ఉత్సవాల వేల్పు పూటకోవాహనంపై ఊరేగింపు

ఉత్సవాల వేల్పు పూటకోవాహనంపై ఊరేగింపు - Sakshi


జగత్కల్యాణం కోసం వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసునికి బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. బ్రహ్మ నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలైనాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (అశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రానికి ముగిసేలాబ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆచారంగా మారింది. ఇవి అంకురార్పణతో ఆరంభమై ధ్వజావరోహణంతో అయిపోతాయి.

 

 ధ్వజారోహణం

 బహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానించడం ఆనవాయితీ. ఒక కొత్తవస్త్రం మీద స్వామివారి వాహనమైన గరుడుని బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. కొడితాడు సాయంతో దీన్ని ధ్వజస్తంభం మీద కట్టి, పైకి ఎగుర వేస్తారు. ఎగిరే ఈ గరుడ పతాకమే సకల దేవతలకు ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

 

 పెద్ద శేషవాహనం

 ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామి కొలువు తీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి ప్రాధాన్యత నిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి.

 చిన్నశేషవాహనం:  రెండవరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. శుద్ధ సత్వానికి ప్రతీక అయిన పరమశివుని హస్తాభరణంగా, గళాభరణంగా విరాజిల్లే వాసుకి చిన్న శేషవాహన రూపంలో శ్రీనివాసుని సేవలో తరిస్తున్నాడు.

 

 హంసవాహ నం

 రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతాడు. హంస పాలను, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా హంస వాహనాన్ని అధిరోహిస్తాడు. హంసపై ఊరేగడం ద్వారా తుచ్ఛమైన కోర్కెలు వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని భక్తులకు చాటుతారు.

 

 సింహవాహనం

 బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహ వాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు.

 

 ముత్యపుపందిరి వాహనం

 మూడవ రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమార సేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి చెబుతాడు.

 

 కల్పవృక్ష వాహనం

 కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే, తన  భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్ప తరువునని చాటుకోవడం కోసం నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు.

 

 సర్వభూపాల వాహనం

 లోకంలో భూపాలురందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ నాలుగోరోజు రాత్రి సర్వ భూపాల వాహనం మీద కొలువుదీరుతారు శ్రీవారు.

 

 మోహినీ అవతారం

 బ్రహ్మోత్సవాలలో ప్రధానమైనది ఐదవ రోజు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే ఆరంభమవుతుంది.  క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది.  

 

 గరుడ వాహనం

 ఐదో రోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతాడు శ్రీనివాసుడు. స్వామివారి మూల మూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది.

 

 హనుమంత వాహ నం

 ఆరవరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి వివరిస్తూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ  తానేనని స్వామివారు తెలియజేస్తారు.

 

 గజ వాహనం

 గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై  ఊరేగుతాడు. గజ వాహనారూఢుడైన  స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

 

 సూర్యప్రభ వాహనం

 ఏడవరోజు ఉదయం ఏడుగుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగుతాడు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.

 

 చంద్ర ప్రభ వాహనం

 ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూమాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణతా, చంద్రుని శీతలత్వమూ తన అంశలేనని తెలియజేస్తారు.



 రథోత్సవం

 గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

 

 అశ్వ వాహనం

 చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద ఊరేగుతారు.  

 

 చక్రస్నానం

 ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసి పోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం చక్రతాళ్వార్‌ను స్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

 

 ధ్వజావరోహణం

 చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభంపై  దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చే యడం ద్వారా వారికి వీడ్కోలు చెబుతారు.

 

 వార్షిక బ్రహ్మోత్సవాలు

 తేది        ఉదయం        రాత్రి

 

 26.09.2014    ధ్వజారోహణం    పెద్ద శేషవాహనం

     (సా.6గం.)

 27.09.2014    చిన్నశేషవాహనం    హంసవాహనం

 28.09.2014    సింహవాహనం    ముత్యపుపందిరి వాహనం

 29.09.2014    కల్పవృక్షవాహనం    సర్వభూపాల వాహనం

 30.09.2014    మోహినీ అవతారం    గరుడవాహనం

 01.10.2014    హనుమంతవాహనం    

 సాయంత్రం    స్వర్ణరథోత్సవం    గజవాహనం

 02.10.2014    సూర్యప్రభ వాహనం    చంద్రప్రభ వాహనం

 03.10.2014    రథోత్సవం (ఉ.7.50)    అశ్వ వాహనం

 04.10.2014    చక్రస్నానం    ధ్వజావరోహణం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top