పిల్లిమాతల్లి

పిల్లిమాతల్లి - Sakshi


వివరం



ఆగస్టు 8 వరల్డ్ క్యాట్ డే. ప్రపంచ పిల్లుల దినోత్సవం. ‘ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్’ (అమెరికా) అనే జీవకారుణ్య స్వచ్ఛంద సంస్థ 2002 నుండి వరల్డ్ క్యాట్ డే ని జరుపుతోంది. ఈ సందర్భంగా పిల్లుల స్వభావాలు, మనుషులతో వాటి సంబంధ బాంధవ్యాల మీద కవర్‌స్టోరీ.

 

ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్‌లో ఒక సింహం, ఒక నక్క ఉండేవట! కొన్నిసార్లు అతడు సింహంలా ఉండేవాడు. కొన్నిసార్లు నక్కలా (గుంట నక్క) మారేవాడు. ఎప్పుప్పుడెలా ఉండాలో తెలిసి ఉండడమే చక్రవర్తి లక్షణమని అతడు అనేవాడు కూడా. అయితే సింహంలోనూ, నక్కలోనూ ఉండని లక్షణం ఒకటి ఆయనలో ఉండేది. అవి రెండూ పిల్లికి భయపడవు కదా... కానీ నెపోలియన్ భయపడేవాడు! ఐరోపాను గజగజలాడించిన ఈ అరివీరభయంకరుడికి పిల్లి అంటే చచ్చేంత భయం.



పిల్లి కంటపడిందంటే నెపోలియన్ వెన్ను చల్లబడేది! పిల్లి నేరుగా కళ్లలో కళ్లు పెట్టి చూసిందంటే నెపోలియన్ గుండె గుబగుబలాడేది. కారణం ఏమిటి? ఏం లేదు. అకారణ భయం. అంతే!! ఒక్క నెపోలియనే కాదు, ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు హిట్లర్, ముస్సోలినీ, జూలియస్ సీజర్ కూడా పిల్లి మాటెత్తితే ‘ఇప్పుడా డిస్కషన్ ఎందుకు’ అన్నట్లు చూసేవారట!!

 

పిల్లి పవర్ పాయింటు దాని చూపు. ఎంతటివాళ్లయినా సరే పిల్లి కళ్లల్లోకి కాసేపు చూస్తే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. తల తిప్పకుండా దాన్నే చూస్తూ ఉండండి. అదీ తల తిప్పకుండా మిమ్మల్ని చూస్తుంటుంది. పైగా దాని చూపు ఎలా ఉంటుందంటే... ‘నీ సంగతి నాకు తెల్సు’ అన్నట్లు! అయితే పిల్లికీ, పెంపుడు పిల్లికీ చూపుల్లో తేడా ఉంటుంది. మనలో ఎన్ని ఎమోషన్లు ఉంటాయో, పెంపుడు పిల్లిలో అన్ని ఎమోషన్లు ఉంటాయి. అది అలుగుతుంది. గారాలు పోతుంది. కోప్పడుతుంది. డిమాండ్ చేస్తుంది. భయపడుతుంది. హొయలు పోతుంది. సెకలు పడుతుంది. నటిస్తుంది. మంచీచెడ్డా పాటిస్తుంది కూడా. బయటి పిల్లిలో ఇవన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర బయట పెట్టదు. పరాయి మనుషులం కదా, అందుకు.

 

పిల్లి, కుక్క రెండూ పెంపుడు జంతువులే అయినా ఎంచేతనో పిల్లి ప్రత్యేకం అనిపిస్తుంది. కుక్క మనల్ని యజమానిలా భావిస్తే, పిల్లి మన యజమానిలా ఫీలవుతుంది! ‘తిన్నాకైనా పెట్టకపోతారా’ అన్నట్లు కుక్క చూస్తే, ‘పెట్టకుండా తినేస్తారా’ అన్నట్లు పిల్లి చూస్తుంది. విన్‌స్టన్ చర్చిల్  పిల్లికి భయపడతారో లేదో కానీ, పిల్లిపై ఆయనకు పీకల వరకు కోపం ఉన్నట్లుంది. ‘‘ఐ లైక్ పిగ్స్. కుక్కలు మనల్ని అధికుల్లా చూస్తాయి. పిల్లులు మనల్ని అధముల్లా చూస్తాయి. పందులొక్కటే తమతో సమానంగా చూస్తాయి’’ అంటారాయన. పాపం, ఆయన్ని పిల్లులు ఎందుకని తీసిపడేశాయో మరి.

 

లోకంలో ఎన్ని పెంపుడు కుక్కలు ఉన్నాయో, అన్ని పిల్లులూ ఉన్నాయి. అయితే కుక్కల మీద లేనన్ని సామెతలు, నమ్మకాలు పిల్లుల మీద ఉన్నాయి. కుక్కల మీద లేనంత వ్యతిరేకత, ఉదాసీనత పిల్లుల మీద ఉన్నాయి. బహుశా పిల్లి బిహేవియర్ అందుకు కారణం కావచ్చు. చాలాసార్లు అది మనిషిలా ప్రవర్తిస్తుంది. పిల్లిలా ఉండదు. పెంపుడు కొడుకులానో, కూతురులానో ఉంటుంది. అల్బర్ట్ స్విట్జర్ ఫ్రెంచి వైద్య నిపుణులు. ఇంకా ఫిలాసఫర్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. జీవితాన్ని భక్తితో ప్రేమించినందుకు ఆయనకీ బహుమతి వచ్చింది. జీవితాన్నే కాదు, ఆయన తన పిల్లుల్ని కూడా ప్రేమించారు.

 

ఎంతగానంటే, జీవితంలో విషాదాలను మరిపించేవి రెండే రెండని ఆయన అంటారు. ఒకటి: సంగీతం. రెండు: పిల్లులు అట. దీనికి విరుద్ధంగా క్రిస్టోఫర్ హికెన్స్ (బ్రిటిష్ అమెరికన్ రచయిత) పిల్లిపై అక్కసు వెళ్లగక్కారు. కుక్కలకు మనం ఆహారపానీయాలు, ప్రేమానురాగాలు, వాటితో పాటు ఇంట్లో కాస్త చోటు ఇస్తే అవి మనల్ని దేవుడిలా భావిస్తాయట. అదే పిల్లి అయితే తను దేవుణ్ణి కాబట్టి ఇవన్నీ అమర్చిపెడుతున్నారు అనుకుంటుందట! ఈయనకు వంత పాడిన మరో రచయిత మార్క్ ట్వెయిన్.



జంతువులకు కనుక మాటలు వస్తే కుక్కలు మనసులో ఉన్నదంతా వెళ్లగక్కేస్తాయట. పిల్లులు మాత్రం గుంభనంగా చూస్తుండిపోతాయట, ఒక్క మాటైనా అధికంగా మాట్లాడకుండా. అయితే ఇందులో ఏది మంచి లక్షణమో ఆయన చెప్పలేదు. చార్ల్స్ డికెన్స్ మాత్రం పిల్లులకు సపోర్ట్‌గా ఉన్నారు. పిల్లి ప్రేమను మించిన కానుక ఈ లోకంలో ఏముందీ? అంటారాయన.

 

పిల్లి గురించి ఎవరేమనుకున్నా మనిషితో పిల్లి అనుబంధం మాత్రం క్రీ.స్తు.పూర్వం 2000 ఏళ్ల నాటిది. భూమిపై వాటి ఉనికి మాత్రం రెండు కోట్ల యేళ్ల క్రితం నాటి ది. తవ్వుకుంటూ వెనక్కి వెనక్కి పోతే పిల్లి పరిణామక్రమం చాలా అసక్తికరంగా అనిపిస్తుంది. పిల్లి పెంపుడు జంతువుగా మచ్చిక కావడానికి దాదాపు 80 లక్షల సంవత్సరాలు పట్టి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా.


ఈ అంచనాలు ఎలా ఉన్నా పిల్లి కచ్చితంగా మనిషికి చేరువైన కాలం మాత్రం క్రీ.పూ.4000 ప్రాంతంలోనేనంటారు. అదీ ఈజిప్టులో. ఆఫ్రికన్ అడవి పిల్లులు కడుపు చేతపట్టుకుని ఎలుకల కోసం ఈజిప్టులోని ధాన్యపు గోదాముల మీద పడిన కాలం అది. మనుషులను చూసి పారిపోయేవి. అలికిడి తగ్గగానే మళ్లీ ఎలుకల కోసం వచ్చిపోతుండేవి.

 

క్రీ.పూ.2000 నాటికి వీటికి కొంత బెరుకు తగ్గింది. మనుషుల్ని రాసుకుని, పూసుకుని తిరగడం మొదలైంది. ఈజిప్షియన్లు కూడా వాటిని ప్రేమగా ఆదరించి తాము తిన్నదే ఇంత పెట్టేవారు. ముఖ్యంగా పాముల భయం ఉన్నవాళ్లు ఆనాడు ఈజిప్టులో పిల్లుల్ని పెంచేవారు. కొందరైతే పిల్లుల్ని ఆరాధించేవారు. పిల్లి దైశాంశ గల పవిత్ర జంతువని వారి నమ్మకం. అప్పట్లో పిల్లుల్ని వేరే దేశాలకు తీసుకుపోవడంపై ఈజిప్టులో నిషేధం కూడా ఉండేదట.

 

క్రీ.పూ. 1000-500 వచ్చేటప్పటికి ఈజిప్టు ఆగ్నేయాసియాకు, అక్కడి నుంచి ఇండియాకు పిల్లుల సంతతి వ్యాపించింది. మనిషికి పిల్లులు బాగా మాలిమి అయిన దశ అది. పిల్లుల అక్రమ రవాణా జరిగిన దశ కూడా అదే. మరో వెయ్యేళ్లు గడిచేటప్పటికి రోమ్ నుంచి బ్రిటన్ సహా ఐరోపా మొత్తానికి పిల్లుల పరిచయ భాగ్యం కలిగింది. పిల్లుల సామాజ్య్రం కూడా విస్తరించింది.

 

అయితే క్రీ.శ.1400 తర్వాత ఈజిప్టులో పిల్లుల పట్ల వ్యతిరేకభావం మొదలైంది. అప్పటికి వేల ఏళ్లుగా పిల్లిని పూజిస్తున్న ఈజిప్టులో ఏ కారణం చేతనో పిల్లిలో సాతాను అంశ ఉందనే నమ్మకం బయల్దేరింది. మంత్రగత్తెలు మాత్రమే పిల్లుల్ని పెంచుతారనే దురభిప్రాయం ఏర్పడింది. దాంతో పిల్లుల్ని దెయ్యాల్లానో, లేదంటే దుష్టశక్తులుగానో పరిగణించేవారు ఎక్కువయ్యారు. పిల్లుల్ని పెంచుకునేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది.

 

క్రీ.శ.1700 లో అమెరికాలో ఎలుకల మూలంగా ప్లేగు వ్యాధి ప్రబలుతున్నప్పుడు మళ్లీ పిల్లులకు మహర్దశ పట్టింది. అమెరికాలో స్థిరపడిన ఈజిప్షియన్లు ఓడల మీద భారీ సంఖ్యలో పిల్లుల్ని తరలించుకుపోయారు. క్రీ.శ.1800 నాటికి బ్రిటన్‌లో పెంపుడు పిల్లులకు ఆదరణ పెరిగింది. 1871లో తొలిసారిగా లండన్‌లో ‘క్యాట్ షో’ జరిగింది.

 

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో (1914-18) కూడా పిల్లులకు ప్రాధన్యం పెరిగింది. కందకాల్లో శత్రుసైన్యాలు ఉంచిన విషపూరిత వాయువులను గుర్తించేందుకు, యుద్ధనౌకల్లో ఎలుకల బెడదను నివారించేందుకు ఆయా దేశాలు పిల్లుల సహకారం తీసుకున్నాయి. తర్వాత దాదాపు పదేళ్లకు పిల్లుల దశ తిరిగింది. పిల్లులకు ఇంటా బయటా విలువ పెరిగింది. కొన్ని దేశాల్లో పిల్లుల సంరక్షణ చట్టాలు కూడా వచ్చాయి.

 

ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ పిల్లులు, పెంపుడు పిల్లులు స్వేచ్ఛగా తిరిగేస్తూ మనిషి ప్రేమను పొందుతున్నాయి. మనిషికి ప్రేమను పంచుతున్నాయి.

 

బిడాల పురాణం

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందట. ఎక్కడైనా ఇద్దరు అమాయకులు గొడవ పడినప్పుడు ఒక మోసగాడు తీర్పు చెప్పి, ఆ ఇద్దరినీ మోసం చేసే సందర్భంలో ఈ సామెత వచ్చి కూర్చుంటుంది. పిల్లులు మనుషులకు ఏ మాత్రం తీసిపోవు. మనుషుల స్వభావాలను పోల్చడంలో పిల్లులకు పెద్ద పీటే వేశారు. పార్టీలు మార్చేవారిని గోడ మీద పిల్లులని, తను తప్పు చేస్తూ తనను ఎవరూ గమనించట్లేదని భావించినప్పుడు, ‘‘కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదు’’ అనీ ... ఇలాంటి సామెతలకు జన్మనిచ్చింది పిల్లిమాతల్లి. పిల్లిని చంపితే బంగారు బల్లిని చేయించి, కంచిలో ఇవ్వాలని చెప్పించుకుంది ఈ బిడియాల బిడాలం.



పిల్లిరాజు గారి మీద బోలెడు సామెతలు. బోలెడు నమ్మకాలు. గడప దాటి వీధిలోకి అడుగు పెడుతుంటే... పిల్లి ఎదురు రాకూడదని ఒక నమ్మకం. రాజకీయాలలో ఉండేవారు ఎటువైపు లాభం ఉంటే అటు పక్కకు దూకుతారట అచ్చం గోడ మీద పిల్లిలాగ.

 

అంతేనా ఏ పనీ లేకుండా కూర్చోవడం కంటె ఏదో ఒక పనికిరాని పని చేసేవారికి కూడా ఈ బిల్లీ రాజే ఆదర్శం. ‘పని లేని వాడు పిల్లి తల గొరిగినట్టు’ అంటూ పిల్లితో ఉపమానం చెప్పేస్తారు.  అక్కడితో ఆగకుండా పిసినారి గురించి చెప్పటానికి కూడా ఈ పిల్లి మారాజే ఉపయోగపడింది... ‘పిల్లికి బిచ్చం పెట్టనివాడు’ అని.

 

మార్జాలం, బిడాలం, పిల్లి... ఇలా రకరకాలుగా చలామణీ అవుతున్న ఈ బిల్లీ గారి మీద కావలసినన్ని సామెతలు కూడా ఉన్నాయి.  ‘పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణ సంకటం’, ‘అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం’, ‘ఇంట్లో పిల్లి - వీధిలో పులి’, ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’, ‘పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్టు’. ‘కాలు కాలినపిల్లిలా’ ‘మల్లిని చేయబోతే పిల్లి అయినట్టు’... ఇలా!

 

 పిల్లి అనే ప్రాణిని భగవంతుడు సృష్టించి ఉండకపోతే,  ఈ సామెతలన్నీ వచ్చేవా! భాషకు అందం చేకూరేదా! అసలు ఉపమాలంకారమే ఉండేది కాదేమో కదా!

 - డా॥పురాణపండ వైజయంతి

 

నమ్మకాలు

రెండు కానీ అంతకంటె ఎక్కువ గానీ తెల్లని పిల్లులు ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ ఇంటివారికి త్వరలో దరిద్రబాధలు, అనారోగ్యాలు, చిక్కులు సంప్రాప్తిస్తాయట  పెంపుడు పిల్లి ఇల్లు వదిలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందట  వెన్నెల్లో నల్లపిల్లి కనబడితే, ఆ ప్రాంతంలో ఏదో ఒక అంటువ్యాధి ప్రబలుతుందనడానికి సూచిక. (ఐరిష్ ప్రజల నమ్మకం)  పిల్లిని మోసుకుని ఏరును దాటితే జీవితాంతం దురదృష్టం వెన్నంటి ఉంటుందట (ఫ్రెంచి వారి హెచ్చరిక)  పిల్లి తన పాదాలను శరీరం కింద ముడుచుకొని నిద్రపోతే, అది వర్షం వస్తోందనడానికి సూచికట  పిల్లి ఒకసారి తుమ్మితే వర్షం వస్తుందనీ, మూడుసార్లు తుమ్మితే ఆ గృహంలోని వారందరికీ జలుబు చేస్తుందనీ ఓ విశ్వాసం  సింహద్వారం దగ్గర పిల్లి ముఖం శుభ్రం చేసుకుంటే, ఆ ఇంటికి మతాచార్యులు వస్తారని అమెరికన్ల విశ్వాసం.



మార్జాల కిశోర న్యాయం

పిల్లి మీద ఎన్ని వెటకారాలు, చిన్నచూపులు, ఈసడింపులు ఉన్నా, పిల్లల్ని రక్షించుకోవడంలో పిల్లి తరవాతే ఏ జంతువైనా. అందుకే మార్జాలకిశోర న్యాయం అనే జాతీయం పుట్టుకొచ్చింది. పిల్లి తను పెట్టిన పిల్లల్ని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నోట కరచుకొని తీసుకువెడుతుంది. పిల్లలకు ఎక్కడా కష్టం కలగకూడదనేది పిల్లి ఉద్దేశం. అంతేనా నవరత్నాలలో ఉండే వైడూర్యాన్ని క్యాట్స్ ఐ అంటే పిల్లి కన్ను అంటారు. పిల్లి కన్ను రత్నమైతే, పిల్లి కూడా రత్నమే కదా!

 

* పిల్లులు రోజుకు 13 నుంచి 16 గంటల పాటు నిద్రపోతాయి. ఎందుకంటే వాటి శరీర ఎదుగుదలకు అవసరమయ్యే హార్మోన్ నిద్రపోయినప్పుడే విడుదలవుతుంది!

* ఆడ పిల్లులు ఎక్కువగా కుడి చేతి వాటాన్ని, మగపిల్లులు ఎడమ చేతి వాటాన్ని కలిగివుంటాయి!

పిల్లులు వంద రకాలుగా అరవగలవు!

పిల్లుల ఒంటిమీద ఉండే బొచ్చు నీటిలో తడిస్తే... అంత త్వరగా ఆరదు. అందుకే పిల్లులు నీటిలోకి వెళ్లడానికి ఇష్టపడవు!

* పిల్లి గుండె నిమిషానికి 110 నుంచి 140 సార్లు కొట్టుకుంటుంది!

* వీటికి శుభ్రం చాలా ఎక్కువ. మెలకువగా ఉండేదే తక్కువ అంటే... ఆ సమయంలో ఎక్కువశాతం తమను తాము శుభ్రం చేసుకోవడానికే వినియోగిస్తాయి!

భూకంపాలు, సునామీల వంటి ఉత్పాతాలను సంభవించడానికి పదిహేను నిమిషాల ముందే పసిగట్టేస్తాయి!

* వీటి నాలుక మీద ఉండే రుచి మొగ్గలకు తీపిని గుర్తించే శక్తి లేదు!

* ఇవి చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు!

* పుట్టినప్పుడు చాలా పిల్లుల కళ్లు నీలి రంగులోనే ఉంటాయి. కాలం గడిచేకొద్దీ అవి రంగు మారతాయి!

* మనుషుల్ని వేలిముద్రల ద్వారా గుర్తించినట్టు, పిల్లుల్ని ముక్కు ముద్రలతో గుర్తించవచ్చు. ఎందుకంటే ఏ రెండు పిల్లుల ముక్కూ ఒకలా ఉండదు!

* ఎంత ఎత్తుమీది నుంచి పడినా పిల్లి ముందు తన పాదాలనే ఆన్చుతుంది తప్ప పొరపాటున కూడా దాని తల నేలకు కొట్టుకోదు. వాటి శరీర నిర్మాణంలోని ప్రత్యేకత వల్ల అలా జరుగుతుంది!

* మనుషుల్లాగే పిల్లులకూ కలలు వస్తాయి. వారం రోజుల పిల్లగా ఉన్నప్పటి నుంచీ ఇవి కలలు కంటాయట!

* పిల్లుల ఆఘ్రాణశక్తి మనుషుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటి నోటిలోపల పైభాగంలో జాకబ్‌సన్స్ ఆర్గాన్ అనే ఒక అవయవం ఉంటుంది. ముక్కుతో పాటు ఇది కూడా వాసన చూసేందుకు ఉపయోగడపడుతుంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top