విలువలు మరచి పొత్తుల వెంపర్లాట

Congress And TDP Alliance Illegal says Shekhar Gupta - Sakshi

జాతిహితం

తెలుగుదేశం పార్టీకీ కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ముసిముసినవ్వులతో కూడిన ఫొటోలు, అనంతరం పొత్తు ప్రకటనలు దేన్ని సూచిస్తున్నాయి? 2013లో తన కుమారుడిని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతోనే సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించారంటూ చంద్రబాబు నిందించారు. కానీ అదే రాహుల్‌ని చంద్రబాబు ఇప్పుడు చిరునవ్వుతో కౌగిలించుకుంటున్నారు. భయపెడుతున్న ఉమ్మడి శత్రువు కంటే మిమ్మల్ని ఐక్యపర్చేది మరొకటి ఉండదు మరి. బీజేపీని 2019 ఎన్నికల్లో ఓడించాలంటే బలమైన నాయకుల దన్నుతో స్థానిక పోరాటాలు చేపట్టాల్సి ఉందన్న గ్రహింపు బలపడుతోంది. ఈ పొత్తుల వెంపర్లాటలో పార్టీల సైద్ధాంతిక విలువలు గాల్లో కలిసిపోవడమే విషాదం.

విదూషక యువరాజు, కాపలాదారే దొంగ వంటి పరస్పర ఆరోపణలతో మన రాజ కీయ ప్రసంగాలు హోరెత్తుతూ మనకు చీదర కలిగిస్తున్న సమయంలోనే, అరుదైనదే అయినప్పటికీ ఊహించదగిన పరస్పర ఉల్లాస, ఉత్సాహాల సంరంభం దేశ రాజకీయ భూమికపై చోటు చేసుకుంది. ఇక్కడే నిజమైన రాజకీయ క్రీడ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకీ కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ముసిముసినవ్వులతో కూడిన ఫొటోలు, అనంతరం పొత్తు ప్రకటనలు దీనికి సంబంధించి ఒక ఉదాహరణ మాత్రమే. బద్ధశత్రువులు కౌగలించుకుంటున్నారు. పాత స్నేహితులు వెదుకులాట మొదలెట్టి కొత్త పొత్తులకోసం చూస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం భాగస్వాముల కోసం వెతుకుతున్న విడివిడి వ్యక్తులు కూడిన బార్‌లాగా కనిపిస్తున్నట్లయితే, 2019 ఎన్నికలు ఎలా జరుగనున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు.

ఒక శక్తివంతుడైన ప్రత్యేకించి మెజారిటీని సాధించి ఉన్న నాయకుడు ఎన్నడూ (లేక ఇంతవరకు) తన పోటీదారు చేతిలో పరాజయం పొందలేదని భారత రాజకీయ చరిత్ర మీకు తెలుపుతుంది. అలాంటి నాయకుడు మాత్రమే తనను తాను ఓడించగల శక్తిని కలిగి ఉంటాడు. లేదా 1977లో ఇందిరాగాంధీ ఉదంతాన్ని బట్టి  ‘నాయకురాలు’ అని చెప్పవచ్చు. ఇందిరాగాంధీకి సమ ఉజ్జీని చూసి ప్రజలు అప్పట్లో ఓటు వేయలేదు. దక్షిణాదిని మినహాయిస్తే, అత్యవసర పరిస్థితిలో జరిగిన దారుణాలకు గాను ఆమెను శిక్షించాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఇందిరకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇందిరాగాంధీ 1977లో తనను తాను ఓడించుకుని ఉన్నట్లయితే, 1989లో రాజీవ్‌ గాంధీ కూడా అదే పనిచేశారు. దేశంలోని కీలక భూభాగంలో వీపీ సింగ్‌ రాజీవ్‌ వ్యతిరేక ప్రచారం సాగించినప్పటికీ, ఆయన ప్రధానమంత్రి పదవికి స్పష్టమైన అభ్యర్థిగా ఎన్నడూ కనిపించలేదు. పైగా రాజీవ్‌కి ఆయన ప్రతి జోడు కాడు కూడా. షాబానో కేసు నుంచి బోఫోర్స్‌ వరకు తర్వాత అయోధ్య సమస్య వరకు రాజీవ్‌ అడుగడుగునా వేస్తూ వచ్చిన తప్పటడుగులే కాంగ్రెస్‌ పార్టీకి నిబద్ధులై ఉన్న ఓటు బ్యాంకులను ఆగ్రహంలో ముంచెత్తాయి.

మెజారిటీ లేకపోయినప్పటికీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి 2004లో జనరంజక నాయకుడిగా ఉండేవారు. ఆయనకు వ్యతిరేకంగా సమ్మిళితమైన ప్రతిపక్షం కూడా లేదు. తన ప్రధాని పదవికి పోటీదారు కూడా లేడు. అయితే ముందస్తు ఎన్నికలు, భారత్‌ వెలిగిపోతోంది వంటి అతిశయ ప్రకటనలు, కీలకమైన పొత్తుదార్లను పోగొట్టుకుని కొత్త వారిని సంపాదించుకోవడం (ఉదాహరణకు చంద్రబాబు నాయుడు) వంటి చర్యలతో విజయం తమదేనంటూ చాలాముందుగా ప్రకటించుకున్న ఆయన పార్టీ అహంకారం కారణంగానే వాజ్‌పేయి అధికారం కోల్పోయారు. ప్రధానంగా 2002లో గుజరాత్‌ మతఘర్షణల పట్ల దృఢంగా వ్యవహరించడంలో ఆయన అసమర్థత కూడా నాటి పరాజయానికి దారితీసింది. ఆ కోణంలో చూస్తే వాజ్‌పేయి కూడా తన్ను తాను ఓడిం చుకున్నారు. ప్రత్యామ్నాయమే లేదు అన్న అంశం ఒక దృఢమైన వాస్తవంగా ఉన్నప్పటికీ అది మాత్రమే సరిపోదని 1977–2004 మధ్య కాలంలో జరిగిన ఈ మూడు ఎన్నికలు (ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, వాజ్‌పేయి) మనకు బోధిస్తున్నాయి.

ప్రత్యామ్నాయం కనిపించనప్పటికీ కొన్ని సందర్భాల్లో శక్తివంతమైన నాయకుడిని, నాయకురాలిని పడగొట్టాలని నిర్ణయించుకోవడంలో భారతీయ ఓటరులో కనిపించిన ఈ విశిష్టమైన ఉన్మాద ప్రకోపితానంద స్వభావం ఏమిటి? ప్రభుత్వాలు రెండో దశలో కూడా గెలిచిన సందర్భాలను, ఇటీవలి దశాబ్దాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా రెండుసార్లు వరుసగా గెలిచిన సందర్భాలు (1999లో వాజ్‌పేయి, 2009లో మన్మోహన్‌ సింగ్‌) ఉన్నందున, బలమైన నాయకులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగానే ఓడిపోయారని విశ్లేషించలేం. పాలనపై అసంతృప్తి చెందినప్పటికీ మరో ప్రత్యామ్నాయం లేదన్నకారణంతోనే ఓటర్లు కొన్నిప్రభుత్వాలకు వరుస విజయాలను కట్టబెట్టి ఉండవచ్చు. కాని ఓటర్లు ఆగ్రహం చెందినట్లయితే, తదుపరి అధికారంలోకి ఎవరు వస్తారు అనేదాంతో పనిలేకుండా ప్రభుత్వ వ్యతిరేకతను ఓటింగ్‌ సమయంలో ప్రదర్శించాలని భావిస్తుంటారు.

ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్న అంశం ఏమిటంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అలాంటి స్థితిలోకి వచ్చేసిందా? అన్నదే. అందుబాటులో ఉన్న ప్రజాభిప్రాయ పోల్‌ డేటాను పరిశీలిద్దాం. ఇండియా టుడే నేతృత్వంలో జరుగుతున్న హేతుబద్ధమైన సీరియల్‌ పోల్‌ సర్వేలు ఒక సాధారణ ధోరణిని సూచిస్తున్నాయి: మోదీ ప్రభుత్వంపై ప్రజాదరణ స్థిరంగా పతనమవుతోంది.  1977లో, 1989లో లేక 2004లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బలపడిన క్రమం ఇప్పుడు చోటుచేసుకుందని తేల్చిచెప్పలేం. మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంది. అయితే మెజారిటీ లేనిస్థితిలోనే బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది.

ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా మరొకరిని ముందుకు తేవడం అనేది (అది రాహుల్‌ కావొచ్చు లేక మాయావతి కావొచ్చు) తనంతట తానుగా మోదీని ఓడించలేదు. పైగా అది ఆయన విజయానికి హామీనిస్తుంది. అలాంటి ఎంపికను మోదీ అధ్యక్ష పదవికి ఎన్నికలో మాదిరిగా ఎకాఎకీ పోరాటంగా మార్చేస్తారు కూడా. ప్రత్యక్ష పోరాటంలో మోదీని ఢీకొనడానికి ఏ ప్రతిపక్ష నాయకుడూ ఇంకా సిద్ధంగా లేరు. దాంతోపాటుగా మహాఘటబంధన్‌ అనేది ఎప్పటిమాదిరే ఒక భ్రమగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక నాయకుడు లేకుండా మహాఘటబంధనాన్ని మీరు ఏర్పర్చలేరు. మోదీని ఓడించడానికి ఇక్కడ రెండు మార్గాలున్నాయి. 2008–09లో యూపీఏ వలే, మోదీ ప్రజాదరణ పెరగకపోగా, మెల్లమెల్లగా తగ్గిపోతోంది. ఈ ప్రజా అసమ్మతిని ప్రతిపక్షం వచ్చే ఆరునెలల్లో ప్రజాగ్రహంగా మార్చగలదా? అది సాద్యపడవచ్చు, కానీ అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. రాజీవ్‌ గాంధీలాగే మోదీ ప్రభుత్వ స్పందనలో కొన్ని తప్పిదాలు కనపడుతున్నప్పటికీ రఫేల్‌ కుంభకోణం ఇంకా బోఫోర్స్‌లా రూపుదిద్దుకోలేదు.

దేశంలో రైతుల సమస్య, చమురు ధరల సమస్య ఉన్నాయి కానీ, ప్రత్యేకించి ఆహార ధరలకు సంబంధించి హేతుబద్ధమైన ద్రవ్యోల్బణం వీటిని అడ్డుకుంటోంది. ఈ పరిస్థితిని ప్రజాగ్రహం ప్రతిబింబించే ఎన్నికగా రూపొందించడానికి ఒక జయప్రకాష్‌ నారాయణ్‌ లేక ఒక వీపీ సింగ్‌ ఇప్పుడు లేరు. రాహుల్‌ గాంధీ ఆ స్థాయిని ఇంకా సాధించలేదు. అనిల్‌ అంబానీతో బేజీపీ సంబంధంపై, దాని కార్పొరేట్‌ పక్షపాత ప్రచారంపై రాహుల్‌ ఆరోపణ ఇప్పటికీ సముచిత మార్గాన్ని కనుగొనడం లేదు. అదే కార్పొరేట్లతో ప్రత్యేకించి అంబానీలతో కాంగ్రెస్‌ పార్టీ అదే విధమైన సాన్నిహిత్యబంధానికి కలిగి ఉందన్నది తెలిసిందే. ప్రతిపక్ష సైన్యానికి సంబంధించిన ఒక సేనాధిపతిని ముందుపెట్టుకుని మోదీతో ఒక జాతీయ ఎన్నికల్లో తలపడకూడదు. పైగా సైద్ధాంతిక వైరుధ్యాలను తోసిపుచ్చుతున్న ప్రజాభిప్రాయ ప్రాధాన్యత కలిగిన బలమైన స్థానిక నాయకులు, పరిమిత స్థానిక పొత్తులతో కూడిన అనేక చిన్న, రాష్ట్రస్థాయి సమరాల్లో మోదీతో తలపడాలి. శిరోమణి అకాళీదళ్‌తోపాటుగా టీడీపీ భారత్‌లో కాంగ్రెస్‌ పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన ప్రాంతీయపార్టీ. 2013లో తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించారంటూ చంద్రబాబు నిందించారు. కానీ అదే రాహుల్‌ని ఇప్పుడు చంద్రబాబు చిరునవ్వుతో కౌగిలించుకుంటున్నారు. భయపెడుతున్న ఉమ్మడి శత్రువు కంటే మిమ్మల్ని ఐక్యపర్చేది మరొకటి ఉండదు మరి.

ఆంధ్ర–తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా లేదు. కానీ 42 ఏంపీ స్థానాలు కలిగిన ఈ రెండు రాష్ట్రాల్లో పొత్తు లేకుంటే బీజేపీ దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో ఏపీ వర్సెస్‌ బీజేపీలాగా కాకుండా మోదీ వర్సెస్‌ రాహుల్‌గా మార్చడం బీజేపీకి కష్టమైన పనే. తమిళనాడులో బీజేపీకి ఇప్పటికీ సానుకూలత లేదు. ఎందుకంటే ప్రజాదరణ కోల్పోయిన ఏఐడీఎంకే అక్కడ బీజేపీ ఏకైక మిత్రురాలు. కాబట్టి ప్రాంతీయ కూట మికి తదుపరి రంగం తమిళనాడులోనే ఉండవచ్చు. బీజేపీ ఇక్కడ ఏఐడీఎంకేని తిరస్కరించి డీఎంకేతో పొత్తును గెల్చుకోవడాన్ని కూడా మీరు తోసిపుచ్చలేరు. టీడీపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి శాశ్వత శత్రువులే కలిసిపోతున్నప్పుడు, డీఎంకే, బీజేపీ మధ్య పొత్తును ఆపలేం కూడా. అలా జరగకపోతే, బీజేపీని అనేక చిన్న, రాష్ట్ర స్థాయి సమరాల్లో ఎదుర్కోవాలనే కాంగ్రెస్‌/ప్రతిపక్ష వ్యూహం ఒకడుగు ముందుకేస్తుంది.

కాంగ్రెస్, బీజేపీలు ఈ కూటముల్లో గరిష్ట ప్రయోజనాన్ని చూస్తున్నాయి. హరియాణా, చత్తీస్‌ఘర్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి. పంజాబ్‌లో ఇప్పటికీ కాంగ్రెస్‌ వర్సెస్‌ అకాలీదళ్‌గా తప్ప కాంగ్రెస్‌ వర్సెస్‌ మోదీలాగా పరిస్థితులు పరిణమించలేదు. ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్, ఆప్‌ మధ్య ఒడంబడిక కుదురుతుందా? దానికి అవకాశంలేదు. కానీ టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు కుదిరిన తర్వాత అలా జరగదని ఎవరు చెప్పగలరు?

రాజకీయాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహాఘటబంధన్‌ ఉండకపోవచ్చు కానీ రాష్ట్ర స్థాయిల్లో అనేక కూటములు ఏర్పడవచ్చు. ఈవిధంగానే జనరంజకమైన స్థానిక నేతల సాయంతో బీజేపీని చిన్న చిన్న సమరాల్లో ప్రతిపక్షం ఎదుర్కోవచ్చు. ప్రతిపక్షానికి ఉన్న ఈ సౌలభ్యతను తోసిపుచ్చి రాహుల్‌తో అధ్యక్షపాలన తరహా పోటీకి దిగడమే మోదీ–షా వ్యూహం. 2019 ఇలాగే రూపొందనుంది.

- శేఖర్‌ గుప్తా
ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top