇంటి అడ్రస్‌పైన వందల కొద్దీ ఓట్లు నమోదు అయినా సదరు బీఎల్‌ఓ ఎందుకు గుర్తించలేదు? ఒక్కో బూత్‌కు 20 ఓట్లు ఇలాంటివి ఉన్నా అభ్యర్థుల విజయావకాశాలు తారుమారు అవుతాయి. 

ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కోసం ఎన్నికల సంఘం 2008లో బీఎల్‌ఏ (బూత్‌ లెవల్‌ ఏజెంట్లు) వ్యవస్థను ఏర్పాటు చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్షుడు లేదా సెక్రటరీ లేదా పార్టీ నిర్వహణ బాధ్యుడు ప్రతి జిల్లాలోనూ ఒక ప్రతినిధికి బీఎల్‌ఏ నియమించే అధికారం కలిగించవచ్చు. బీఎల్‌ఏలకు బీఎల్‌ఓ (బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌) సంబంధిత బూత్‌ ఓటరు లిస్టు అందింపజేస్తారు. ఓటర్ల మరణాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి బీఎల్‌ఏలు చేర్పులు లేదా అభ్యంతరాలను రోజుకు 10 చొప్పున బీఎల్‌ఓలకు సమర్పించవచ్చు. కానీ ఓటర్ల జాబితాలో అవకతవకలను నిరోధించడానికి ఆయుధంగా ఉపయోగించకలిగిన బీఎల్‌ఏ వ్యవస్థను చాలా రాజకీయపార్టీలు సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాయి.

బోగస్‌ ఓట్ల సమస్యకు పరిష్కారాలు : 
బీఎల్‌ఓలుగా ప్రభుత్వ ఉద్యోగులైన వీఏఓ, వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీ వంటి వారిని నియమించడంవల్ల ఓటర్ల జాబితాలో అవకతవకలకు నేరుగా వారినే బాధ్యులను చేయవచ్చు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని అవకతవకలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘంపై ఒత్తిడి చేయాలి. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ‘‘ఓటర్ల జాబితా మార్పు సమయంలో’’ అన్ని గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో సమావేశం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు మార్పులు/ చేర్పుల జాబితా వారికి అందజేసి అభ్యర్థనలను, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించాలి. రాజకీయపార్టీలు తమ బూత్‌ లెవల్‌ కమిటీలకు ఓటర్ల జాబితాలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తర్ఫీదు ఇచ్చి ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఊరు లేదా ఇల్లు మారిన వారిని గుర్తించి అడ్రస్‌లో మార్పుచేసి ప్రస్తుతం నివాసముం టున్న ప్రాంతంలోని బూత్‌లో వారి ఓట్లు ఉండేలా బూత్‌ కమిటీలు కృషిచేయాలి. ఇది నిరంతర ప్రక్రియగా జరగాలి. ఎన్నికల సంఘం తమ ఈఆర్‌ఓ–ఎన్‌ఈటీలో సమూల మార్పులు చేసి దేశంలో అన్ని రాష్ట్రాల ఓట్లను అనుసంధానం చేసి ఒకదానికొకటి పోల్చుకుని డూప్లికేట్‌ ఓట్లను నిరోధించేలా మార్పులు చేయాలి.

కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్‌ఈఆర్‌పీఏపీ ప్రోగ్రాంలో భాగంగా ఓటరు జాబితాను ‘‘ఆధార్‌’’కు అనుసంధానం చేయడం 2015 మార్చి 3న ప్రారంభించి 2015 ఆగస్టు 11 వరకు కొనసాగించింది. ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో అనుసంధాన ప్రక్రియను నిలిపివేయవలసివచ్చింది. ఆధార్‌ డేటా సురక్షితమైనదని సుప్రీం కోర్టు భావించి ఆదాయపన్ను రిటర్నులకు, పాన్‌కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయవచ్చంటూ తాజాగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఓటరు జాబితాకు ఆధార్‌ను అనుసంధానించే నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని, దానివల్ల అపహాస్యం పాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని రాజకీయపార్టీలు వ్యాజ్యం వేస్తే ఫలితం ఉంటుంది. అలా ఆధార్‌ అనుసంధానం సాధ్యంకాని పక్షంలో బయోమెట్రిక్‌ పద్ధతి అమలుద్వారా అయినా ఈ డూప్లికేట్‌ ఓట్లను నివారించవచ్చు.

వ్యాసకర్త : జి.వి. సుధాకర్‌రెడ్డి, రాజకీయ విశ్లేషకులు 

మొబైల్‌: 94402 92989

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top