తెలంగాణ మాణిక్యం మారంరాజు | Sakshi
Sakshi News home page

తెలంగాణ మాణిక్యం మారంరాజు

Published Sun, May 5 2019 12:34 AM

Article About Writer Maram Raju Satyanarayana Rao - Sakshi

అధ్యాపకుడుగా, ప్రొఫెసర్‌గా, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. సామాజిక అంశాలపై అనేక రచనలు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. ఆయన మాటల్లో, ఆయన నడతలో, ఆయన ఆచరణలో తెలంగాణ తనం ఉట్టిపడుతుంది. తెలంగాణ, ఉర్దూ, పారశీ పదబంధాలు మారంరాజు సత్యనారాయణరావుకు కొట్టిన పిండి. తెలంగాణ గ్రామాయణం ఎలా ఉండేదో అలవోకగా చెప్పుకుంటూ పోయేవారు. హైదరాబాదు రాజ్యపాలనా వ్యవస్థపైన మారంరాజుకు సమగ్రమైన అవగాహన ఉండటంతో ఆయన తెలంగాణ గ్రామీణ వ్యవస్థను రచించేందుకు పూనుకున్నారు. ఆనాటి విధానాన్ని ప్రజలకు, రాజ్యానికి మధ్య ఉండే సంబంధాల్ని మారంరాజు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

‘‘తరమెల్లిపోతున్నది ఆ త్యాగాల స్వరమాగిపోతున్నది’’ అన్న గోరటివెంకన్న పాట సాక్షిగా తెలంగాణ సమాజ మూలాలు తెలిసిన మారంరాజు సత్యనారాయణరావు శనివారం  కన్నుమూశారు. 70 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లా ఉంది? ఆనాటి తెలంగాణ జీవనవిధానం, సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉండేవి? తెలంగాణ సమాజం నిర్మాణం ఎట్లా ఉంది? నిజాం ఏలుబడిలో తెలంగాణ ఎట్లా ఉంది? ఆనాటి పటేల్, పట్వారీ వ్యవస్థలు, గ్రామం, గ్రామ నిర్మాణం, పాలనా వ్యవస్థ, రెవెన్యూ చట్టాలు ఇవన్నీ చూసిన కళ్లు ఈనాటి తెలంగాణ సమాజంలో కొందరివే. అలాంటి రెండు కళ్లు మారంరాజు సత్యనారాయణరావువి. ఆయన జయశంకర్‌ తరం మనిషి. ఆయన గట్టి తెలంగాణవాది. ఇప్పుడు రవీంధ్రభారతి ఉన్న ప్రదేశంలో ఒక హాస్టల్‌ ఉండేదన్న విషయం అందరికీ తెలియదు. 60 ఏళ్ల క్రితం సిటీ కాలేజీ ఎలా ఉండేదో ఈనాటి తరానికి తెలియదు. ఇప్పుడున్న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ఒకప్పుడు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మొట్టమొదటి కార్యాలయమని ఎంతమందికి తెలుసు. ఆ కార్యాలయం నుంచే మారంరాజు సత్యనారాయణరావు తొలి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటాచక్రపాణి ఓపెన్‌ యూనివర్సిటీలో ఉద్యోగం పొందినప్పుడు ఈ సత్యనారాయణరావే సంతకం చేశారు. ఆయన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్‌గా, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రా్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఆయన సామాజిక అంశాలపై అనేక రచనలు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. ఆయన మాటల్లో, ఆయన నడతలో, ఆయన ఆచరణలో తెలంగాణ తనం ఉట్టిపడుతుంది. తెలంగాణ, ఉర్దూ, పారశీ పదబంధాలు మారంరాజుకు కొట్టిన పిండి. ఆయనతో మాట్లాడుతుంటే  తెలంగాణ గ్రామాయణం ఎలా ఉండేదో అలవోకగా చెప్పుకుంటూ పోయేవారు.  

సత్యనారాయణరావు ఖమ్మం ప్రభుత్వ కళాశాలలో రాజకీయశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. భారత రాజకీయ శాస్త్ర సంఘానికి 1982, 83లో జాతీయ కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి రాష్ట్రరాజకీయాలు, మంత్రివర్గాల తీరుతెన్నులపై ఆయన పరిశోధన చేసి ఉస్మా నియా విశ్వవిద్యాలయంనుంచి పిహెచ్‌డీ పొందారు. దాని తర్వాత ‘ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గాలు’ గ్రంథాన్ని ప్రచురించారు. ఆయన రాజనీతిశాస్త్ర అధ్యాపకుడుగా పాఠ్యగ్రంథాలు రాశారు. ‘రాజకీయ, సామాజికశాస్త్రం’, ‘ఎన్నికలు’, ‘రాజకీయాలు’,  ‘ఇది తెలంగాణ’తోపాటు జాతీయ, అంతర్జాతీయ సంబంధాలపై డిగ్రీ, పీజీ విద్యార్థులకు అనేక పాఠ్యాంశాలను రాశారు. ఆయన రాజమండ్రిలో కొంతకాలం అధ్యాపకుడుగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రాంతంలో పనిచేస్తున్న సందర్భంలో తోటి అధ్యాపకులు, విద్యార్థులకు తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ కళలను సవివరంగా చెప్పే వారు. తెలంగాణకున్న ప్రత్యేకత ఏమిటని వాళ్లడిగిన ప్రశ్నలన్నింటినీ 50 ఏళ్ల క్రితమే నివృత్తి చేశానని ఆయన చెబుతుండేవారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గాల తీరుతెన్నులపై ఆయన పరిశోధనలు చేస్తున్న సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రులతో ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసి, వారి పరిపాలనా పద్ధతులను, వారి పాలనా శైలులను సవివరంగా అందించారు.

విశాలాంధ్ర బాధలు అన్న అంశంపై 1970–2000 దశకాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అప్పటి నాయకత్వం తీరుతెన్నులు, ఆంధ్రా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల మధ్య వైరుధ్యాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, రాష్ట్రరాజకీయాలపై దాని ప్రభావం తదితర అంశాలపై ఆయన కూలంకషంగా రాశారు. ఆనాటి రాజకీయపార్టీల తీరుతెన్నులు, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై ఆయన సావధానంగా రాశారు. వరంగల్‌లో మొదలైన ముల్కీ ఉద్యమం, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో కొందరు పరోక్షంగా సహకరించడం, పోలీసు కాల్పుల తర్వాత సిటీ కాలేజీ ఉదంతం, ముల్కీ పూర్వాపరాలు, దాని పుట్టుక, వ్యాప్తి, స్వభావం లాంటి అంశాలపై మారం రాజుకు గట్టిపట్టుంది. 1952–1969 మధ్యకాలంలో జరిగిన రాజకీయపరిణామాలు, హైదరాబాదు రాష్ట్ర అవతరణ, ముల్కీ ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పం దం తదితర అంశాలపై మారంరాజు ఆసక్తికరమైన వాస్తవ అంశాలను చర్చించారు. 

ఘంటా చక్రపాణి మారంరాజు శిష్యుడుగా ఆయన రచనలను వెలుగులోకి తేవాలని తపించాడు. అందుకు నన్ను పురికొల్పాడు. దాంతో మారంరాజు వెంటపడి రెండు పుస్తకాలు తీసుకురావడం జరిగింది. మారంరాజు ఈ తరానికి అందించాల్సిన కొన్ని ముఖ్యపుస్తకాల గురించి ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత ఆనాటి తొలి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు అసెంబ్లీకి సంబంధించిన ఒక డిక్షనరీని ఎంతో కష్టపడి తయారుచేయించారు. ఆ డిక్షనరీని తెలం గాణ పదబంధాలతో ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందని తపించాడు. అందుకోసం కొంతకృషి కూడా చేశారు. ఆనాటి తెలంగాణ సమాజంలో ఉన్న అనేక పదాలకు అర్థాలను చెప్పేవారు. అగ్బార్‌ అంటే వార్తా పత్రిక, అప్సర్‌ అంటే ప్రభుత్వ అధికారి, అసల్‌దార్‌ఖాన్‌ అంటే గ్రామాధికారి తయారుచేసే భూవివరాలలో యాజమాన్యం దాఖల చేసే రికార్డు అని ఇప్పటి వారికి తెలియదు. ఇలాంటి అనేక పదాలను ఈ తరానికి విప్పిచెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన గ్రామా యణం రచనకు పూనుకున్నారు.

భూమి ఆధారిత జనావాసాల కొనసాగింపు, భూమికి సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ, ఆ పదబంధాలు, ఆనాటి భూమికి సంబంధించిన పహాణీలు వీటిపై సమగ్రమైన సమాచారం ఆయనదగ్గరుంది. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఎలాంటి వ్యవసాయ వ్యవస్థ ఉందో సరైన ఆధారాలు ఇప్పటికీ దొరకడం లేదు. సాలార్‌జంగ్‌ సంస్కరణలపై సమగ్రమైన పట్టుంది. హైదరాబాదు రాజ్యపాలనా వ్యవస్థపైన మారంరాజుకు సమగ్రమైన అవగాహన ఉండటంతో ఆయన తెలంగాణ గ్రామీణ వ్యవస్థను రచించేందుకు పూనుకున్నారు. గ్రామాల చరిత్ర మూలాలు ఎప్పట్నుంచి మొదలయ్యాయో రాతపూర్వకంగా రికార్డులు లేవు. ఆనాటి విధానాన్ని ప్రజలకు, రాజ్యానికి మధ్య ఉండే సంబంధాల్ని మారంరాజు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గ్రామ పాలనావ్యవస్థపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ‘తెలంగాణ గ్రామాయణం’ రచనను పూర్తిచేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి అందజేయాలని ఆయన ఎంతో తపనపడ్డారు. కానీ, ఆ పుస్తకాన్ని కేసీఆర్‌కు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. నువ్వు లేకున్నా ఆ పుస్తకాన్ని భద్రంగా అందజేస్తాం. ఈ తరానికి నీ ఊసులన్నీ చెబుతాం. హైదరాబాదు రాష్ట్రాన్ని చూసినవాడా, తెలంగాణ కావాలని తపించి.. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి పోయినవాడా–నీకు సెలవు.

-జూలూరు గౌరీశంకర్,
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు

Advertisement
Advertisement