జ్వలించే అగ్నిశిఖ జ్వాలాముఖి

Guest Columns On Jwalamukhi 10th death Anniversary - Sakshi

నేడు జ్వాలాముఖి 10వ వర్ధంతి

నిత్య చైతన్యం, నిప్పులు చిమ్మే ఉపన్యాసం, సంకుచితత్వానికి అతీతమైన సహజ గంభీరం, జీవితమంతా ఉద్వేగంతో మాట లకు మంటలు నేర్పిన వ్యక్తి జ్వాలాముఖి. ఆయన ప్రసంగిస్తుంటే ఊపిరి బిగబట్టాల్సిందే! ఆ మాటల జలపాతంలో దూకేయాల్సిందే! దిగంబర కవిగా, విప్లవ కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడైన ఆ అక్షరయోధుడు దశాబ్దం క్రితం శాశ్వత నిద్రలోకి జారేముందు ప్రజలకోసం ఎన్ని  నిద్రలేని రాత్రులు గడిపారో! మనుషులపైన అచంచల ప్రేమతో జీవించిన జ్వాలాముఖి ఈ లోకం నుంచి నిష్క్రమించి నేటికి దశాబ్ద కాలం పూర్తికావస్తోంది. 

సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం 18 ఏప్రిల్‌ 1938లో జన్మించిన వీరవెల్లి రాఘవాచారి సాహిత్య జీవితం ‘మనిషి’ కావ్యం 1958తో ప్రారంభమైంది. స్వీయాత్మక సంస్కరణ వాదంతో గీసిన ఆ భావచిత్రంతో అనుభూతుల అంచులను తాకారు. దిగంబర కవిత్వంతో విశ్వమానవతావాద పతాకను ఎగురవేయడానికి జ్వాలాముఖిగా అవతరించి ‘సూర్యస్నానం’ చేశారు. ఆ ‘సూర్యస్నానం’లోనే ‘కిందపడ్డ నగ్నకళేబరాన్ని ఐరాసకు ‘ఎంబ్లమ్‌’గా చేయాలనుంద’న్నారు. సమాజంలోని కుళ్లును చూసి, మర్యాదలన్నిటినీ పటాపంచలు చేసి, ఆవేశంతో విరుచుకు పడ్డారు.

ఆయనలోని వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలతో ఢీకొన్నాయి. ‘ఓటమీ తిరుగుబాటు’ ద్వారా నక్సల్‌బరీని సాక్షాత్కరింపజేశారు. విప్లవకవిగా మారి, విరసం ఆవిర్భావ చోదకశక్తిగా పనిచేశారు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, జీవిత పాఠాలు చెప్పడమే ప్రవృత్తిగా స్వీకరించారు. ఉపన్యాసం జ్వాలాముఖికి జీవలక్షణం. ఆయన పేరులోనే కాదు, ప్రసంగంలోనూ బద్దలవుతున్న అగ్నిపర్వతం కనిపిస్తుంది. ఆ సుదీర్ఘ ధిక్కారస్వరం ఆయన కవిత్వం లోనూ ప్రతిబింబిస్తుంది. సమూహంలో ఉపన్యసించినా, వ్యక్తులతో మాట్లాడినా ఆ వాక్ప్రవాహం తగ్గేదికాదు. కర్ఫ్యూ ఉన్నా ప్రజల్లోకి చొచ్చుకుపోయేవారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఘర్షణ జరిగినా అక్కడ వాలేవారు. శాంతియాత్రలు చేశారు. శ్రీశ్రీతో కలిసి పౌరహక్కుల కోసం రాష్ట్రమంతా తిరిగినప్పుడు ‘సెడిషన్‌ చార్జ్‌’ పెట్టి జైలులో నిర్బంధించారు.  

విరసంతో విభేదించి, మిత్రులతో  జనసాహితి స్థాపించినా, అందులోనూ చీలికలే. జ్వాలాముఖి ఒక వ్యక్తిగా కాకుండా ఎప్పుడూ తన వాగ్ధాటితో ఒక శక్తిగానే కనిపించేవారు. తన భావజాలంతో విభేదించేవారితో కూడా ఆత్మీయంగా వ్యవహరించేవారు. మనుషులపట్ల ఎల్లప్పుడూ ప్రేమ, ఆత్మీయత ఆయనలో కనిపించేవి. మనుషులతో ఎంతో హుందాగా ప్రవర్తించే ఆయన సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేశారు. జ్వాలాముఖి రాసిన ‘వేలాడిన మందారం’ ఉరిశిక్షపై వచ్చిన తొలి నవల. అదొక దిగులు దొంతర. శరత్‌చంద్రుడి జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ‘దేశదిమ్మరి ప్రవక్త’ పేరుతో అనువదించారు. ‘రాంఘేయ రాఘవ’ జీవిత చరిత్రను కూడా అనువదించారు.

‘హత్యలు, ఆత్మహత్యలు వర్గసమాజం దినచర్యలు’ అంటూ నిరసించారు. వర్గాలు లేని మానవ స్వర్గాలను స్వప్నించారు. ‘కోటి స్వరాలు పోరాడందే ఉన్నత సమాజం ఆవిష్కరించదు. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రభవించద’ని స్పష్టం చేశారు. 

రెండు సార్లు చైనాలో పర్యటించారు. భారత్, చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉభయ దేశాల మైత్రికి ఎంతో శ్రమించారు. జ్వాలాముఖి రచనలలో ‘భస్మ సింహాసనం’ అత్యుత్తమ కావ్యం. గోద్రా అనంతర అల్లర్ల సందర్భంగా గుజరాత్‌లో రెండుసార్లు పర్యటించి, అక్కడి బాధితులను ఓదార్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అక్కడి దారుణ సంఘటనలను స్వయంగా విని, కొన్ని దృశ్యాలను కళ్ళారా చూసి చలించిపోయి, ఈ సుదీర్ఘ కవితను ఎంతో ఉద్వేగంగా(2002) రాశారు. 

‘నమస్తే సదా హత్యలే మాతృభూమి నిస్సిగ్గు దగ్ధభూమి’/‘తెగిపడిన ఆర్తనాదాలు దయలేని వందేమాతరాలు’ అంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోద్రా అల్లర్లపై ఎవరూ ఇంత నిక్కచ్చిగా, ఉద్వేగంగా రాయలేదు. ‘పీడిత జన సుఖాయ ప్రజాస్వామ్యం శరణం గచ్ఛామి/ తాడిత జన హితాయ లౌకిక రాజ్యం శరణం గచ్ఛామి/ శోషిత జన శుభాయ సామ్యవాద శరణం గచ్ఛామి/బాధిత జన మోక్షాయ విప్లవ శరణం గచ్ఛామి’ అంటూ ప్రవచించిన విప్లవ స్వాప్నికుడు జ్వాలాముఖి.


వ్యాసకర్త : ఆలూరు రాఘవశర్మ, సీనియర్‌ పాత్రికేయులు
ఈ- మెయిల్‌:  alururaghavasarma@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top